ETV Bharat / state

మటన్ వ్యాపారి ఇంట పార్టీ.. 22 మందికి కరోనా

author img

By

Published : May 27, 2020, 7:37 AM IST

కరోనాను ఖాతరు చేయకుండా మటన్‌ వ్యాపారి ఇంట పార్టీకి హాజరైన 22 మందికి కరోనా నిర్ధారణ అయింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన వారు 13 మంది ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ మటన్​ దుకాణానికి ఎంతోమంది వచ్చి ఉంటారు. ప్రస్తుతం అధికారులు.. ఆ ప్రాంతంలో ఎంత మంది ఆ షాపుకు వెళ్లారనేదానిపై సర్వే నిర్వహిస్తోంది.

family affected with corona which did function recently
కొవిడ్‌కు ఆహ్వానం పలికిన మటన్​ వ్యాపారి ఇంట వేడుక

హైదరాబాద్​ శివారు పహాడీషరీఫ్​లో ఓ వేడుకలో పాల్గొన్న 22 మందికి కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. వీరిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పహాడీషరీఫ్​లో మటన్​ వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి కుటుంబసభ్యులు, బంధువులు ఏటా వేసవిలో ఒకచోట చేరి సరదాగా గడిపేవారు.

కరోనాను ఖాతరు చేయకుండా ఈ సారీ అలాగే పది రోజుల కిందట నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది వేడుక చేసుకోవాలని నిర్ణయించారు. దానికి బంధువులతో పాటు జియాగూడ, గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురు చొప్పున, సంతోష్‌నగర్‌ నుంచి ఐదుగురు వెరసి 14 మంది హాజరయ్యారు.

ఇలా మొత్తం 42 మంది ఒకేచోట చేరి రెండు రోజులపాటు పార్టీ చేసుకున్నారు. అనంతరం వీరిలో 18 మంది మహేశ్వరం మండలం హర్షగూడలో కిరాణా దుకాణం నడిపించే బంధువు ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి మరోసారి వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో బోరబండ నుంచి వేడుకకు హాజరైన ముగ్గురికి, సంతోష్‌నగర్‌ నుంచి వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి నాలుగు రోజుల కిందట కరోనా నిర్ధారణ అయింది.

పహాడీషరీఫ్‌లో వేడుక జరిగిన విషయం వైద్య సిబ్బందికి తెలిసింది. అందులో పాల్గొన్న పహాడీషరీఫ్‌లోని 28 మందిని ఈనెల 23 నుంచి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సోమవారం వీరి శాంపిల్స్‌ పరీక్షించగా 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కిరాణా వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురికి పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వేడుకలో పాల్గొన్న మొత్తం 22 మందికి కరోనా సోకినట్లయ్యింది.

ఎంత మంది కొనుగోలు చేశారో..?

పహాడీషరీఫ్‌లో కరోనా సోకిన వ్యక్తి మటన్‌ వ్యాపారి కావడంతో అక్కడ ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ప్రాథమిక కాంటాక్టు కింద 21 మందిని, సెకండరీ కాంటాక్టు కింద 47 మందిని గుర్తించి రావిర్యాల క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఇంకా ఎంతమంది మాంసం కొన్నారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితోపాటు హర్షగూడలోని కిరాణా వ్యాపారి నుంచి ఎంతమంది సరకులు కొనుగోలు చేశారన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.

హర్షగూడలో కరోనా నిర్ధారణ అయిన కుటుంబం ఉండే బస్తీలో 125 ఇళ్లను గుర్తించి కంటెయిన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేయనున్నట్లు జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలనరేంద్ర తెలిపారు. రెండు ప్రాంతాల్లోనూ 40 బృందాలతో సర్వే చేపట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.