ETV Bharat / state

IPL Betting Gang Arrested : ఐపీఎల్ టైమ్​లో​ జోరుగా బెట్టింగులు..​ మరో 3 ముఠాల అరెస్ట్

author img

By

Published : May 10, 2023, 5:28 PM IST

IPL Betting Gang Arrested In Hyderabad : ఐపీఎల్​ జోరులో కొంతమంది క్రికెట్‌ అభిమానుల బలహీనతను బెట్టింగ్‌ రాయుళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా పెద్దఎత్తున బెట్టింగ్‌ నిర్వహిస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. కొన్నిరకాల యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్​లో పందెం రాయుళ్లు రెచ్చిపోతూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఇప్పటివరకు మూడు వేర్వేరు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలు పోలీసులకు పట్టుబడడం కలకలం రేపుతోంది.

IPL Betting
IPL Betting

IPL Betting Gang Arrested In Hyderabad : రాష్ట్ర రాజధానిలో క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతూ కొందరు క్రికెట్‌ అభిమానుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమై ఇప్పటికే 40 రోజులు పూర్తయ్యాయి. పదుల సంఖ్యలో బెట్టింగ్‌ ముఠాలు పోలీసులకు పట్టుబడ్డాయి. పోలీసుల నిఘా, దాడులు అధికం కావడంతో బెట్టింగ్‌ రాయుళ్లు తమ రూట్​ మార్చుకుంటూ కొత్త పంధాలో బెట్టింగ్​ నిర్వహిస్తున్నారు.

అంతా ఆన్​లైనే: సైబరాబాద్ పరిధిలో మరో మూడు ముఠాలు సైబరాబాద్‌ ఎస్​ఓటీ పోలీసులకు చిక్కాయి. ఆయా ముఠాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో పందాలు కాస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వజ్ర ఎక్స్‌చేంజ్‌, మెట్రో ఎక్స్‌చేంజ్‌, రాధ ఎక్స్‌చేంజ్‌, క్రికెట్‌ లైవ్‌ గురు, నేషనల్‌ ఎక్స్‌చేంజ్‌9, టోపాజ్‌777.కామ్‌, కోరల్‌ బివిన్‌ తదితర ఆన్​లైన్​ యాప్‌ల ద్వారా ఈ ముఠాలు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్‌ దందా నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు గణపతి రెడ్డి, శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్టు బయటపడింది.

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడు ముఠాల్లో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు రూ.1.84 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రూ.15 కోట్లకుపైగా దండుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న బెంగుళూరుకు చెందిన ప్రధాన బుకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు.

మాయమాటలు చెప్పి బెట్టింగ్​లోకి దింపి: బెట్టింగ్​లకు పాల్పడే వారే సొమ్ము దండుకుంటారని, ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ పందాలు కాస్తే భారీగా డబ్బులు గెలుచుకోవచ్చని ఆశలు కల్పించి బుకీలు పలువురిని తమ ఉచ్చులో చిక్కుకునేలా చేస్తారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ తరహా బుకీ మాటలు నమ్మవద్దని సూచిస్తున్నారు. కొందరు అక్రమార్కులు రాధే ఎక్స్‌చేంజ్‌, క్రికెట్‌ లైవ్​గురు, బెట్‌ 365, ఎంపీఎల్‌, డ్రీర్న్​గురు, మై 11 సర్కిల్‌, జస్ట్​బెట్‌, బెట్​ఫ్రెడ్‌, లోటస్‌ క్రికెట్‌ లైన్‌ వంటి యాప్‌ల ద్వారా అక్రమార్కులు పందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఆయా యాప్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరికొందరు బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని లోన్​యాప్స్​లో లోన్​ తీసుకుని పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే నిర్వాహకుల గురించి 9490617444కు సమాచారం అందించాలని సైబరాబాద్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఐపీఎల్​ బెట్టింగ్​ గ్యాంగ్​ అరెస్ట్.. రూ. 1.84 కోట్లు స్వాధీనం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.