ETV Bharat / state

రాష్ట్రంలో వ్యవసాయం సహా అన్ని రంగాల్లోనూ గణనీయ పురోగతి

author img

By

Published : Feb 7, 2023, 7:41 AM IST

Planning Department Has Prepared 2023 Report: వ్యవసాయం సహా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం గణనీయ పురోగతి సాధిస్తోందని, తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిరేటు 15.6 శాతంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రజల తలసరి ఆదాయం 5 నుంచి ఆరేళ్లలో రెట్టింపు అవుతోందని ఇదే సమయంలో దేశంలో సగటున 8 నుంచి తొమ్మిదేళ్లు పడుతోందని తెలిపింది. ఏడేళ్లలో 74 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చామని వరి ఉత్పత్తి ఏకంగా 342 శాతం పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో సగటున ప్రతి వంద మందికి 105 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు తేలింది.

Planning Department Has Prepared 2023 Report
Planning Department Has Prepared 2023 Report

రాష్ట్రంలో వ్యవసాయం సహా అన్ని రంగాల్లోనూ గణనీయ పురోగతి

Planning Department Has Prepared 2023 Report: గతేడాది కాలంగా అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని రూపొందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలు, వివరాలు, సమాచారంతో 2023 నివేదికను ప్రణాళికశాఖ రూపొందించింది. 2022-23లో రాష్ట్ర స్థూలఉత్పత్తి 13.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

జీఎస్డీపీ వృద్ధి 15.6 శాతం ఉందని జీడీపీ వృద్ధి 15.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదికి జీఎస్డీపీ వృద్ధి 16 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2022-23లో రాష్ట్ర స్థూల విలువకు సేవా రంగం 62.8 శాతం, పరిశ్రమలు 19 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాలు 18.2 శాతం జోడించినట్లు సర్కార్‌ తెలిపింది. ప్రజల తలసరి ఆదాయం 3.17 లక్షలుగా పేర్కొంది. జాతీయ సగటైన లక్షా 71 వేల కంటే లక్షా 46 వేలు అధికంగా ఉన్నట్లు వివరించింది.

2018-21 మధ్య రాష్ట్ర సొంత పన్నుల రాబడుల్లో వార్షిక వృద్ధిరేటు 4.78 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తం రాబడుల్లో పన్నులు, పన్నేతర ఆదాయమే 73.1 శాతం ఉందని, ఇది స్వయం సమృద్ధికి నిదర్శనమని వివరించింది. 2018-21 మధ్య మొత్తం ఖర్చులో అభివృద్ధి వ్యయం 78.1 శాతంగా ఉన్నట్లు తెలిపింది. కోవిడ్‌ అనంతర పరిణామాల్లో 2020-21తో పోలిస్తే, 2021-22లో మూలధన వ్యయం 63 శాతం మేర 25 వేల 954 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది.

వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది: 2018-21 మధ్య జీఎస్డీపీలో అప్పుల శాతం 24.7 శాతంగా ఉందని తెలిపింది. స్థూల విలువలో వ్యవసాయ వాటా 2014-15లో 76 వేల 123 కోట్లు ఉండగా, 2022-23 నాటికి 2 లక్షల 17 వేల 877 కోట్లకు చేరుకుందని, వార్షిక వృద్ధిరేటు జాతీయ సగటైన 9.97 శాతాన్ని అధిగమించి. 14.05 శాతంగా నమోదైనట్లు సర్కారు వివరించింది.

2014-15 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం 117 శాతం పెరిగి, అదనంగా 74.32 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరిందని.. తద్వారా వరి, ఇతర వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 2015-16లో 45.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2021- 22 నాటికి ఏకంగా 342 శాతం పెరిగి 202.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరినట్లు తెలిపింది.

పత్తి ఉత్పత్తి 18.85 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25.08 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 5.25 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తితో, తెలంగాణ విత్తన రాజధానిగా మారిందని, తాండూరు కందిపప్పుకు జీఐ ట్యాగ్ లభించిందని, 68 వేల 440 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందని తెలిపింది. గొర్రెల జనాభాలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని, 2012 నుంచి 2019 వరకు 48.5 శాతం పెరిగినట్లు పేర్కొంది.

గుడ్ల ఉత్పత్తిలో మూడు, మాంసం ఉత్పత్తిలో ఐదు, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో నిలిచింది. టీఎస్సైపీఏఎస్ఎస్ ద్వారా రాష్ట్రానికి 20 వేల 237 కోట్ల పెట్టుబడులతో, 2 వేల 518 పరిశ్రమలు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామిక ఎగుమతుల నివేదిక ప్రకారం ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని, 2021-22లో 81 వేల 971 కోట్ల విలువైన ఎగుమతులు చేసినట్లు పేర్కొంది.

దేశంలోనే ఉత్తమ ఇంక్యుబేటర్‌గా టీహబ్ నిలిచిందని, రాష్ట్రంలో మూడోవంతుకుపైగా సేవారంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది. 2014-15లో ఐటీ ఎగుమతుల విలువ 66 వేల 276 కోట్లు కాగా, 2021-22 నాటికి లక్షా 83 వేల 569 కోట్లకు చేరుకున్నట్లు తెలిసింది.

గతేడాదితో పోలిస్తే 106 శాతం వృద్ధి: ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు 3.7 లక్షల నుంచి 7.8 లక్షలకు పెరిగినట్లు గుర్తుచేసింది. 2022 ఏప్రిల్, అక్టోబర్ మధ్య శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోటి 16 లక్షల మంది ప్రయాణికులు వచ్చారని గతేడాది ఇదే సమయంలో వచ్చిన 56 లక్షల మందితో పోలిస్తే 106 శాతం పెరిగినట్లు తెలిపింది. కార్గో రవాణా బాగా పెరిగినట్లు పేర్కొంది.

రాష్ట్రంలో 4.08 కోట్ల టెలిఫోన్ కలెక్షన్లు ఉండగా, అందులో 98 శాతం మొబైల్ వినియోగదారులేనని, రాష్ట్రంలోని 100కి సగటున 105 మొబైల్ కనెక్షన్​లో ఉన్నట్లు పేర్కొంది. జాతీయ సగటు 83 కాగా ఆ విషయంలో రాష్ట్రం దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 9 స్థానంలో ఉన్నట్లు వివరించింది. హరితహారం కార్యక్రమం ద్వారా 270 కోట్లకు పైగా మొక్కలు నాటామని, ఆరేళ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85 శాతం పెరిగినట్లు తెలిపింది.

నిఘా ఉన్న నగరాల్లో హైదరాబాద్​కు 16వ స్థానం: రాష్ట్రంలో 10 లక్షల 13 వేల 294 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ సర్వే ప్రకారం.. ప్రపంచంలోని 20 ఉత్తమ నిఘా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచిందని సామాజిక, ఆర్థిక నివేదిక తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.