ETV Bharat / sports

రంజీకి వేళాయె.. ఆ ప్లేయర్స్​ రాణిస్తారా?

author img

By

Published : Dec 13, 2022, 9:48 AM IST

Updated : Dec 13, 2022, 2:07 PM IST

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 38 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీకి మంగళవారం తెరలేవనుంది.

Ranzi trophy 2022 23 schedule
రంజీకి వేళాయె.. ఆ ప్లేయర్స్​ రాణిస్తారా?

టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయిన సీనియర్లకు.. భారత జట్టుకు ఆడాలని తహతహలాడుతున్న కుర్రాళ్లకు మంచి అవకాశం. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 38 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీకి మంగళవారం తెరలేవనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లు కళ తప్పిన ఈ టోర్నీ ఈసారి పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. టైటిల్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణ సాగిస్తోన్న ముంబయితో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, సౌరాష్ట్ర, విదర్భ, దిల్లీ ట్రోఫీ రేసులో సై అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల జట్లు హైదరాబాద్‌, ఆంధ్ర ఎలైట్‌ గ్రూప్‌-బిలో పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌ సొంతగడ్డపై తన తొలి మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనుండగా.. ఇదే గ్రూపులో ఆంధ్ర విజయనగరంలో ముంబయిని ఢీకొంటుంది.

ఎవరికి కీలకం.. భారత సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె. వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన అతడు మళ్లీ టీమ్‌ఇండియా తలుపు తట్టాలంటే రంజీ ట్రోఫీకి మించిన వేదిక మరొకటి ఉండదు. 12 ఏళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికైన జైదేవ్‌ ఉనద్కతే అతడికి స్ఫూర్తి. డిసెంబర్‌ 23న ఐపీఎల్‌ వేలం ఉన్న నేపథ్యంలో మరో సీనియర్‌ ఇషాంత్‌శర్మకు కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించడం కీలకం. దేశవాళీలో సత్తా చాటుతున్నా భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయిన పృథ్వీ షాకు కూడా ఈ రంజీ సీజన్‌ ఎంతో విలువైంది. గత సీజన్ల కంటే బరువు తగ్గి ఫిట్‌గా మారిన పృథ్వీ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. భారత జట్టు చోటు ఆశిస్తున్న యశస్వి జైస్వాల్‌కు కూడా ఈ సీజన్లో రాణించడం కీలకం.

ఆట ఇలా.. ఎలైట్‌లో అగ్రశ్రేణి.. ప్లేట్‌లో చిన్న జట్లు ఉంటాయి. ఎలైట్‌లో మొత్తం 32 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ఎనిమిది జట్లు ఆడతాయి. ప్రతి గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలోని రెండు జట్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరతాయి. ప్లేట్‌లో ఆరు జట్లు ఉంటాయి. ఇవి మిగిలిన అయిదు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. టాప్‌-4 జట్లు నేరుగా ప్లేట్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ చేరిన రెండు జట్లు వచ్చే సీజన్‌లో ఎలైట్‌లో పోటీపడతాయి. ఈ సీజన్‌లో ఎలైట్‌ జట్లతో ప్లేట్‌ జట్లు తలపడవు. ఈ సారి ఎలైట్‌లో పోటీపడిన 32 జట్లలో అట్టడుగున నిలిచే రెండు జట్లు వచ్చే సీజన్లో ప్లేట్‌ గ్రూప్‌లో ఆడతాయి.

ఇదీ చూడండి: FIFA అభిమానులకు కొత్త వైరస్‌ ముప్పు.. వివిధ దేశాల అధికారులు అలెర్ట్

Last Updated :Dec 13, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.