ETV Bharat / state

Public Schools Facing Problems: శిథిలమైన తరగతి గదులు.. సర్కారు బడుల్లో పిల్లలకు ముప్పు

author img

By

Published : Dec 28, 2021, 8:01 AM IST

Public Schools
Public Schools

Public Schools Facing Problems: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం పూసాలలోని ప్రాథమిక పాఠశాల. అయిదు తరగతులకు నాలుగే గదులున్నాయి. అక్కడ రెండు అంగన్‌వాడీలతో పాటు వాటర్‌ ట్యాంకు ఉంది. రెండు గదులు పాడుబడి కప్పు సైతం కూలిపోయింది. ఏళ్లు గడుస్తున్నా వాటిని కూల్చనేలేదు. ఫలితంగా ఆవరణలో నాలుగో వంతు స్థలం మూసుకుపోయింది. ఇక్కడ 120 మందికిపైగా విద్యార్థులు ఉండటంతో కనీసం ఆడుకోవడానికి చోటు కరవైంది. సమస్యపై ప్రధానోపాధ్యాయురాలు సుజాతను ప్రశ్నించగా పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Public Schools Facing Problems: పెచ్చులూడుతున్న పైకప్పులు.. ఎప్పుడు కూలిపోతాయో తెలియని గోడలు.. తుప్పుపట్టి బయటపడిన ఇనుప ఊచలతో పగుళ్లిచ్చిన పిల్లర్లు... ఇది రాష్ట్రవ్యాప్తంగా వందలాది సర్కారు బడుల్లో ఆందోళనకర పరిస్థితి. వాటి మరమ్మతులు, కొత్త గదుల నిర్మాణాలను పట్టించుకోని విద్యాశాఖ.. కనీసం శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడంపైనా దృష్టి పెట్టడం లేదు. పాఠశాల ప్రాంగణంలోనే ఆ పాడుబడిన నిర్మాణాలు ఉండటంతో.. చిన్నారులు అటువైపు వెళ్లి ఆడుకుంటున్నారు. గట్టిగా నెడితే పడిపోయే స్థితిలో ఉన్న ఆ భవనాలతో పిల్లలకు ఎప్పుడు, ఎలాంటి హాని జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వారు అటు వెళ్లకుండా కాపలా కాయాల్సి వస్తోందని వాపోతున్నారు.సమస్య విద్యాశాఖ అధికారుల ముందుకు తీసుకెళ్లినా వారు జడ్పీ అధికారులకు లేఖలు రాసి ‘మమ’ అనిపించుకుంటున్నారు.

అసలే స్థలం కరవు...

రాష్ట్రవ్యాప్తంగా 2018లోనే ఏకంగా 1600 పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, తరగతి గదులు ఉన్నట్లు లెక్కతేలింది. వాటిని కూల్చివేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చినా నేటికీ అనేకచోట్ల ఎలాంటి చర్యలూ లేవు. పాడుబడిన ఆ నిర్మాణాల సంఖ్య ఇప్పటికి కనీసం 3వేలకు చేరవచ్చని అంచనా. ఆయా బడుల్లో అవసరమైతే కొత్తవి నిర్మించాలి. లేకుంటే కూల్చివేయాలి. ఈ రెంటినీ ప్రభుత్వం చేయడం లేదు. వాటిని తొలగిస్తే కొంత స్థలం అక్కరకొస్తుందని, పిల్లలు ఆటలాడుకోవడానికి వీలవుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

కూల్చడానికీ ఎంత తంతో..

ఒక భవనం/తరగతి గది వినియోగానికి పనికిరాకుంటే ముందుగా ఆర్‌ అండ్‌ బీ విభాగం అంచనా కట్టి ధ్రువీకరించాలి. తర్వాత వాటిని కూల్చాలని విద్యాశాఖ జిల్లా పరిషత్తు అధికారులకు రాస్తారు. అప్పుడు కూల్చివేతకు ఎంత ఖర్చవుతుందో జడ్పీ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు అంచనా వేస్తారు. ఇందుకు అవసరమైన నిధులు ఎవరు భరించాలన్న అంశమూ జాప్యానికి కారణమవుతోంది. హైదరాబాద్‌ పాతబస్తీలోనే పదుల సంఖ్యలో పాడుబడిన భవనాలున్నా వాటిని కూల్చడం లేదు. దశాబ్దాలుగా సమస్య తీరడం లేదు.

శిథిలమైన గది

శిథిలమైన ఈ గది నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం బాకుర ఉన్నత పాఠశాలలోనిది. ఇక్కడ గదుల కొరత తీవ్రంగా ఉంది. 700 మందికిపైగా విద్యార్థులున్నా కొత్త గదులు నిర్మించడం లేదు. పాడుబడిన రెండు గదులను ఏళ్ల తరబడి అలాగే ఉంచుతున్నారు తప్ప పడగొట్టడం లేదు.

శిథిలావస్థకు చేరిన భవనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం 2 ఇంక్లైయిన్‌ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఇది. 1950 దశకం చివర్లో నిర్మించిన ఈ భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. తలుపులు లేకపోవడంతో పిల్లలు లోపలికి వెళ్లకుండా చూసుకోవడం కష్టంగా ఉందని ఉపాధ్యాయుడు మధుసూదన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.