ETV Bharat / state

'అదంతా ఉత్తదే... మేం అధికారంలోకి వస్తే అన్ని ఉంటాయ్'

author img

By

Published : Feb 23, 2023, 4:52 PM IST

BJP Leaders fires on cm kcr: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని అభిప్రాయపడ్డారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

BJP
BJP

BJP Leaders fires on cm kcr: కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాపాలనను గాలికొదిలేసి నియంత పాలన చేస్తున్నరని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఏ పార్టీకి పోలింగ్ బూత్‌లు, శక్తి కేంద్రాలు లేవని పేర్కొన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడం వల్లనే 18 రాష్టాల్లో అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 80 శాతం మండల కమిటీలు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 119 నియోజకవర్గంలో బీజేపీకి పోటీ ఉందని.. దుబ్బాక హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనం అన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని, డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల రాజేందర్.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

శాసనసభలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను చర్చించి పరిష్కారం చూపేలా శాసనసభ ఉండాలని.. అందుకు భిన్నంగా అధికార పార్టీ మార్చేసిందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిలబడగానే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రజల వద్దకు ప్రజాప్రతినిధుల గొంతు వెళ్లకుండా అధికార పార్టీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

ఇక తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం జైలు కెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అర్వింద్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లక్ష్మాపూర్‌లో ప్రజాగోస- బీజేపీ భరోసా పేరుతో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ... ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగిస్తూ.. మరిన్ని కొత్త పథకాలు అమల్లోకి తెస్తామని చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.