ETV Bharat / priya

చినుకుల్లో.. చికెన్‌బజ్జీ అదిరిపోద్ది!

author img

By

Published : Jul 25, 2021, 12:31 PM IST

snacks
స్నాక్స్

వాన పడితే చాలు మనసు కాస్త స్పైసీగా ఉండే స్నాక్స్‌ కోరుకుంటుంది. సమోసాలూ, కాల్చిన మొక్కజొన్న, మిర్చిబజ్జీ లాంటివి ఎప్పుడూ ఉండేవే కాబట్టి.. ఈసారి వీటిని వండుకుంటే సరి.

నాలుగు చినుకులు పడటం ఆలస్యం.. కప్పు టీ లేదా కాఫీతోపాటు కాస్త కారంగా, వేడివేడిగా ఏవైనా స్నాక్స్‌ తినాలనిపించడం మామూలే. అలాంటి సమయాల్లో ఈ స్నాక్స్ చేసుకుని ఆస్వాదించండి..


బ్రెడ్‌పనీర్‌ గారెలు

foods
బ్రెడ్‌పనీర్‌ గారెలు

కావలసినవి
బ్రెడ్‌స్లైసులు: ఆరు, పెరుగు: ముప్పావుకప్పు, బియ్యప్పిండి: అరకప్పు, బొంబాయిరవ్వ: పావుకప్పు, పనీర్‌ తురుము: అరకప్పు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద: పావుకప్పు, జీలకర్ర: అరచెంచా, ఉల్లిపాయ తరుగు: పావుకప్పు, అల్లం తరుగు: చెంచా, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం
ముందుగా బ్రెడ్‌స్లైసుల్ని ముక్కల్లా కోసి ఆ తరువాత మిక్సీలో వేసి పొడిచేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో నూనె తప్ప ఒక్కో పదార్థాన్ని బ్రెడ్‌పొడితో సహా వేసుకోవాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరి.

పాలకూర పెసరపప్పు పకోడి..

foods
పాలకూర పెసరపప్పు పకోడి

కావలసినవి
పెసరపప్పు: కప్పు, పాలకూర తరుగు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, వాము: చెంచా, కొత్తిమీర: కట్ట, దనియాలపొడి: చెంచా, కారం: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: పావుచెంచా, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం
పెసరపప్పును రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరవాత నీళ్లు పూర్తిగా వంపేసి మిక్సీలో వేసుకుని ముద్దలా చేసుకుని తీసుకోవాలి. ఇందులో పాలకూర తరుగుతోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడెక్కాక స్టౌని మీడియంలో పెట్టి ఈ పిండిని కొద్దికొద్దిగా నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిని వేడివేడిగా టొమాటో సాస్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

చికెన్‌ బజ్జీ..

foods
చికెన్‌ బజ్జీ
కావలసినవి
చికెన్‌ వింగ్స్‌: ఆరు, మిరియాలపొడి: చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత, మైదా: అరకప్పు, సెనగపిండి: పావుకప్పు, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, గుడ్డు: ఒకటి, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం

చికెన్‌ వింగ్స్‌ని కడిగి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మిరియాలపొడి, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి కలిపి అందులో చికెన్‌ వింగ్స్‌ని వేసి వాటికి మసాలా పట్టేలా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. మరో గిన్నెలో గుడ్డు సొన గిలకొట్టుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్‌ ముక్కను తీసుకుని ఆ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరి.

అమృత్‌సరీ ఫిష్‌

foods
అమృత్‌సరీ ఫిష్‌

కావలసినవి
ముళ్లులేని చేప: అరకేజీ (ముక్కల్లా కోసుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, నిమ్మరసం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: చెంచా, పెరుగు: రెండున్నర టేబుల్‌స్పూన్లు, సెనగపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, జీలకర్ర: పావుచెంచా, కారం: ఒకటిన్నర చెంచా, వాము: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం

చేపముక్కలపైన అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి వాటికి మసాలా పట్టేలా కలిపి పెట్టుకోవాలి. పావుగంటయ్యాక నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ చేపముక్కలపైన వేసి మరోసారి కలపాలి. ఇలా చేసుకున్న వాటిని పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టి ఆ తరువాత ఇవతలకు తీసుకుని నాలుగైదు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.

చిట్కా..

పకోడీలూ, బజ్జీలు చేసేముందు ఈ చిట్కాలను పాటించి చూడండి.

  • పకోడీ లేదా బజ్జీల పిండిలో కొద్దిగా ఇడ్లీ పిండి/మొక్కజొన్న పిండి కలిపితే.. అవి కరకరలాడటమే కాక బాగా పొంగుతాయి కూడా.
  • నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే.. బజ్జీలూ, పకోడీల్లాంటివిఎక్కువ నూనె పీల్చుకోవు.
  • పిండి కలుపుతున్నప్పుడు చల్లని నీటిని వాడితే నూనె పీల్చుకోవు సరికదా ఎక్కువసేపు కరకరలాడుతూనే ఉంటాయి.
  • బజ్జీల్లాంటివాటిని రెండువిడతల్లో వేయించుకుంటే ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి. అంటే.. ఒకసారి బాణలిలో నాలుగైదు బజ్జీలు వేశాక.. వాటిని యాభైశాతం కాలనిచ్చి తీసేయాలి. పది నిమిషాలయ్యాక వాటిని మరోసారి వేసి.. ఎర్రగా వేయించుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.