ETV Bharat / state

ఎన్నికలకు ముందా? ఆ తర్వాతా? - తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై జోరుగా చర్చ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 6:49 AM IST

Telangana PCC New President Selection 2023 : రాష్ట్ర కాంగ్రెస్‌ నూతన రథసారథిని ఎంపీ ఎన్నికలకు ముందే ప్రకటిస్తారా? లేక తర్వాత నియమిస్తారా? అనే దానిపై పార్టీ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే స్థానంలో దీపాదాస్‌ మున్సీని నియమించింది. పీసీసీ చీఫ్‌ను కూడా మారుస్తారా అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్లమెంటు ఎన్నికలూ పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోనే జరగాలన్న భావన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Telangana PCC New President
Discussion on Telangana PCC New President

Telangana PCC New President Selection 2023 : పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌ రావ్‌ ఠాక్రేను తెలంగాణ బాధ్యతల నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పించింది. గోవా, దామన్‌, దాద్రానగర్‌ హవేలీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్‌.కృష్ణయ్యతో సమావేశం కావడం, గాంధీభవన్‌కు రప్పించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాష్ట్ర నాయకత్వంతో బేధాభిప్రాయాలున్న నాయకులను ఏకతాటిపైకి తీసుకురాలేక పోవడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

Congress Focus on Parliament Elections 2024 : ప్రొటోకాల్‌ వాహనం కాకుండా ప్రైవేటు వాహనాల్లో ఆయన వెళ్లడంతో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఇవన్నీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతోనే, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఠాక్రేను మార్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రత్యేక పరిశీలకురాలిగా పని చేసిన దీపాదాస్‌ మున్సీని రాష్ట్ర వ్యవహరాల బాధ్యురాలిగా నియమించారు. కేరళ, లక్షద్వీప్‌లతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యలు అప్పగించారు. పార్టీ విధేయురాలుగానే కాకుండా, పార్టీని బలోపేతం చేయడంలో నాయకుల మధ్య విబేధాలను సమసిపోయేట్లు చేయడంలో పట్టున్న నాయకురాలిగా మున్సీకి మంచి పేరుంది.

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌

12కు తక్కువ కాకుండా: మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం 17 ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకోవాలనే కార్యాచరణతో ముందుకెళుతోంది. కనీసం 12కు తక్కువ కాకుండా పార్లమెంటు స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలన్న లక్ష్యంతో పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంటు ఎన్నికలయ్యే వరకు కొనసాగాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ మార్చితే ఎవరికి ఈ అధ్యక్ష బాధ్యతలు పార్టీ అప్పగిస్తుందా అన్న చర్చ పార్టీ నాయకుల్లో కొనసాగుతోంది.

లోక్​సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్​కే అనుకూలం : కొండా సురేఖ

ఆశావహుల లిస్ట్​ పెద్దదే: పీసీసీ అధ్యక్ష పదవిని సంస్థాగత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆశిస్తున్నారు. ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ త్యాగం చేయడం కలిసొచ్చే అంశం. సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లు రవి సైతం పీసీసీ పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈయన మొదటి నుంచీ రేవంత్‌ బృంద సభ్యుడిగా ముద్ర ఉండటం, ఆయన నమ్మిన నాయకుడిగా కొనసాగుతుండటం సానుకూలాంశం. మరోవైపు ఇదే పదవిని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌ కుమార్‌ ఆశిస్తున్నారు.

ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్​: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్‌ నాయకులు మధుయాస్కీ గౌడ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి పీసీసీ పదవిని బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీని మార్చినందున పీసీసీ చీఫ్‌నూ మార్చే అవకాశం ఉందన్న ఉహాగానాల నేపథ్యంలో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి వరిస్తుందో అన్న చర్చ ఊపందుకుంది. ఓటమి పాలైన నేతలకు ఇవ్వొద్దనుకుంటే మాత్రం రేసులో ప్రధానంగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌, మల్లు రవి, ఇరావత్రి అనిల్‌ కుమార్‌ ఉండొచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.