ETV Bharat / sports

IND VS AUS: ఆసీస్​తో మూడో వన్డే.. మన కుర్రాళ్లు ఏం చేస్తారో?

author img

By

Published : Mar 22, 2023, 7:15 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఘోర పరభవాన్ని మూటగట్టుకున్న టీమ్​ఇండియా.. కీలకమైన మూడో వన్డేకు సిద్ధమైంది. ఈ మ్యాచ్​ జరగనున్న చెన్నైలోని చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

india vs australia third one day match preview
india vs australia third one day match preview

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో కష్టం మీద గెలిచి, రెండో వన్డేలో చిత్తుగా ఓడిన రోహిత్‌ సేన.. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు సిద్ధమైంది. అయితే నేడు(బుధవారం) కూడా చెన్నైలో కంగారూల నుంచి సవాలు తప్పకపోవచ్చు. ఎందుకంటే చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరం.

తొలి వన్డేలో ప్లేయర్లు కేఎల్​ రాహుల్‌, రవీంద్ర జడేజా ప్రదర్శన కారణంగా గట్టెక్కిన భారత్‌.. రెండో వన్డేలో పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ను ఎదుర్కోలేక.. బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ను అడ్డుకోలేక చిత్తయింది. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఇప్పుడు కీలకమైన చివరి వన్డేలో భారత్‌ గెలవాలంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌ తప్పక మెరుగుపడాల్సిందే.

అయితే టీమ్​ఇండియా బ్యాటర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌.. భారత బలమైన టాప్‌ఆర్డర్‌ ఇది. ఆసీస్‌తో సిరీస్‌లో మాత్రం ఇప్పటివరకూ వీళ్లు అంచనాలను అందుకోలేదు. తొలి వన్డేలో గిల్‌, కోహ్లీ, సూర్య (0) కలిపి చేసిన పరుగులు 24. విశాఖ మ్యాచ్‌లో రోహిత్‌తో సహా ఈ నలుగురు కలిపి సాధించింది 44 పరుగులు. ఇందులో గిల్‌, సూర్య సున్నాకే వెనుదిరిగారు. ఇప్పుడు ఈ మూడో వన్డేలో జట్టు గెలవాలంటే వీళ్లు నిలవాలి. ముఖ్యంగా గిల్‌, సూర్య గత రెండు వన్డేల్లో స్టార్క్‌ బౌలింగ్‌లో ఒకే తరహాలో వికెట్‌ పారేసుకున్నారు. దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి గిల్‌, వికెట్ల ముందు సూర్య దొరికిపోయారు. వీళ్లు ఆ పొరపాట్లు దిద్దుకోవాల్సి ఉంది. హార్దిక్‌ పాండ్య కూడా ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేయడం జట్టుకు అవసరం.

తొలి వన్డేలో ఆస్ట్రేలియా పోరాడే స్కోరు చేయగలిగిందంటే.. రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం మిచెల్‌ మార్ష్‌. వార్నర్‌ గైర్హాజరీలో ఈ సిరీస్‌తో ఓపెనర్‌ అవతారం ఎత్తిన అతడు అదరగొడుతున్నాడు. గత మ్యాచ్‌లో అతనికి తోడు ట్రేవిస్‌ హెడ్‌ కూడా చెలరేగాడు. వీళ్ల బాదుడుకు షమి, సిరాజ్‌ సహా భారత బౌలర్లందరూ తేలిపోయారు. ఈ సిరీస్‌ భారత కైవసం కావాలంటే ఈ ఇద్దరిని వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చాలి. అందుకు మన బౌలర్లు సరైన ప్రణాళికలతో మైదానంలో అడుగు పెట్టాలి.

రెండో వన్డేలో ఘన విజయం సాధించి సిరీస్‌పై కన్నేసిన కంగారూలు అందుకు తగ్గట్లు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. టీమ్‌ఇండియాతో దిల్లీ టెస్టులో కంకషన్‌తో పాటు గాయానికి గురై ఆ తర్వాత మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్లుగా వార్నర్‌, హెడ్‌కు మంచి రికార్డే ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ జోడీ.. అందులో మూడింట్లో 284, 269, 147 భాగస్వామ్యాలను నెలకొల్పింది. వార్నర్‌ వస్తే మార్ష్‌ అవసరాన్ని బట్టి బ్యాటింగ్‌ ఆర్డర్లో వేరే స్థానంలో ఆడతాడు.

  • జట్లు (అంచనా)..
  • భారత్‌: రోహిత్‌, శుభ్‌మన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, కుల్‌దీప్‌/సుందర్‌, షమి, సిరాజ్‌;
  • ఆస్ట్రేలియా: వార్నర్‌, హెడ్‌, స్మిత్‌, మార్ష్‌, కేరీ, గ్రీన్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, అబాట్‌/అగర్‌/ఎలిస్‌, స్టార్క్‌, జంపా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.