ETV Bharat / state

ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది: హరీశ్‌రావు

author img

By

Published : Jan 29, 2023, 5:21 PM IST

Harish Rao Released Medical and Health Department Report: దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పురోగతిపై నివేదికను విడుదల చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జిషీట్‌పై మండిపడ్డ హరీశ్‌రావు... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసుకోవాలని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ ఆఖరిస్థానంలో ఉందని విమర్శించారు.

Harish Rao
Harish Rao

Harish Rao Released Medical and Health Department Report: వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా హరీశ్‌రావు... ఏడాదికాలంలో పురోగతిపై నివేదికను విడుదల చేశారు. వైద్యారోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలా 2022లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. దేశంలోనే ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందని తెలిపారు.

ఏడాదిలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని, మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు రానున్నాయని హరీశ్​రావు తెలిపారు. హైదాబాద్‌ నలుమూల నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు పనులు ప్రారంభం కాగా.... వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. 8వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బాలింత మరణాల రేటును 43 శాతానికి తగ్గించి ఈ విషయంలో కూడా దేశంలో మూడోస్థానంలో ఉన్నట్టు వివరించారు.

'మిడ్‌ వైఫరీ సేవల్లో తెలంగాణను కేంద్రం, యూనిసెఫ్‌ ప్రశంసించాయి. టీ డయాగ్నిస్టిక్స్‌ను జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ చెప్పింది. రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలీ కన్సల్టెన్సీ సేవలు అందించి ఆదర్శంగా నిలిచాం. టీబీ నివారణలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వ అవార్డు వచ్చింది. ఎంబీబీఎస్‌ సీట్లలో దేశంలో తొలిస్థానం, పీజీ మెడికల్‌ సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం. ఎంఎన్‌జేలో 300 పడకలు, రోబోటిక్ సేవలు అందుబాటులోకి తెచ్చాం.'-హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

కాంగ్రెస్​ ఛార్జ్​షీట్​పై ఫైర్: వైద్యారోగ్యశాఖపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షిట్‌ విడుదలపై మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలంగాణతో పోల్చిచూసుకోవాలని సూచించారు. డబుల్‌ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్‌ వైద్య సేవల్లో చివరిస్థానంలో నిలిచిందని హారీశ్ గుర్తుచేశారు. కొత్తగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 డయాలసిస్ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ అందుబాటులోకి వచ్చాయన్న హరీశ్​రావు.. త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సుమారు 62 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతేడాది 98 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయని హరీశ్‌రావు వెల్లడించారు.

ఏ రాష్ట్రంలో లేనంతగా వేతనాలు అందిస్తున్నాం: అంతకుముందు... హైటెక్ సిటీ మినర్వా హోటల్లో నిర్వహించిన తెలంగాణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. కేంద్రంతో పాటు... దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని హరీశ్​రావు స్పష్టం చేశారు. తమది ఉద్యోగుల, ప్రజల ప్రభుత్వమని తెలిపారు. ఉద్యోగుల మెడిక్లైమ్ గురించి సీఎం కేసీఆర్​తో చర్చించామన్న హరీశ్​.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు.

ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది: హరీశ్‌రావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.