ETV Bharat / sitara

MAA Elections 2021: గెలిచినా.. ఓడినా.. 'మా' కోసమే!

author img

By

Published : Sep 14, 2021, 8:26 PM IST

Prakash Raj And Manchu Vishnu MAA Elections 2021 Campaign
MAA Elections 2021: గెలిచినా.. ఓడినా.. 'మా' కోసమే!

'మా' ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. సభ్యుల సంక్షేమం కోసం తాము రెండేళ్లపాటు పనిచేస్తామని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్​రాజ్ అన్నారు. ఛారిటీ అసోసియేషన్​ల తయారైన 'మా' అసోసియేషన్​ను సభ్యుల సంక్షేమం కోసం కృషిచేసేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అక్టోబర్ 10న అసోసియేషన్​కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రకాశ్​రాజ్ సినీ కళాకారుల మద్దతు కూడగడుతూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ తన ప్రణాళికను కళాకారులకు వివరిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు కూడా సీనియర్ నటులను సన్మానిస్తూ నిశ్శబ్దంగా సభ్యుల మద్దతు కోరుతూ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం వల్ల అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్​రాజ్, మంచు విష్ణులు ప్రచార పర్వానికి తెరతీశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎవరికి వారు సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్యానల్ ప్రకటించి ఒక అడుగు ముందే ఉన్న ప్రకాశ్​రాజ్.. తనదైన మాటలతో కళాకారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విందు సమావేశాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు ఉన్న సభ్యులతోపాటు ఇతర కళాకారులందరిని ఒక్కచోట చేర్చి సినీ పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల తన ప్యానల్ సభ్యులతో కలిసి సుమారు 150 మంది సినీ, టెలివిజన్ కళాకారులతో సమావేశమైన ప్రకాశ్​రాజ్.. అక్టోబర్ 10న జరిగే ఎన్నికల్లో తమ ప్యానల్ గెలిచినా గెలవకపోయినా రెండేళ్లపాటు సభ్యుల సంక్షేమ కోసం తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు.

'మా' సభ్యుడిగా రెండేళ్ల నుంచి అసోసియేషన్​లో జరుగుతున్న సంఘటనలను గమనిస్తున్నట్లు తెలిపిన ప్రకాశ్​రాజ్.. సినీ పెద్దలు ఎంతో ఔదార్యంతో ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని గత కార్యవర్గ సభ్యులు మసకబార్చారని విమర్శించారు. సభ్యులకు అండదండగా ఉండాల్సిన 'మా'ను.. ఛారిటీ అసోసియేషన్ గా మార్చారని వ్యాఖ్యానించారు. 'మా'లో సభ్యుల సంఖ్యపై స్పష్టత లేదన్న ప్రకాశ్​రాజ్.. 147 మంది స్థానికేతరులు అసోసియేషన్​లో ఉన్నారని పేర్కొన్నారు. జెనీలియా లాంటి కథానాయికలు, రామ్ చరణ్, నాగచైతన్య లాంటి అగ్ర నటీనటులు ఈ ఎన్నికల్లో ఓటింగ్​లో పాల్గొనడం లేదని, అలాంటి వాళ్లను తీసేస్తే కేవలం 250 మంది మాత్రమే నిజమై సభ్యులున్నారని వెల్లడించారు.

మూడు నెలల్లో హెల్త్​ కార్డులు..

'మా' అసోసియేషన్ బాధ్యత వేషాలు ఇప్పించడమే కాదన్న ప్రకాశ్​రాజ్.. వయస్సు రీత్యా వేషాలు వేయలేని నటీనటుల కుటుంబాల్లోని పిల్లల చదువులకు సహకారం అందించాలని కోరారు. మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు తలుచుకుంటే అది సాధ్యమవుతుందన్నారు. సుమారు 100 మంది వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించిన ప్రకాశ్​రాజ్.. తమ ప్యానెల్ గెలిస్తే ఒక్కో వైద్యుడు ఐదుగురు సభ్యుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. అలాగే గెలిచిన మూడు నెలల్లోగా అసోసియేషన్ లో ప్రతి సభ్యుడికి హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఆరు నెలల్లో సభ్యుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకాశ్ రాజ్ హామీ ఇచ్చారు.

సమస్యలకు పరిష్కారం..

ఇప్పటివరకు అసోసియేషన్ చుట్టూ నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి 100 దారులున్నాయన్నారు నటుడు ప్రకాశ్​రాజ్​. 'మా'లో ఉన్న చిన్నచిన్న కళాకారులకు సినిమాల్లో వేషాల కోసం తమ ప్యానల్ లోని 26 మంది నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. డిసెంబర్​లో 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి నిధులు సమీకరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రకాశ్ రాజ్ సభ్యులకు వివరించారు.

సీనియర్ల మద్దతుతో!

మరోవైపు మంచు విష్ణు కూడా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు నిశ్శబ్దంగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించిన విష్ణు.. పోటీ అనివార్యం కావడం వల్ల సీనియర్ల మద్దతు పొందేందుకు కష్టపడుతున్నారు. తండ్రి మోహన్ బాబు సహకారంతో కోకాపేటలోని తన కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి.. 'మా' భవనం కోసం మూడు చోట్ల స్థలాలు చూశానని వెల్లడించిన మంచు విష్ణు.. అధ్యక్షుడిగా గెలిచేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి.. Sita-The Incarnation Movie: 'సీత' పాత్రలో కంగనా రనౌత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.