ETV Bharat / sports

రహానే రికార్డ్​.. సీజన్​లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు!

author img

By

Published : Apr 9, 2023, 11:17 AM IST

స్టార్​ వెటరన్ క్రికెటర్​ అజింక్యా రహానే ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​లో అత్యంత వేగంగా హాఫ్​ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

IPL 2023 Chennai Super Kings Ajinkya Rahane Fastest Fifty
ఐపీఎల్‌ 2023 అజింక్యా రహానే ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ అజింక్యా రహానే ఐపీఎల్‌-2023లో అరుదైన ఘనతను సాధించాడు. సీఎస్​కే తరఫున ఆడుతున్న రహానే.. సీజన్​లో అత్యంత వేగంగా హాఫ్​ సెంచరీ చేసిన ప్లేయర్​గా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా కేవలం ఒక్క ఓవర్లోనే 23 పరుగులు సాధించడం మరో విశేషం. శనివారం ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్​ టీమ్​తో జరిగిన మ్యాచ్​లో ఈ ఫీట్​ను నెలకొల్పాడు రహానే. ఇక ఈ మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో బలమైన జట్టుగా భావించే ముంబయికి ఓటమి రుచి చూపించింది. దీంతో చెన్నై సూపర్​ కింగ్స్​ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్​కే 18.1 ఓవర్లోనే కేవలం 3 వికెట్లను కోల్పోయి సునాయాసంగా టార్గెట్​ను ఛేదించింది.

రహానే కుమ్ముడు..!
ఈ మ్యాచ్​లో అజింక్యా రహానే మంచి దూకుడును ప్రదర్శించాడు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే రహానే.. ఈ ఇన్నింగ్స్​లో ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేసి చెలరేగిపోయాడు. అలాగే కేవలం 19 బాల్స్​లోనే రహానే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రహానే నిలిచాడు. అర్షద్‌ ఖాన్‌ వేసిన 4వ ఓవర్‌లో రహానే విజృంభించాడు. ఈ ఓవర్లో 1 సిక్స్​, 4 ఫోర్లు కొట్టి ఏకంగా 23 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ ఫీట్​కి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కాగా, అద్భుత ఇన్నింగ్స్​ ఆడిన 34 ఏళ్ల రహానేపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

"నా హోమ్‌గ్రౌండైన వాంఖడేలో మ్యాచులు ఆడటాన్ని నేనెంతగానో ఆస్వాదిస్తాను. అయితే ఇక్కడ నేనెప్పుడూ టెస్ట్​ మ్యాచ్​ ఆడలేదు. దీంతో ఈ గడ్డపై భవిష్యత్​లో టెస్టు ఆడాలని కోరుకుంటున్నాను."-

--అజింక్యా రహానే, సీఎస్​కే ప్లేయర్​

ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ లిస్ట్​లో వీళ్లు కూడా..
ఈ సీజన్​లో తక్కువ బంతుల్లోనే అర్థశతకం సాధించిన వాళ్ల జాబితాలో ఇప్పటికే రాజస్థాన్​ రాయల్స్​ ప్లేయర్​ జాస్‌ బట్లర్‌, కోల్​కతా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నారు. కాగా, వీరిద్దరు కేవలం 20 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ మార్క్​ను నమోదు చేశారు. ఈ రికార్డును ఒక్క బంతి తేడాతో అధిగమించిన రహానే ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక ఐపీఎల్‌ చరిత్రలోనే సీఎస్‌కే తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా రహానే ఉన్నాడు. రహానే కంటే ముందు సురేశ్‌ రైనా 16 బంతులతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఇంగ్లాండ్​ క్రికెటర్​ మొయిన్​ అలీ కూడా 19 బంతుల్లోనే అర్థశతకం చేసి రహానేతో సమానంగా రెండో స్థానంలో ఉన్నాడు. మునుపు ధోని, అంబటి రాయుడు సైతం 20 బాల్స్​లో ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ ఫీట్​ను అందుకున్నారు. ఇదిలా ఉంటే ముంబయి ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా రహానే నిలిచాడు. మొదటి స్థానంలో 14 బంతులతో పాట్​ కమిన్స్​ 18 బంతులతో రిషభ్​ పంత్​ రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఏప్రిల్​ 12న చెన్నై వేదికగా జరిగే తమ తదుపరి మ్యచ్​ను రాజస్థాన్​ రాయల్స్​తో ఆడనుంది సీఎస్​కే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.