ETV Bharat / state

Parents day : వారి కృషి స్ఫూర్తిదాయకం.. దివ్యాంగ బిడ్డలకు కొండంత ధైర్యం.!

author img

By

Published : Jul 25, 2021, 8:24 AM IST

Updated : Jul 25, 2021, 9:06 AM IST

physically challenged people
దివ్యాంగులను తీర్చిదిద్దిన తల్లిదండ్రులు

బిడ్డలంటే కలల పంట.. పండంటి సంతానమే అందరి ఆకాంక్ష.. దురదృష్టవశాత్తూ పిల్లలు అవయవలోపాలతో పుడితే? వారి పెంపకం తల్లితండ్రులకు సవాలే. ఎన్ని కష్టాలెదురైనా, కన్నపేగు కాదనుకుంటుందా? వికలమైన మనసును విజయం దిశగా నడిపిస్తుంది. మరింత శ్రద్ధ, పట్టుదలతో శ్రమించేలా ఆ తల్లిదండ్రుల సంకల్పం దృఢమవుతుంది. అలాంటి వారు తమ బిడ్డలు అన్నింటా రాణించాలని శక్తియుక్తులన్నీ ధారపోస్తారు. నేడు తల్లిదండ్రుల దినోత్సవ సందర్భంగా అలాంటి అమ్మానాన్నలపై ప్రత్యేక కథనం.

శారీరక, మానసిక దివ్యాంగ పిల్లల పెంపకం ఆషామాషీ కాదు. కొందరు పిల్లలు మాట్లాడలేరు. ఇంకొందరు నడవలేరు. నలుగురిలో కలవలేరు. తమకేం కావాలో, ఇబ్బందులేంటో చెప్పలేరు. అలాంటి వారి తల్లితండ్రులకు ఎదురయ్యే కష్టాలెన్నో. కడుపుతీపితో వారు అన్నిటినీ భరిస్తారు. బిడ్డలు తమ కాళ్లమీద తాము నిలిచేలా తీర్చిదిద్దేందుకు పరితపిస్తుంటారు. ఇక్కడ ప్రస్తావించిన తల్లిదండ్రులు ఆ కోవలోకే వస్తారు.

బిడ్డ కోసమే చదువు కొనసాగించి..!

assistant professor shubasini
బ్యూటీపార్లర్​లో ఉపయోగించే పదార్థాల గురించి కుమార్తెకు వివరిస్తున్న సుభాషిణి

చిన్న వయసులోనే వివాహం. 17 ఏళ్లకే కుమార్తె జననం. పైగా బిడ్డ మానసిక దివ్యాంగురాలు అని తెలియడంతో ఆ తల్లికి దిగులే మిగిలింది. పెళ్లినాటికి తాను చదివింది పదో తరగతి మాత్రమే. ఎలా పెంచాలా అని మథనపడిన ఆమె ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సుభాషిణి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఆమె భర్త యాదగిరి కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడు. వారి కుమార్తె యశస్విని మానసిక దివ్యాంగురాలు. బిడ్డ బాగోగుల కోసం సుభాషిణి దూరవిద్య ద్వారా ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చి బోయినపల్లిలోని మానసిక వికలాంగుల ఆస్పత్రిలో కుమార్తెను చేర్పించి శిక్షణ ఇప్పించారు. తాను ప్రత్యేక ప్రతిభావంతుల సైకాలజీ అంశంపై బీఈడీ, తరువాత సైకాలజీలో పీజీ చేశారు. మొదట ఉపాధ్యాయురాలిగా, తరువాత జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికైన ఆమె 2013లో డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగోన్నతి పొంది మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చారు. విధుల్లో తీరిక లేకుండా ఉన్నా కుమార్తెకు ప్రత్యేక సమయం కేటాయించేవారు. ఆమెను బయటకు తీసుకెళ్లి, చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకోమని ప్రోత్సహించేవారు. యశస్విని ప్రస్తుతం సొంతంగా బయటకు వెళ్లి ఇంటికి అవసరమైన సామాన్లు తెస్తుంది. తగిన శిక్షణ ఇప్పించడంతో ప్రస్తుతం ఆమె బ్యూటీపార్లర్‌ కూడా నిర్వహిస్తోంది. కుట్లు, అల్లికలు, చిత్రలేఖనంలోనూ ప్రతిభ ఉంది.

కన్నవారే కనుపాపలై..

parents day
లక్కీ మిరానితో తల్లి ముస్కాన్, తండ్రి దీపక్

‘కనులు లేవని నీవు కలతపడవద్ద’ంటూ ఆ తల్లిదండ్రులు కుమారుడికి అన్నీ తామై తీర్చిదిద్దారు. దృష్టిలోపం ఉన్న అతడికి తామే కనుపాపలుగా మారి ముందుకు నడిపించారు కరీంనగర్‌కు చెందిన దీపక్‌మిరాని- ముస్కాన్‌ దంపతులు. అంధుడైన వీరి కుమారుడు లక్కీ మిరాని రెండేళ్ల కిందట ఆసియాలోనే పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విభిన్న ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఐఏఎస్‌ శిక్షణకు ఆన్‌లైన్‌లో సన్నద్ధమవుతున్నాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఫ్యాషన్‌ డిజైనర్‌. ఏడేళ్ల వయసున్నప్పుడే లక్కీమిరానీకి ‘రెటీనాడిస్ట్రఫీ’ అనే వ్యాధి వచ్చింది. కొన్ని నెలల వ్యవధిలోనే పూర్తి అంధుడిగా మారాడు. మొదట్లో బాధపడిన తల్లిదండ్రులు గుండె దిటవు చేసుకున్నారు. కుమారుడు అన్నింటా ప్రతిభావంతుడు కావాలని ఆకాంక్షించారు. బ్రెయిలీ లిపి అందుబాటులో ఉన్నా.. సాధారణ పద్ధతిలోనే చదివించారు. పాఠాలు విని నేర్చుకునేలా తర్ఫీదు ఇచ్చారు. ప్రశ్నల వరుసక్రమం, రాసిన సమాధానం కూడా పక్కాగా మరోసారి చెప్పే జ్ఞాపకశక్తి ఇతడి సొంతం. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్మీడియట్‌లో 96 శాతం మార్కులు సాధించాడు. ధ్వని ఆధారంగా పనిచేసే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో ల్యాప్‌టాప్‌లో కంప్యూటర్‌ కోడింగ్‌లో తర్ఫీదు పొందాడు. సంగీతం కూడా నేర్చుకున్నాడు. కీ బోర్డు వాయించగలడు. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం సహా సుమారు 38 అవార్డులు అందుకున్నాడు. తమ బిడ్డను ఐఏఎస్‌ చేయడమే లక్ష్యమని చెప్పారు లక్కీ తల్లిదండ్రులు.

తమ కళ్లతో నడిపించారు

parents day
తల్లితో రేణుక

‘కన్నవారి కలలను నీరుగార్చేలా నేను కళ్లు లేకుండా పుట్టాను. అప్పుడు వారెంత బాధపడ్డారో నాకు తెలియదు. కానీ నన్ను మాత్రం వారి కళ్లే నడిపిస్తున్నాయ’ని అంటారు గుండ్లపల్లి రేణుక. ఈమె మహబూబాబాద్‌ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లికి చెందిన గుండ్లపల్లి అయిలయ్య, భాగ్యలక్ష్మిల పుత్రిక ఈమె. తండ్రి గీత కార్మికుడు. తల్లి వ్యవసాయ కూలి. రేణుకకు పుట్టుకతోనే ఒక కంటిలో గుడ్డు లేదు. మరో కన్ను చిన్నది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. బిడ్డకు కంటిచూపు లేకున్నా ఆమెను మంచి స్థానంలో చూడాలనే లక్ష్యంతో ఆ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారి శ్రమ వృథా కాలేదు. రేణుక చదువులో రాణించి పీజీ వరకు అభ్యసించారు. ఎక్కడికి వెళ్లినా అమ్మానాన్నల్లో ఎవరో ఒకరు పనుల్ని వదులుకుని ఆమె వెంట ఉంటూ.. మనోధైర్యాన్ని కల్పించారు. బ్యాక్‌లాగ్‌ నియామకాల్లో భాగంగా రేణుక 2017లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం పొందారు. విధులకు కూడా తల్లి తోడుతోనే హాజరవుతున్నానని.. అమ్మానాన్నలు తనపై చూపుతున్న ప్రేమానురాగాలు మరువలేనివని రేణుక తెలిపారు.

దత్తతలోనూ ఆదర్శం

parents day
తల్లిదండ్రులు సుమతి, మనోహర్​లతో సాయికృష్ణ

మానసికంగా ఎదుగుదల ఉండదని ఆశ్రమ నిర్వాహకులు వారిస్తున్నా.. దివ్యాంగుడిని దత్తత తీసుకున్న ఆదర్శ దంపతులు వారు. కరీంనగర్‌ చింతకుంటలో నివసిస్తున్న సుమతి, మనోహర్‌లకు సంతానం లేక... దత్తత కోసం మహారాష్ట్రలోని శ్రద్ధానంద్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఓ బాలుడిని చూసి పెంచుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కానీ ఆ బాబు మానసిక దివ్యాంగుడు, ఎదుగుదల ఉండదు, మీకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆశ్రమ నిర్వాహకులు చెప్పినా, వారు తమ నిర్ణయానికే కట్టుబడి, ఆ బాబును దత్తత తీసుకున్నారు. అతడికి సాయికృష్ణ అని పేరు పెట్టారు. ఇప్పుడు సాయికి పాతికేళ్లు. మానసిక దివ్యాంగుడైనా... తల్లిదండ్రుల ప్రేమ, తోడ్పాటుతో సాయి పేపర్‌ ప్లేట్స్‌ తయారీతో స్వయం ఉపాధిలో అడుగుపెట్టాడు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేసే పనులన్నీ చేయగలడు. సొంత కాళ్లపై నిలిచిన మానసిక దివ్యాంగుడిగా సాయికృష్ణ 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు.

ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని..

parents day
కుమార్తెకు బోధిస్తున్న వరమ్మ

లాలాపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే వరమ్మ సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. విజయవాడలో నివసించేవారు. తన కుమార్తె సాహితిలో ఆటిజం లక్షణాల్ని ఆరునెలల వయసులో గుర్తించారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. వయసు పెరిగేకొద్దీ ఆ అమ్మాయి అరవడం, కొట్టడం, చేతిలో ఉన్న వస్తువుల్ని విసిరేయడం వంటివి చేసేది. దీంతో ఆమెను విద్యానగర్‌లోని దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ మనోవికాస కేంద్రం ప్రత్యేక పాఠశాలలో చేర్పించారు. పాపను పెంచడంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎదుర్కొనేందుకు వరమ్మ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కోర్సు చేశారు. తర్వాత కుమార్తె ఇబ్బందులు అర్థం చేసుకోవడం సులువైందంటారామె. పాప భవిష్యత్తు కోసం కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. కుమార్తె వయసు ఇప్పుడు 32 ఏళ్లు. నడవలేదు. రెండు అక్షరాల పదాలు తప్ప మాట్లాడలేదు. ‘ఇలాంటి పిల్లల్ని పెంచడానికి సమాజ, కుటుంబపరంగా మద్దతుండాలి. నా భర్త వెంకటేశ్వర్లు తోడ్పాటుతో అమ్మాయి బాగోగులు చూసుకుంటున్నా’ అని తెలిపారు వరమ్మ.

ఇవీ చూడండి:

Krishna Floods: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

Last Updated :Jul 25, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.