ETV Bharat / state

Crops Damaged in Telangana: అకాల వర్షం ఆగదు.. అన్నదాత కష్టం తీరదు

author img

By

Published : May 1, 2023, 7:51 PM IST

Updated : May 1, 2023, 8:08 PM IST

Crops Damaged in Telangana: పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈదురుగాలులు, వడగళ్ల వానలకు నేలకొరిగిన పంటలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షార్పణమవుతోంది. వేలకు వేలు పెట్టుబడి పెడితే.. ఆరుగాలం కష్టం వరద పాలైందని కర్షకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే సాగు ఆగమవటం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.

crops damage in telangana
crops damage in telangana

అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న రైతులు

Crops Damaged in Telangana: అకాల వర్షాలు, వడగళ్ల వానలు రాష్ట్రంలో రైతులను కంటిమీద కునకు లేకుండా చేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న ఏపుగా పెరిగిన వరి.. ఈదురుగాలులు, రాళ్ల వానలతో.. గింజన్నదే లేకుండా పోయింది. చేలో ఉన్న కాసింత ధాన్యాన్ని అమ్ముకుందామంటే వీడని వరుణుడు పదే పదే సాగుదారుడిని దెబ్బ తీస్తున్నాడు. ఆరుగాలం శ్రమించిన అన్నదాత ప్రకృతి ప్రకోపం చూసి దిగాలు చెందుతున్నాడు.

కొనుగొలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్న: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం కాటాలు వేసి కొనుగొలు చేసే వారు కరవయ్యారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా వరి ధాన్యం ఉంచినందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులు, మిల్లర్ల మధ్య సమస్వయ లోపం వల్ల నష్టపోతున్నామని విమర్శించారు. గన్నీ సంచులు, లారీల కొరత వల్ల కొనుగొలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని నిరసన తెలిపారు.

తేమ శాతంలో సంబంధం లేకుండా కొనుగోలు చెయ్యాలి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం, గూడూరు ఏజెన్సీ ప్రాంతాల్లో నడి వేసవిలో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. వట్టి వాగు పొంగడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

కల్లాల్లోనే ధాన్యం తడిసిపోతుంది: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం వర్షార్పణమైంది. సాలూర, రెంజల్ మండలాల్లో కొన్ని కేంద్రాల్లో వడ్లకు మొలకలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వరి చేలు చెరువులను తలపిస్తున్నాయి. కోసిన ధాన్యం మార్కెట్‌ యార్డుల్లో, కల్లాల్లోనే తడవడం వల్ల పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. యంత్రాంగం చొరవ తీసుకుని నష్టాన్ని త్వరితగతిన ప్రభుత్వానికి నివేదించి పరిహారం వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.

భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే: కేంద్రం నిబంధనలు సడలిస్తే తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. మార్కెట్​లో తడిసిన ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. ప్రకృతి పగ పట్టినట్లు వరుస అకాల వర్షాల ధాటికి జగిత్యాల జిల్లాలో కల్లాల్లో ధాన్యం కొట్టుకుపోయి అపార నష్టం వాటిల్లింది. వర్షం నీటిలో కొట్టుకుపోయిన వడ్ల గింజలను ఏరుకునే దయనీయ స్థితిలో సాగుదారులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 1, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.