ETV Bharat / state

'ఎస్‌ఐగారు ఏమంటారు..! ఇసుక తోలమంటారా.. లేదా? ఎవరు అడ్డుకుంటారో చూస్తాం'..!

author img

By

Published : Jan 29, 2023, 5:45 PM IST

YSRCP Leaders Sand Smuggling: " పార్టీ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశాను.. 15 ఎకరాలు అమ్ముకున్నాను.. అక్కడ కడపలో వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ నేను రాజీనామా చేశాను.. అలాంటిది నన్నే ఇసుక తోలనీయకుండా అడ్డుకుంటారా.. వాడెవడు కేపీ.. రేపు టీడీపీ పార్టీలోకి వెళ్లేవాడు.. అసలు సీఎంను అనాలి" ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఎస్‌ఈబీ అధికారులపై ఏపీలోని వైఎస్సార్​సీపీ నేతలు ఇలా చిందులు వేస్తున్నారు. ఆ సంభాషణలు కాస్త ఫోన్​లో రికార్డింగ్ కావడంతో ఇప్పడు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

YSRCP Leaders Sand Smuggling
YSRCP Leaders Sand Smuggling

'ఎస్‌ఐగారు ఏమంటారు..! ఇసుక తోలమంటారా.. లేదా? ఎవరు అడ్డుకుంటారో చూస్తాం'..!

YSRCP Leaders sand Smuggling: ఆంధ్రప్రదేశ్​లో ఇసుకపై విపక్షాల ఎంత మొత్తుకున్నా, అక్రమ దందా కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఓ మండల స్థాయి నేత తన ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఎస్‌ఈబీ అధికారులపై ఒంటికాలుపై లేచాడు. తనను అడ్డుకునేది ఎవరంటూ మండిపడ్డారు. ‘ఇక్కడ నన్ను ఆపితే.. మా ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీని ఆపినట్లే.. కేపీ సంగతి తేలుస్తాం. అవసరమైతే జగన్‌ ఇంటిముందు ధర్నా చేయగలం..’ అంటూ వైఎస్సార్సీపీ నందిగామ మండల కన్వీనర్‌ శివనాగేశ్వరరావు అరుపులు, కేకలతో మండిపడ్డారు.

పార్టీ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశాను.. 15 ఎకరాలు అమ్ముకున్నాను.. అక్కడ కడపలో వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ నేను రాజీనామా చేశాను.. అలాంటిది నన్నే ఇసుక తోలనీయకుండా అడ్డుకుంటారా.. వాడెవడు కేపీ.. రేపు టీడీపీ పార్టీలోకి వెళ్లేవాడు.. అసలు సీఎంను అనాలి. ఇసుక కాంట్రాక్టు కేపీకి ఇచ్చి తప్పు చేశారు.. ఎస్‌ఐగారు.. ఏమంటారు.. ఇసుక తోలమంటారా.. లేదా.. ఇంకో పది ట్రాక్టర్లు తోలతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. అసలు ఈ రీచ్‌.. జేపీకి ఉందా.. ఉంటే చెప్పమనండి..’

ఇసుక కాంట్రాక్టు సంస్థను, ఓ ప్రజాప్రతినిధిని ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను కేపీ, జేపీ మనుషులు అడ్డుకున్నందుకు శుక్రవారం అర్ధరాత్రి నందిగామ మండలం అంబారుపేట వద్ద జరిగిన గొడవ ఇది. మునేరు నదిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఇసుక కాంట్రాక్టు సంస్థ జేపీ తరపున కొంతమంది (కేపీ నియమించిన మనుషులు) అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నందిగామ నాయకులు గ్రామ సచివాలయం పేరుతో తరలిస్తున్నారు.

తమకు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లు తోలుకోమని చెప్పారని, కేపీ ఎవరని, జేపీ ఏమిటని ఎదురు ప్రశ్నించారు. ఘర్షణ తీవ్ర స్థాయిలో జరగడంతో విషయం పోలీసులు, ఎస్‌ఈబీ అధికారుల దృష్టికి వెళ్లింది. అక్కడికి వచ్చిన పోలీసులు, సెబ్‌ అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనిపై నందిగామ పోలీసు స్టేషన్‌లో జేపీ ప్రతినిధులు, ఎస్‌ఈబీ అధికారులు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రివరకు కేసు నమోదు కాలేదు. మరోవైపు తోలకానికి పంచాయతీ కార్యదర్శి లేఖ ఇచ్చినట్లు చూపిస్తున్నారు. ఈ పంచాయతీ తాడేపల్లి పెద్దలకు చేరుకుంది. కేపీ పార్టీ మారతారని, ఆయనకు ఇసుక కాంట్రాక్టు ఇవ్వడం సీఎం జగన్‌ చేసిన తప్పిదమంటూ చేసిన వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

నేతల మధ్య ఆధిపత్యం..!: ఇసుక అక్రమ రవాణాలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇసుక అనధికారికంగా కాంట్రాక్టు పొందిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. గతంలో జేపీ సంస్థకు కాంట్రాక్టు ఉన్న సమయంలో ఇతరులెవరూ ఇసుక జోలికి వెళ్లకూడదని అధికారులే ఆదేశాలు జారీ చేసేవారు. ప్రస్తుతం అధికారులు, ఎమ్మెల్యేల పేరుతో ఇష్టానుసారం తవ్వకాలు జరుగుతున్నాయి. నాడు-నేడు, సచివాలయాలు, అయిదు రకాల ప్రాధాన్య భవనాల నిర్మాణాలకు అంటూ అక్రమంగా రవాణా చేస్తున్నారు.

పెడన, అవనిగడ్డ, పామర్రు ప్రాంతాల్లోనూ జేపీ పేరుతో కేపీ అనుచరులు పహారా కాస్తున్నారు. స్థానిక నాయకులు గుత్తసంస్థను బెదిరిస్తున్నారు. జిల్లాలో మట్టి, ఇసుక తవ్వకాల్లో ఓ మంత్రి గుత్తాధిపత్యం సాగుతున్న విషయం తెలిసిందే. పక్కజిల్లా ప్రజాప్రతినిధులు, ఎంపీల పేరుతో తవ్వకాలు జరుపుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల నుంచి భారీగా హైదరాబాద్‌కు ఇసుక తరలిపోతున్న విషయం పలుమార్లు వెలుగు చూసింది.

కానీ చర్యలు లేవు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతాయ్య ఇటీవల హైవే మీద లారీలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే సూత్రధారులెవరూ ఇంతవరకు తేల్చలేదు. నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనపై పోలీసులకు జేపీ సంస్థ, ఎస్‌ఈబీ అధికారులు వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పెనమలూరులోనూ స్థానికులు ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు, ఓ మంత్రి అనుచరులకు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.