ETV Bharat / sports

కేఎల్ రాహుల్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్‌ కోచ్‌

author img

By

Published : Oct 29, 2022, 3:45 PM IST

ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియాకు కీలక పోరు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్‌ఇండియా దాదాపు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోవడం ఖాయం. అయితే భారత్ రాణిస్తున్నప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అయితే అతడి స్థానంలో పంత్​ను తీసుకోవాలని డిమాండ్​ వినిపిస్తోంది. దీనిపై తాజాగా బ్యాటింగ్ కోచ్​ విక్రమ్​ రాఠోడ్​ స్పందించారు. ఏమన్నాడంటే...

కేఎల్​ రాహుల్​తో రిషబ్​
kl rahul and rishab

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియా మంచి జోష్​లో ఉంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఘోరంగా విఫలం కావడం భారత శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. భారీగా ఒత్తిడి ఉండే పాక్‌తో మ్యాచ్‌లో రాణించలేకపోయాడంటే సరేలే అని అభిమానులు సరిపెట్టుకొన్నారు. అయితే నెదర్లాండ్స్‌పైనా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. దీంతో రాహుల్‌ను పక్కన పెట్టాలనే డిమాండ్లు.. అతడి స్థానంలో కీపర్ రిషభ్‌ పంత్‌ను తీసుకోవాలనే సూచనలు వచ్చాయి. ఈ క్రమంలో రిషభ్‌ను ఓపెనర్‌గా పంపిస్తే బాగుంటుందనే వ్యాఖ్యలపై టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్ స్పందించాడు.

ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో విక్రమ్‌ మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు టీమ్‌ఇండియా కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడింది. ఇందులో విఫలమైనంత మాత్రాన రాహుల్‌ బ్యాటింగ్‌ సామర్థ్యంపై నమ్మకం పోదు. అందుకే కేఎల్‌ బదులు పంత్‌ను తీసుకొంటే ఎలా ఉంటుందనే దానిపై ఇంతవరకు ఆలోచించలేదు. ప్రాక్టీస్‌ మ్యాచుల్లో రాహుల్‌ చాలా బాగా ఆడాడు. అందుకే ఇలాంటి సమయంలో మరో ఆప్షన్‌ కోసం చూడటం లేదు. ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ లక్ష్యం ఒకటే. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు బరిలోకి దిగాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాం. అయితే పిచ్‌ కండీషన్ ఎలా ఉందనేది అంచనా వేసి.. దానికి తగ్గట్టు ఆడటమే లక్ష్యం"

విరాట్ కోహ్లీ వరుసగా హాఫ్ సెంచరీలు సాధించడంపైనా విక్రమ్‌ స్పందించాడు. "వరుసగా రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించాడు. పిచ్‌, జట్టు పరిస్థితిని బట్టి అతడు అద్భుతంగా ఆడాడు. గేమ్‌ను మార్చగల సమర్థుడు. ప్రత్యర్థి టీమ్‌ ఏదైనా సరే మ్యాచ్‌ను తన పరిధిలోకి తీసుకొనిరాగలడు. ఇప్పటి వరకు సూపర్‌గా ఆడాడు. తప్పకుండా ఇలాంటి ఆటనే టోర్నీ ఆసాంతం ఆడతాడు" అని విక్రమ్‌ రాథోడ్‌ తెలిపాడు.

ఇదీ చదవండి:అలా జరిగి ఉంటే రిటైర్మెంట్​ ప్రకటించేవాడిని: అశ్విన్​

T20 worldcup: సికిందర్​ రాజా స్పిన్ మ్యాజిక్​ వెనక ఉన్నది ఇతడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.