ETV Bharat / sports

Ashes 2023 : ఆస్ట్రేలియా 34.. ఇంగ్లాండ్‌ 32.. ఈ సారి యాషెస్​ ఎవరికో ?

author img

By

Published : Jun 15, 2023, 7:00 AM IST

పత్రిష్టాత్మక యాషెస్​ క్రికెట్​ పోరుకు సమయం ఆసన్నమైంది. సొంతగడ్డలో ఆసిస్​తో తలపడేందుకు ఇంగ్లాండ్​ సిద్ధం కానుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ పోరుకు సంబంధించిన హైలైట్స్​ మీ కోసం..

ashes 2023
ashes 2023

Ashes 2023 : ఇటీవలే జరిగిన ప్రతిష్టాట్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్​ ఎంతో హడావుడిగా ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో ఆసిస్​ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక పోరుకు సర్వం సిద్ధం కానుంది. క్రికెట్​ ప్రియులు ఎదురుచూసే చరిత్రాత్మక సమరానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆనవాయితీగా వస్తున్న టెస్టు యుద్ధానికి రెండు అగ్రశ్రేణి జట్లు నువ్వా నేనా అంటూ పోటీ పడనున్నాయి. అదే యాషెస్‌ సిరీస్​.

ఇక ఈ 2023 సిరీస్​లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ తలపడనుండగా.. ఈ అయిదు టెస్టుల పోరులో భాగంగా తొలి మ్యాచ్‌ ఆరంభమయ్యేది శుక్రవారమే. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరిగే పోరాటం హోరాహోరీగా సాగడం ఖాయం అని క్రికెట్​ అభిమానులు అంటున్నారు. ఇక ఆటగాళ్లు కూడా తమ ప్రదర్శనతో అభిమానులను అలరిస్తారన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇంగ్లాండ్‌ ఈ సారి..
Eng Vs Aus Ashes : 2019లో జరిగిన 2-2తో డ్రా అయిన సిరీస్​ తర్వాత ఇంగ్లాండ్‌లో జరగనున్న తొలి యాషెస్‌ సిరీస్‌ ఇదే. కాగా ఇంగ్లాండ్‌ చివరగా 2015లో ఈ సిరీస్‌ నెగ్గింది. ప్రస్తుతం ఈ యాషెస్​ కప్పు 2021-22 సీజన్‌లో సొంతగడ్డపై సిరీస్‌ గెలిచిన ఆస్ట్రేలియా దగ్గరే ఉంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ సిరీస్​ను నిర్వహిస్తారు. ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య మొత్తం 72 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే.. అందులో ఆస్ట్రేలియా 34 గెలవగా.. ఇంగ్లాండ్‌ జట్టు 32 సిరీస్‌ల్లో విజయం సాధించింది. మరో 6 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.

బాల్​ ఆఫ్​ ద సెంచరీ
1981 యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ తన అద్భుత ప్రదర్శనతో సత్తా చాటి తమ జట్టును విజేతగా నిలిపాడు. ఇక అప్పటి నుంచి ఈ సిరీస్‌ను 'బోథమ్‌ యాషెస్‌' అని పిలుస్తుంటారు. మరోవైపు దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ 'బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ' కూడా యాషెస్‌లోనే నమోదైంది. 1993లో మైక్‌ గాటింగ్‌కు అతను వేసిన బంతి ఈ ఘనత అందుకుంది.

ఇక 2005లో జరిగిన యాషెస్‌ పోరు అత్యుత్తమైనదని చెబుతుంటారు. జట్టు నిండా స్టార్లతో ఉన్న ఆస్ట్రేలియాపై అప్పుడు ఫ్లింటాఫ్‌, పీటర్సన్‌ లాంటి ఆటగాళ్లతో కూడిన ఇంగ్లాండ్‌ టీమ్​ అనూహ్య విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. 1986/87 తర్వాత ఇంగ్లాండ్‌కు అదే తొలి యాషెస్‌ విజయం. ఇందులో తొలి టెస్టులో స్టీవ్‌ హార్మిసన్‌ బౌన్స్‌ర్‌ తగిలి రికీ పాంటింగ్‌ ముఖం రక్తంతో నిండింది.

డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్​..
ఈ సారి యాషెస్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సిరీస్‌తోనే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్​ ఆరంభమవుతుంది. 2025లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్స్​ లార్డ్స్‌లో జరుగుతుంది. ఈ సైకిల్​లో తొమ్మిది జట్ల మధ్య జరిగే 27 సిరీస్‌ల్లో కలిపి మొత్తం 68 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కాగా ఈ మూడో డబ్ల్యూటీసీ గద కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ పోరాడనున్నాయి. ప్రతి జట్టు ఆరు సిరీస్‌ల చొప్పున ఆడనుంది. అందులో సొంతగడ్డపై మూడు, ప్రత్యర్థి దేశంలో మూడు ఉంటాయి. ఒక్కో సిరీస్‌లో రెండు నుంచి అయిదు మ్యాచ్‌ల వరకూ ఉంటాయి. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే ఇంగ్లాండ్‌ అత్యధికంగా 21 సార్లు ప్రత్యర్థితో తలపడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (19), భారత్‌ (19) ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.