ETV Bharat / state

ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

author img

By

Published : May 18, 2020, 7:26 AM IST

telangana State Cabinet meeting at 5pm today
ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, నియంత్రిత విధానంలో సాగు ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సాయంత్రం భేటీ కానున్న కేబినెట్... కేంద్ర నూతన మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తుంది. వర్షాకాలం నుంచే నియంత్రిత విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... సంబంధిత అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించనుంది.

రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతి భవన్ కేబినెట్ భేటీ అవుతుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం... తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అటు రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ఇప్పటికే పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం... సడలింపుల విషయంలో కేంద్ర మార్గదర్శకాల కోసం వేచి చూసింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్​... కేంద్ర మార్గదర్శకాల తర్వాత అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో భేటీ కానున్న కేబినెట్... రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలుపై పూర్తిస్థాయిలో సమీక్షించనుంది.

కీలక నిర్ణయాలు

జిల్లాల్లో లేనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి బాగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వలసకార్మికుల్లోనూ కొందరిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాధి నియంత్రణా చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, కేంద్రం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో సడలింపులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఇతర సేవల విషయంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని, నియంత్రిత విధానంలో సాగు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం నుంచే వరి పంటను నియంత్రిత విధానంలో సాగు పద్ధతిని అమలు చేయనున్నారు. వరి సహా అన్ని పంటల సాగుకు సంబంధించి వ్యవసాయరంగ నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్​... మంత్రులు, అధికారులతో ఇప్పటికే చర్చించారు. కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులతో సీఎం ఇవాళ దృశ్యమాధ్యమ సమీక్ష కూడా నిర్వహించనున్నారు. నియంత్రిత విధానంలో సాగుపై మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంబంధిత అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణ, విద్యాసంబంధిత అంశాలు, నీటిపారుదల అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్ట్ సహా ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.