ETV Bharat / state

KTR US TOUR: ముగిసిన కేటీఆర్ పర్యటన.. ఒకే రోజు రూ.3,315 కోట్లు

author img

By

Published : Mar 28, 2022, 4:13 AM IST

KTR US TOUR
కేటీఆర్‌ అమెరికా పర్యటన

KTR US TOUR: పెట్టుబడులే లక్ష్యంగా సాగిన కేటీఆర్‌ అమెరికా పర్యటన ముగిసింది. ఒకే రోజు రూ.3,315 కోట్లు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. అమెరికాలోని అంతర్జాతీయ జీవశాస్త్రాలు, ఔషధ రంగాలకు చెందిన నాలుగు సంస్థలు తెలంగాణలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయి.

KTR US TOUR: అమెరికాలోని అంతర్జాతీయ జీవశాస్త్రాలు, ఔషధ రంగాలకు చెందిన నాలుగు సంస్థలు తెలంగాణలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయి. ఒకే రోజు రాష్ట్రానికి రూ.3,315 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌, స్లేబ్యాక్‌ ఫార్మా, యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మాకోపియా, క్యూరియా గ్లోబల్‌ సంస్థల ప్రతినిధులతో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఆదివారం సమావేశమయ్యారు. ముందుగా న్యూయార్క్‌లో ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ జాన్‌ మాల్డోనాడోతో భేటీ అయ్యారు. 1984లో ఏర్పాటైన తమ సంస్థ 42 దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక, రిటైల్‌, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని మాల్డోనాడో తెలిపారు. తెలంగాణలో అనుకూలతల దృష్ట్యా ఇక్కడ భారీ పెట్టుబడులకు నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఏ కెమ్‌ ఔషధ సంస్థ, అవ్రా ల్యాబొరేటరీలో రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఈ రెండు కంపెనీలకు ఆరు తయారీ యూనిట్లు, మూడు పరిశోధన కేంద్రాలుండగా 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, తమ పెట్టుబడుల ద్వారా ఆయా సంస్థల విస్తరణతో పాటు ఉపాధి రెట్టింపవుతుందన్నారు.

స్లేబ్యాక్‌ ఫార్మా రూ.1,500 కోట్లు: అనంతరం మంత్రితో స్లేబ్యాక్‌ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈవో అజయ్‌సింగ్‌ భేటీ అయ్యారు. న్యూజెర్సీ కేంద్రంగా గల తమ సంస్థ హైడ్రాక్సీప్రొజెస్టెరాన్‌ తదితర జనరిక్‌ ఔషధాల తయారీలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో వచ్చే మూడేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సీజీఎంపీ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్‌ ఫార్మాలో తమ సంస్థ రూ. 2,300 కోట్ల పెట్టుబడులతో మూడు యూనిట్లు స్థాపించిందని, 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్త పెట్టుబడుల ద్వారా వెయ్యిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ యూఎస్‌ ఫార్మాకోపియా ముఖ్య ఆర్థిక అధికారి స్టాన్‌ బుర్హాన్స్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు రీజియన్స్‌, వ్యూహ, నిర్వహణ అధికారి కేవీ సురేంద్రనాథ్‌లు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. జినోమ్‌వ్యాలీలో రూ.15 కోట్లతో నిరంతర ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో కేటీఆర్‌ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కూడా ఉన్నారు.

నేడు హైదరాబాద్‌కు పయనం
మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన ఆదివారంతో ముగిసింది. ఆయన సోమవారం తెల్లవారుజామున బయల్దేరి మంగళవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

రూ. 50 కోట్లతో ‘క్యూరియా’ విస్తరణ: న్యూయార్క్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ గత ఏడాది హైదరాబాద్‌లో క్యూరియా గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీసెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని, దానిని రూ.50 కోట్లతో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌తో సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, సీఐవో ప్రకాశ్‌పాండియన్‌ తెలిపారు. ప్రస్తుతం అక్కడ 115 మంది ఉద్యోగులుండగా.. విస్తరణ ద్వారా మరో 100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా కేటీ రామారావు నాలుగు సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్ర ఔషధ, జీవశాస్త్రాల రంగం మరింత పురోగమిస్తుందన్నారు.

ఇదీ చూడండి:
TSPSC OTR: ఓటీఆర్​లో సవరణలకు ఛాన్స్​.. నేటి నుంచే అందుబాటులోకి..

IPL 2022: పంజాబ్ బోణీ.. ఆర్సీబీ​పై ఘన విజయం

Aviation Show: సందడిగా సాగిన ఏవియేషన్‌ షో.. విమానాల విన్యాసాలు అదుర్స్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.