Road Accidents in Hyderabad : హైదరాబాద్ శివార్లలో ప్రయాణం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
Published: May 21, 2023, 11:49 AM


Road Accidents in Hyderabad : హైదరాబాద్ శివార్లలో ప్రయాణం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
Published: May 21, 2023, 11:49 AM
Road Accidents In Hyderabad : ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం భాగ్యనగరానికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. నగర శివారు ప్రాంతాల్లోనే అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలు ఉండటంతో నగరానికి రాకపోకలు ఎక్కువవుతున్నాయి. దీంతో వాహనాల సంఖ్య పెరిగి.. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదన్న భావనతో వాహనదారులు వేగంగా దూసుకెళ్తున్నారు. ఇవే ప్రమాదాలు పెరగడానికి ముఖ్య కారణాలుగా మారుతున్నాయి.
Road Accidents In Hyderabad : హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారా.. అయితే, నగరానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించండి. లేదంటే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటి తాలూకూ మరణాల్లో ఎక్కువగా హైదరాబాద్ నగర శివార్లలోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లోని రహదారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి పెట్టారు.
రాష్ట్రంలో గత ఏడాది మొత్తం 7,559 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 44 శాతం ప్రమాదాలు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరిగాయి. అందులో నగర నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 శాతం అయితే.. చుట్టుపక్కల విస్తరించి ఉన్న రాచకొండ, సైబరాబాద్‌ల పరిధుల్లో 16 శాతం చొప్పున ఉంది. ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు.. రాచకొండ కమిషనరేట్‌లో 10 శాతం, సైబరాబాద్‌లో 12, రాచకొండలో 10, సంగారెడ్డి జిల్లా పరిధిలో 6 శాతం నమోదయ్యాయి. మొత్తం మరణాల్లో 28 శాతం ఈ ప్రాంతంలోనే సంభవించాయని గణాంకాలు చెప్తున్నాయి.
వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు: వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీనికి తోడు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనే అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలు ఉండటంతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా శివారు ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శివారు ప్రాంతం కావడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదన్న భావనతో చాలా మంది వాహనదారులు వేగంగా దూసుకువెళ్తున్నారు. పైగా భారీ వాహనాలు, లారీలకు మధ్యాహ్నం నగరంలోకి అనుమతి లేనందున.. ఉదయం నుంచి సాయంత్రంలోపు వస్తున్న వాహనాలు శివారు ప్రాంతాల్లోనే నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు సాయంత్రం ఇళ్లకు త్వరగా చేరుకోవాలని వేగంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొని ప్రమాదాల బారినపడుతున్నారు.
ప్రమాదాల నివారణకు అధికారుల కార్యచరణ: రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వేగంగా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి వాటికి జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలకు గురికాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని వాహనదారులకు పలు సూచనలు ఇస్తున్నారు. గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల నుంచి కొంచెం ముందుగానే బయలుదేరాలని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
