ETV Bharat / state

GHMC funds news: బల్దియా నిధులకు రాష్ట్రం ఎగనామం

author img

By

Published : Nov 10, 2021, 11:36 AM IST

Telangana government has not released GHMC funds
బల్దియా నిధులకు రాష్ట్రం ఎగనామం

జీహెచ్‌ఎంసీ నిధుల కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడుదల చేయడం లేదు. బల్దియా నిధులతో చేపట్టాల్సిన పనులు మాత్రం ఎక్కడికక్కడే నిల్చిపోయాయి.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) నిధుల కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా మరోవైపు కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడుదల చేయడం లేదు. రోడ్ల నిర్మాణంతోపాటు వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన గుత్తేదారులకు సకాలంలో నిధులు చెల్లించలేకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు పనులను నిలిపివేశారు. రుణ సేకరణ ద్వారా చేపట్టిన వంతెనలు ఇతరత్రా అభివృద్ధి పనులు మాత్రమే జరుగుతున్నాయి. బల్దియా నిధులతో చేపట్టాల్సిన పనులు మాత్రం ఎక్కడికక్కడే నిల్చిపోయాయి.

ఆస్తి పన్ను వసూలైతేనే ఉద్యోగులు, జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేటాయించడం లేదని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానంలో బల్దియా అధికారులు స్పష్టం చేశారు. సీపీఎం నగర కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే దీనికి సంబంధించి వివరాలను అధికారులు లిఖితపూర్వకంగా వెల్లడించారు.

2014 నుంచి 2021 సంవత్సరం వరకు మొత్తం రూ.2453.91 కోట్లు కేంద్రం విడుదల చేస్తే బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,014.69 కోట్లను మాత్రమే కేటాయించింది. 2018-2020 సంవత్సరాల మధ్య రూ.980.86 కోట్లను కేంద్రం విడుదల చేస్తే రాష్ట్రం ఒక్క పైసా కూడా బల్దియాకు విడుదల చేయలేదని అధికారులు ఇచ్చిన వివరాల్లో స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులతో సంబంధం లేకుండా వివిధ పథకాల కింద కొన్ని నిధులను విడుదల చేయడం వల్లే కొన్ని పనులైనా చేయగలుగుతున్నామని ఒక వైపు అధికారులు చెబుతున్నారు. ఈ నిధులకుతోడు ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల చేస్తే నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుందని సీపీఎం నగర కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తక్షణం నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

....


ఇవీచూడండి: KTR Fire on BJP: కేసీఆర్ సాఫ్ట్ అనుకుంటున్నారేమో.. లోపల ఒరిజినల్ అట్లనే ఉంది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.