ETV Bharat / spiritual

వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అసలు విషయం తెలిస్తే మీరు కూడా! - Gunjillu In Vinayaka Temple

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 5:15 AM IST

Why Gunjillu In Front Of Lord Ganesh : పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన దైవం గణపతి. వినాయకుని ప్రార్ధిస్తే విఘ్నాలు తొలగుతాయి. ఇంట్లో కానీ, వినాయకుని ఆలయంలో కానీ భక్తులు గుంజీళ్ళు ఎందుకు తీస్తారో తెలుసా? వినాయకునికి గుంజీలు అంటే ఎందుకిష్టం? గుంజీలు తీయడం వెనుక శాస్త్రీయత ఉందా? ఈ విషయాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

Gunjillu In Vinayaka Temple
Gunjillu In Vinayaka Temple (Source : Getty Images)

Why Gunjillu In Front Of Lord Ganesh : వినాయకుని పూజిస్తే ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవని అందరూ నమ్ముతారు. కొంతమంది ప్రతిరోజూ వినాయకుని దర్శించనిదే ఎలాంటి పనులు మొదలు పెట్టరు. ముఖ్యంగా ద్రవిడ సంప్రదాయం పాటించేవారు పెద్దలైనా, పిల్లలైనా వినాయకుని ఆలయాన్ని దర్శించనిదే కార్యాలయాలకు కానీ, పాఠశాలలకు కానీ వెళ్లరు. ఉదయం తొందరలో పెద్దగా పూజలవి చేయలేక పోయినా వినాయకుని ముందు కనీసం మూడు గుంజీలు తీసి తమ రోజువారీ పనులకు వెళ్లే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అసలు వినాయకుడికి గుంజీలు అంటే ఎందుకంత ఇష్టం? దాని వెనుక ఉన్న పురాణం గాథలు తెలుసుకుందాం.

కైలాసం వెళ్లిన విష్ణుమూర్తి
ఒకసారి శ్రీమహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్లారు. శివ దర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గదాయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో కూర్చొని లోకాభిరామాయణం మొదలుపెడతారు. శివుడు విష్ణువు సంభాషణల్లో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాల గణపతి స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకుని అమాంతం మింగేస్తారు. ఈ విషయాన్ని శివుడు కానీ విష్ణువు కానీ గమనించరు.

సుదర్శన చక్రం కోసం వెతుకులాట
కొంచెంసేపు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనబడదు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగారు. అప్పుడు బాల గణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువును అడగగా, సుదర్శన చక్రం కనబడటం లేదని విష్ణువు చెబుతాడు. అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేసానని చెబుతారు.

గణేశుని బతిమాలాడిన విష్ణుమూర్తి
తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాల గణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతారు. కానీ గణపతి ఇవ్వరు. ఆ సమయంలో గణేశుడి ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు.

వినాయకుని నవ్వులాట
విష్ణుమూర్తి గుంజీలు చేయడం చూసిన వినాయకుడికి నవ్వాగలేదు. పొట్ట చేత పట్టుకొని పగలబడి నవ్వుతారు. బాల గణపతి విపరీతంగా నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆ దెబ్బకు బతుకు జీవుడా అనుకుంటూ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకొని వైకుంఠానికి తిరిగి వెళ్లిపోతారు. బాల గణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావలసింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయన్న విశ్వాసం ఏర్పడింది.

గుంజీలు తీయడం వెనుక ఉన్న శాస్త్రీయత తెలుసా?
మన చెవులకు చివర ఉన్న తమ్మెలు అంటే కమ్మలు ధరించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు చురుగ్గా పని చేసి తెలివితేటలు పెరుగుతాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. అందుకే విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తెస్తే బుద్ధి పెరుగుతుందని అంటారు.

పెద్దల మాట చద్దిమూట
మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనుక తప్పకుండా ఓ శాస్త్రీయత ఉంటుంది. ఆ విషయాన్ని ముందు తరం వారికి తెలియజేయడమే మన బాధ్యత. వినాయకుని సమక్షంలో గుంజీలు తీస్తే తప్పకుండా బుద్ధి వికసనం అవుతుంది. ఓం శ్రీ గణేశాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

నాగదోషంతో రకరకాల సమస్యలా? ఆ గుడిలో మంగళవారం అలా పూజ చేస్తే చాలు! - Subramanya Swamy Temple Mopidevi

పెళ్లి లేట్ అవుతుందా? గంగా సప్తమి రోజు శివుడికి అభిషేకం చేస్తే వెంటనే మ్యాచ్​ సెట్​! - Ganga Sapthami Importance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.