ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లో 'బ్లూ టిక్' కావాలా? ఇలా చేస్తే..

author img

By

Published : Feb 20, 2023, 11:41 AM IST

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారులకు వెరిఫైడ్​ బ్లూ టిక్ ఖాతా కోసం సబ్‌స్క్రిప్షన్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ​మెటా సీఈఓ మార్క్ జుకర్​​బర్గ్ ప్రకటించారు. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ 'బ్లూ టిక్' సబ్​స్క్రిప్షన్ ధర ఎంతంటే?

facebook blue tick
ఫేస్​బుక్ బ్లూ టిక్

మైక్రోబ్లాగింగ్ సైట్​ ట్విట్టర్ బాటలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నడుస్తోంది. అధికారిక ఖాతాలకు ఇచ్చే 'బ్లూ టిక్' సబ్​స్క్రిప్షన్​ సర్వీసును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ​మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించారు. 'మెటా వెరిఫైడ్​' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వారంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బ్లూటిక్ సబ్​స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభిస్తామని.. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు జుకర్​బర్గ్ తెలిపారు. వినియోగదారులు తమ ఖాతాల రక్షణ కోసం బ్లూ టిక్ సబ్​స్క్రిప్షన్​ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అయితే ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​కు వేర్వేరుగా బ్లూటిక్ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాలని జుకర్​బర్గ్ స్పష్టం చేశారు.

ఆపిల్ ఫోన్​ వినియోగదారులు నెలకు రూ.991(11.99 అమెరికన్​ డాలర్లు), ఆండ్రాయిడ్ వినియోగదారులు రూ.1,239 (14.99 అమెరికన్ డాలర్లు) చెల్లించి వెరిఫైడ్ ఖాతాల కింద బ్లూటిక్​ను పొందాలని మెటా తెలిపింది. అంతకుముందు మెటా బ్లూటిక్ కోసం ఎటువంటి రుసుం వసూలు చేసేది కాదు. ఉచితంగానే ప్రముఖులు, వ్యాపారుల ఖాతాలకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చేది. ఈ కొత్త ఫీచర్ మెటా అందించే సేవల్లో కచ్చితత్వం, భద్రతను పెంచేందుకే తీసుకొస్తున్నామని పేర్కొంది. గతంలో వెరిఫైడ్​ అయిన ప్రముఖులు బ్లూ టిక్ సబ్​స్క్రిప్షన్​ తీసుకోనవసరం లేదని తెలిపింది.

మెటా దాదాపు మొత్తం ఆదాయాన్ని ప్రకటనల ద్వారానే పొందుతుంది. అయితే కొవిడ్ అనంతరం ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రకటనలు తగ్గాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఉక్రెయిన్​-రష్యా యుద్ధం వల్ల మెటా సంస్థ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.

11 వేల మంది తొలగింపు..
2022 నవంబరులో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా తమ కంపెనీలో పనిచేస్తున్న 11,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్​​బర్గ్ ప్రకటించారు. ఇక నుంచి కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, నియామకాలను నిలిపివేయనున్నట్లు ఆయన చెప్పారు.

ట్విట్టర్​ బ్లూ టిక్​..
గతేడాది ట్విట్టర్​ బ్లూటిక్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 8 డాలర్లు తీసుకుని వినియోగదారులకు ట్విట్టర్ బ్లూ టిక్ సేవలను ప్రారంభించింది. ట్విట్టర్​ను ఎలాన్ మస్క్ గతేడాది కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆయన అనుహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.