ETV Bharat / bharat

'దేశంలో ఆవిష్కరణలు కొత్తపుంతలు.. ఆ జాబితాలో ఐదో స్థానంలో భారత్'

author img

By

Published : Jan 29, 2023, 3:16 PM IST

pm modi mann ki baat on Millets and Kakatiya rule
మన్​కీ బాత్​లో మోదీ

దేశంలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో నమోదవుతున్న పేటెంట్ దరఖాస్తులే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పద్మ అవార్డు గ్రహీతల జీవితాల గురించి తెలుసుకోవాలని మోదీ సూచించారు.

దేశంలో పేటెంట్‌ దరఖాస్తులు విదేశీ పేటెంట్‌ దరఖాస్తులతో పోలిస్తే అధికంగా దాఖలవుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. పేటెంట్ ఫిల్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఏడో స్థానంలోనూ, ట్రేడ్‌మార్క్ నమోదులో ఐదో స్థానంలో ఉందన్నారు. గత ఐదేళ్లలో పేటెంట్ రిజిస్ట్రేషన్ 50శాతం పెరిగిందని, దేశంలో పెరుగుతున్న ఆవిష్కరణలకు ఇదే నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. 2023లో మొదటి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు పొందిన వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రధాని.. దేశ ప్రజలకు సూచించారు. పద్మఅవార్డు గ్రహీతల్లో గిరిజన తెగలు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులే అధికంగా ఉన్నారని గుర్తు చేసిన ఆయన.. ఇది భారతీయులు అందరూ గర్వించాల్సిన విషయమని పేర్కొన్నారు. నగర జీవితంతో పోలిస్తే గిరిజన జీవితం భిన్నంగా ఉంటుందని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వారు తమ సంప్రదాయాలను కాపాడుకుంటారని తెలిపారు. పద్మ అవార్డు విజేతల జీవితం నవ తరానికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

"టోటో, హో, కుయ్, కువి, మంద వంటి గిరిజన భాషలపై కృషి చేసిన ఎందరో ప్రముఖులు ఇటీవల పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. సిద్ధి, జార్వా, ఒంగే వంటి గిరిజన తెగలతో పనిచేసే వ్యక్తులను కూడా ఈసారి పద్మ అవార్డులతో సత్కరించుకున్నాం. ఈసారి పద్మ పురస్కారాలు పొందినవారిలో సంగీత ప్రపంచాన్ని సమృద్ధి చేసినవారు ఉన్నారు. పద్మ అవార్డులు పొందిన అనేకమంది.. దేశమే ముందు అనే సిద్ధాంతంతో వారు తమ జీవితాలను అర్పించారు. ఇలాంటి త్యాగాలు చేసిన వారిని సత్కరించుకోవడం... దేశ ప్రజల గౌరవాన్ని పెంచుతుంది. పద్మ పురస్కారాలు పొందిన మహనీయుల ప్రేరణతో కూడిన జీవితాలను తెలుసుకుని ఇతరులతో కూడా పంచుకోండి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మన్​కీ బాత్​లో భాగంగా చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు మోదీ. ఆరోగ్యాన్ని, ఫిట్​నెస్​ను కాపాడుకోవడంలో చిరుధాన్యాలు చాలా ముఖ్యమని ఆయన వివరించారు. దేశంలో యోగా, చిరుధాన్యాల దినోత్సవాలు జరుపుకోవటం వల్ల అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే అవగాహన ప్రజల్లో పెరిగిందని చెప్పారు. వీటి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించి చిరుధాన్యాలవైపు మొగ్గుచూపుతున్నాయని మోదీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.