ETV Bharat / sports

Ashes 2023 : సమవుజ్జీల పోరులో 'బజ్‌బాల్‌' వ్యూహం నడిచేనా ?

author img

By

Published : Jun 16, 2023, 8:01 AM IST

Ashes Test Series 2023 Preview : ఓ వైపు 'బజ్‌బాల్‌' వ్యూహంతో దూకుడైన ఆటతో బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్‌.. మరోవైపు సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌. 2015 తర్వాత తిరిగి యాషెస్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో ఇంగ్లిష్‌ జట్టు ఉండగా.. 2019 సెప్టెంబర్‌ నుంచి ఓటమే ఎరుగని రికార్డును కొనసాగించి.. కప్పు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో కంగారూలు! అన్నింటిలో సమవుజ్జీవులుగా ఉండే ఈ జట్లు మధ్య జరిగే పోరులో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి..ఇంతకీ ఆ జట్ల బలాబలాలు ఏంటంటే ?

Ashes Test Series 2023
Ashes Test Series 2023 Preview

Ashes 2023 : 2021-22లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 0-4 తేడాతో ఇంగ్లాండ్‌ జట్టు ఓటమిని చవి చూసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ విఫలమైంది. దీంతో కొత్త కోచ్​లైన మెక్‌కలమ్‌, కొత్త టెస్టు కెప్టెన్‌ స్టోక్స్‌ రంగంలోకి దిగారు. తమ వ్యూహాలతో ఇంగ్లాండ్‌ ఆటను పూర్తిగా మార్చేశారు.'బజ్‌బాల్‌' ఆటతో టెస్టుల్లో దూకుడు పెంచారు. ఆ తర్వాత ఏడాది కాలంలో 13 టెస్ట్​లు ఆడిన ఇంగ్లాండ్‌ జట్టు అందులో 11 గెలుపొందింది. ఇప్పుడు ఇదే జోరుతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి యాషెస్‌ తిరిగి దక్కించుకోవాలనే కసితో ఉంది. కానీ ఈ సారి అది అంత తేలిక కాదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాను చిత్తుచేసిన ఆసిస్​ కూడా మంచి ఫామ్‌లోనే ఉంది. ఈ ప్రపంచ నంబర్‌ వన్‌ టెస్టు జట్టును ఓడించడం ఇంగ్లిష్‌ జట్టుకు అంత సులువైన పని కాదు. మరి శుక్రవారం ఆరంభమయ్యే తొలి టెస్టులో గెలిచి అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎవరు శుభారంభం చేస్తారో వేచి చూడాలి. ఇక ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 కూడా ప్రారంభం కానుంది.

టాప్‌ ఆర్డర్‌లో అనుభవం పరంగా చూస్తే.. ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. ఇంగ్లాండ్‌ తరపున క్రాలీ, డకెట్‌, పోప్‌ ఆడింది 80 టెస్టులే. కానీ ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు వార్నర్‌, ఖవాజా, లబుషేన్‌ల అనుభవం మొత్తం 203 టెస్టులు. అటు క్రాలీ, ఇటు వార్నర్‌ల ఫామ్‌.. ప్రస్తుతం ఆయా జట్లను ఇబ్బంది పెట్టే అంశమే. ఇక టీమ్‌ఇండియాతో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఖవాజా ఇప్పుడు కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. డబ్ల్యూటీసీ 2021-23 చక్రంలో అత్యధిక పరుగుల వీరుల్లో అతని ది రెండో స్థానం. లబుషేన్‌ ఎప్పటిలాగే నిలకడగా ఆడుతున్నాడు. డకెట్‌, పోప్‌ కూడా ఇంగ్లాండ్‌ తరపున మంచి ప్రదర్శనే చేస్తున్నారు.

ఆ ఒక్కటి కీలకం..
Eng Vs Aus Ashes : ఇక రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టో.. ఇలాంటి మిడిలార్డర్‌తో కూడిన ఏ జట్టయినా పటిష్ఠంగానే ఉంటుందన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంగ్లాండ్‌ కూడా అదే ధీమాతోనే ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన రూట్‌.. పరుగుల వేటలో సాగుతూనే ఉన్నాడు. 2021-23 డబ్ల్యూటీసీ చక్రంలో అత్యధిక పరుగులు చేసింది కూడా అతనే.

మరోవైపు బ్రూక్‌ టెస్టు కెరీర్‌ ప్రయాణమే ఓ సంచలనం. ఆడిన 7 టెస్టుల్లో ఈ ప్లేయర్​ ఏకంగా 81.80 సగటుతో 826 పరుగులు నమోదు చేశాడు. ఓ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టులో ఎంతో విలువైన ఆటగాడిగా మారాడు బెన్‌స్టోక్స్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌ మాత్రమే కాదు.. అతను జట్టులో ఉంటే చాలు అనేలా ఉన్నాడు. ఇక స్మిత్‌, హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ లాంటి ఆటగాళ్లతో ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ కూడా బలంగా ఉంది.

భారత్‌పై శతకం చేసి ఊపుమీదున్న స్మిత్‌.. యాషెస్‌ సిరీస్‌లోనే అదే ఫామ్‌ కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు వెన్నెముక లాంటి స్మిత్​.. క్రీజులో నిలబడితే ఇక ప్రత్యర్థికి చెమటలే. డబ్ల్యూటీసీ ఫైనల్లో శతకం బాదిన హెడ్‌ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. గ్రీన్‌ ఆడింది 21 టెస్టులే కానీ ఆల్‌రౌండర్‌గా ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. వికెట్‌ కీపర్‌ కేరీ కూడా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులకు హడలు పుట్టించనున్నాడు.

బౌలింగ్​లోనూ అదుర్స్​..
Ashes Test Series : ప్రస్తుతానికి రెండు జట్ల బౌలింగ్‌ విభాగాలూ సమానంగానే కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌ పేసర్లు అండర్సన్‌, బ్రాడ్‌లకు టెస్టుల్లో 1267 వికెట్లు తీసిన అనుభవముంది. ఇప్పటికీ వీరిద్దరూ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అందుకే పేస్‌ను రాబట్టే మార్క్‌వుడ్‌ను కాదని అండర్సన్‌కు తోడుగా బ్రాడ్‌కే తుది జట్టులో చోటు కల్పించారు. వీళ్లకు తోడు రాబిన్సన్‌ కూడా ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తాచాటిన కమిన్స్‌, స్టార్క్‌, బోలాండ్‌.. ఆస్ట్రేలియా పేస్​లో కీలకంగా మారనున్నారు. దాదాపు సొంతగడ్డ లాంటి పరిస్థితులు ఉండే ఇంగ్లాండ్‌లో ఈ పేస్‌ త్రయం వికెట్ల వేటలో సాగేందుకు సిద్ధమైంది. స్పిన్‌ విషయానికి వస్తే ఇంగ్లాండ్‌ కంటే ఆస్ట్రేలియాదే కాస్త పైచేయి అనిపిస్తోంది.

2021-23 సైకిల్​లో అత్యధిక వికెట్లు తీసిన లైయన్‌ ఎప్పుడూ ప్రమాదకారే. మరోవైపు స్టోక్స్‌ కోరిక మేరకు రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ టెస్టులు ఆడనున్న మొయిన్‌ అలీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. స్పిన్‌ బౌలింగ్‌లో అతను లైయన్‌ అంత ప్రభావం చూపలేకపోవచ్చు. కానీ అతని బ్యాటింగ్‌ నైపుణ్యాలు మాత్రం ఇంగ్లాండ్‌కు కచ్చితంగా కలిసొస్తాయని చెప్పొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.