ETV Bharat / sports

'అఫ్గాన్​ జట్టు టీ20 ప్రపంచకప్​లో ఆడుతుంది'

author img

By

Published : Aug 16, 2021, 3:38 PM IST

టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే విషయమై అఫ్గానిస్థాన్​ క్రికెట్​ స్పష్టతనిచ్చింది. తమ దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పొట్టి వరల్డ్​కప్​లో పాల్గొంటామని క్రికెట్​ వ్యవహారాల మీడియా మేనేజర్ వెల్లడించారు.

Afghanistan cricket
అఫ్గానిస్థాన్​ క్రికెట్

అఫ్గానిస్థాన్​లో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో అఫ్గాన్ క్రికెట్​ జట్టు పొట్టి ప్రపంచకప్​లో ఆడుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. దీనిపై స్పష్టత ఇచ్చింది అఫ్గానిస్థాన్​ క్రికెట్ బోర్డు.

"అవును, వచ్చే ప్రపంచకప్​లో మేము పాల్గొంటాం. అందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాబుల్​లో జరిగే శిక్షణా కార్యక్రమాల్లో ఆటగాళ్లు పాల్గొననున్నారు. వరల్డ్​కప్​కు ముందు ప్రాక్టీస్​ మ్యాచ్​ల్లో భాగంగా ఆసీస్​, విండీస్​తో ట్రై సిరీస్​ కోసం ఎదురుచూస్తున్నాం. శ్రీలంక లేదా మలేసియాను వేదికగా నిర్ణయించాలనుకుంటున్నాం."

-హిక్మత్​ హస్సన్, అఫ్గానిస్థాన్​ క్రికెట్​ జట్టు మీడియా మేనేజర్.

"పాకిస్థాన్​తో నిర్ణయించిన సిరీస్​తో పాటు దేశవాళీ టీ20 టోర్నీలు కూడా జరుగుతాయి. పొట్టి ప్రపంచకప్​కు ముందు మా ఆటగాళ్లకు ఈ సన్నద్ధత చాలా ఉపయోగపడనుంది" అని హస్సన్ అభిప్రాయపడ్డారు.

'ప్రస్తుతం రషీద్​ ఖాన్, మహ్మద్​ నబీ దేశంలో లేరు కదా వారికి ఒక మాట చెప్పారా?' అన్న ప్రశ్నకు హస్సన్ బదులిచ్చారు. "మా ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారి కోసం మాకు చేతనైన సాయం చేస్తాం. కాబుల్​లో పరిస్థితులు మరీ దారుణంగా ఏమీ లేవు. అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు" అని హస్సన్ పేర్కొన్నారు.

ఇక టీ20 ప్రపంచకప్​ విషయానికొస్తే మొత్తం 12 జట్లు ఈ మెగా ఈవెంట్​లో పాల్గొననున్నాయి. మార్చి 20, 2021 నాటికి ర్యాంకింగ్స్​లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లతో పాటు క్వాలిఫయర్స్​ మ్యాచ్​లు ఆడటం ద్వారా మరో నాలుగు జట్లు ఈ పొట్టి కప్​కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్​-1లో వెస్టిండీస్​, ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్​-2లో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్​ జట్లున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్​, ఐర్లాండ్, నెదర్లాండ్స్​, నమీబియా, ఒమన్, పీఎన్​జీ, స్కాట్లాండ్ నుంచి మిగిలిన నాలుగు జట్లు అర్హత సాధించనున్నాయి.

ఇదీ చదవండి: Rashid khan: 'అఫ్గాన్​ క్రికెటర్లు ఇద్దరూ​ ఐపీఎల్​లో ఆడతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.