ETV Bharat / state

రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం!

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 12:47 PM IST

Congress Government
Congress Government Move Towards Transparency

Congress Government Move Towards Transparency : తెలంగాణలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసే దిశలో ముందుకు వెళుతోంది. శాఖల వారీగా సమీక్షలు చేస్తూ లోటుపాట్లను ఎత్తిచూపుతూ శ్వేతపత్రాల ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేయడంతో పాటు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, సంక్షేమ, అభివృద్ధి రెండింటినీ సమతుల్యతతో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

Congress Government Move Towards Transparency : తెలంగాణలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పాలన సాగించిన బీఆర్​ఎస్ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తూ వచ్చింది. నిరంకుశ పాలనకు విముక్తి లభించిందని పదే పదే అంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను పరిరక్షించేందుకు తాము పాలన సాగిస్తామని స్పష్టం చేస్తూ వస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, సమీక్షలు చూస్తుంటే ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.

గుడ్ న్యూస్‌ - కొత్త రేషన్ కార్డుల కోసం 28 నుంచి దరఖాస్తులు!

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం రేవంత్​ : గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసం ఉంటున్న ఇంటికి ఉన్న ఇనుప కంచెను తొలిగించిన రేవంత్‌ రెడ్డి దాన్ని ప్రజాభవన్‌గా నామకరణం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani programme) ఏర్పాటు చేశారు. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వానికి పూర్తిగా భిన్నంగా తాజా ముఖ్యమంత్రి పరిపాలనను పరుగెత్తిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం, మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి.

CM Revanth Reddy Hiring Senior Officers : అధికార బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చినందున అందుకు తగ్గట్లు పరిపాలన కొనసాగించేందుకు వీలుగా సీఎం తన జట్టును ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా శివధర్‌ రెడ్డిని నియమించుకున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి ప్రిన్సిపల్‌ కార్యదర్శులుగా శేషాద్రి, చక్రవర్తి, ఐపీఎస్‌ షెహనవాజ్‌ను నియమించుకున్నారు. ఓఎస్‌డీగా కంటోన్మెంట్‌లో సీఈవోగా పని చేసిన అధికారి అజిత్ రెడ్డిని నియమించుకున్నారు.

Three New Police Commissioner Appointed in Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్‌ నగరంలో ముగ్గురు పోలీసు కమిషనర్లను కొత్తగా నియమించుకున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే కొత్తకోట శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్‌ సీపీగా నియమించిన రేవంత్‌ రెడ్డి, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్​గా మరో నిజాయతీ కలిగిన అధికారి అవినాష్‌ మహంతిని, రాచకొండ పోలీస్ కమిషనర్​గా సుధీర్‌ బాబును నియమించుకున్నారు. ట్రాఫిక్‌ చీఫ్‌గా విశ్వప్రసాద్‌ను, సిట్‌ చీఫ్‌గా రంగనాథ్‌లను నియమించుకున్నారు. పోలీసు అధికారుల విషయంలో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డి అధికారుల పనితీరుపై విశ్లేషించిన తర్వాతనే సిఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరో కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం - ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన'

రేవంత్​ రెడ్డి, భట్టి విక్రమార్క తరచూ సమీక్షలు : మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆర్థిక శాఖ, విద్యుత్​ శాఖల మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరచూ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయ, వ్యయాలు, అప్పులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అది కూడా అసెంబ్లీ వేదికగా విడుదల చేయడం, దానిపై చర్చించడం పారదర్శకతకు పెద్ద పీటేసినట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ అమలు : మరోవైపు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచడం రెండింటిని సోనియాగాంధీ పుట్టిన రోజున అమలులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500లకే సిలిండర్‌, రూ.2500లు మహిళలకు ఇవ్వడం లాంటి వాటిని పార్టీలకతీతంగా అర్హులైన వారికి అందించేందుకు గ్రామ కమిటీల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం ద్వారా పారదర్శకతను పెంచినట్లవుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు.

ఇప్పటికే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు పలు మార్లు సమీక్షలు నిర్వహించారు. ఆ శాఖకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు

2024 ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ- మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్​గా చిదంబరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.