ETV Bharat / opinion

దేశార్థికానికి పల్లెలే చుక్కాని.. గ్రామీణ గిరాకీయే శ్రీరామరక్ష!

author img

By

Published : Jul 18, 2020, 7:50 AM IST

Rural rudder for countries economy
గ్రామీణ గిరాకీయే శ్రీరామరక్ష! దేశార్థికానికి పల్లెలే చుక్కాని

కొవిడ్‌ దెబ్బ నుంచి తేరుకోవడానికి చాలా ఏళ్లే పట్టేట్లుంది. ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం, పెరిగిపోయిన విత్త లోటు, పడిపోయిన ఎగుమతులు, తరిగిపోయిన ప్రైవేటు పెట్టుబడులు, కుటుంబాలూ సంస్థల మీద అలవికాని రుణ భారం, బ్యాంకుల నిరర్థక ఆస్తుల వల్ల దేశ అభివృద్ధి పెద్దయెత్తున కోసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక కారుచీకట్లలో గ్రామీణార్థికం కాంతిరేఖలా మెరుస్తోంది. దీన్ని మరింత ప్రకాశించేట్లు చేయాలి. బ్యాంకులు వీరికి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తే, వారు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు. దానివల్ల గిరాకీ పెరుగుతుంది. యావత్‌ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ వినియోగం చోదక శక్తిలా పనిచేస్తుంది.

ప్రపంచం 2008 ఆర్థిక మందగతి నుంచి పూర్తిగా కోలుకోకముందే గోరుచుట్టుపై రోకటిపోటులా కొవిడ్‌ సంక్షోభం వచ్చిపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయి అన్ని దేశాల్లో నిరుద్యోగం జడలు విప్పి నర్తిస్తోంది. కొవిడ్‌ దెబ్బ నుంచి తేరుకోవడానికి చాలా ఏళ్లే పట్టేట్లుంది. ఇప్పటికే ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం, పెరిగిపోయిన కేంద్ర, రాష్ట్రాల విత్త లోటు, పడిపోయిన ఎగుమతులు, తరిగిపోయిన ప్రైవేటు పెట్టుబడులు, కుటుంబాలూ సంస్థల మీద అలవికాని రుణ భారం, బ్యాంకులకు గుదిబండలా తయారైన నిరర్థక ఆస్తుల వల్ల భారతదేశ అభివృద్ధి పెద్దయెత్తున కోసుకుపోతోంది. ఫలితంగా రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా క్షీణించింది. భారతదేశానికి ప్రస్తుతం భారీగా విదేశ మారక ద్రవ్య నిల్వలు పోగుపడిన మాట నిజమే కానీ, వాటిని చూసి మురిసిపోతూ కూర్చుంటే అది పెద్ద పొరపాటవుతుంది. విదేశ ద్రవ్య నిల్వలను మన ప్రభుత్వ మిగులుగా భ్రమించకూడదు. అలాగని భవిష్యత్తుపై ఆశే లేదని కాదు. లాక్‌డౌన్‌ల మధ్య కూడా దేశంలో విద్యుత్‌ గిరాకీ కొవిడ్‌ ముందునాటి స్థాయిని తిరిగి అందుకొంది. మే నెల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగింది. రహదారి, రైల్వే రవాణా మళ్ళీ పుంజుకొంటోంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు ఊహించినదానికన్నా వేగంగా పెరుగుతున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు గతేడాది కన్నా 20 శాతం అధికమయ్యాయి. ఇది గ్రామాల్లో వ్యవసాయ గిరాకీ వృద్ధికి నిదర్శనం.

చోదక శక్తి

ప్రస్తుత ఆర్థిక కారుచీకట్లలో గ్రామీణార్థికం కాంతిరేఖలా మెరుస్తోంది. దీన్ని మరింత ప్రకాశించేట్లు చేయాలి. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ కుటుంబాలపై రుణ భారం తక్కువ. బ్యాంకులు వీరికి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తే, వారు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు. దానివల్ల గిరాకీ పెరుగుతుంది. యావత్‌ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ వినియోగం చోదక శక్తిలా పనిచేస్తుంది. దేశార్థికం వేగంగా కోలుకోగలుగుతుంది. వ్యవసాయ దిగుబడులు, సంస్థాగత రుణాలు, ప్రభుత్వ ఆర్థిక సహాయం పెరిగినప్పుడు పల్లెలకు నగదు జోరుగా ప్రవహిస్తుంది. పట్టణాలకు వలస వెళ్లినవారు స్వస్థలాలకు పంపే మొత్తాలు దీనికి తోడవుతాయి. వెరసి గ్రామాల్లో గిరాకీ ఇనుమడిస్తుంది. దాన్ని తీర్చడానికి పారిశ్రామికోత్పత్తి, సేవా రంగం ముందుకొచ్చి ఆర్థిక రథం ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని అధిగమించగలుగుతుంది.

నిరుడు నాలుగు కోట్ల ఎకరాల్లో ఖరీఫ్‌ నాట్లు పడగా, ఈ ఏడాది ఆ విస్తీర్ణం 5.8 కోట్ల ఎకరాలకు చేరుకోవడం గొప్ప శుభ సూచన. గతేడాదికన్నా వరి విస్తీర్ణం 26 శాతం, పప్పుగింజల సాగుబడి 160 శాతం పెరిగాయి. నూనె గింజల సాగు 85శాతం, పత్తి 35శాతం అధికమయ్యాయి. ఈ ఏడాది మిడతల బెడద, ప్రకృతి వైపరీత్యాలేవీ సంభవించకపోతే పంటలు విరగకాస్తాయి. అమెరికా సహా పలు దేశాల్లో పంటల విస్తీర్ణం పోయిన సంవత్సరం కన్నా తగ్గినందువల్ల మన వ్యవసాయ మిగులుకు అంతర్జాతీయ విపణిలో గిరాకీ, దాంతోపాటే ఎగుమతుల వృద్ధి నమోదు కానుందని అర్థమవుతుంది. సేద్యం చలవతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు, ఆదాయాలు జోరందుకుంటాయి కాబట్టి పట్టణాలకు వలసలూ తగ్గుతాయి. కొవిడ్‌ వల్ల పల్లెలకు తిరిగివస్తున్న వలస కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి దొరుకుతుంది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు వచ్చేవరకు ఆగకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచే నిధులు, వనరులను కేటాయించడం గ్రామీణార్థికానికి ఊపునిచ్చింది.

కేంద్ర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది ఇంతవరకు రూ.90 వేలకోట్లు ఖర్చుపెట్టడం పల్లెలకు బలవర్ధకంగా పనిచేసింది. గతేడాది ఇదే కాలంలో ఆ శాఖ చేసిన ఖర్చు కేవలం రూ.44,000 కోట్లు. ప్రస్తుత సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన వ్యయంలో అత్యధికం, అంటే రూ.43,000 కోట్లను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపైనే వ్యయీకరించింది. మరో రూ.6,000 కోట్లను ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ పథకంపై ఖర్చుచేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులో 95 శాతాన్ని ప్రభుత్వం తొలి 100 రోజుల్లోనే ఖర్చుచేసింది. 2020 ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు ఈ పథకం కింద 130 కోట్ల పనిదినాలను సృష్టించారు. ఇందులో 80 కోట్ల పనిదినాలు ఆరు రాష్ట్రాల ఖాతాలో జమపడ్డాయి. ఈ పథకం వల్ల 4.87 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. నిరుడు కల్పించిన మొత్తం పని దినాల్లో 50 శాతాన్ని ఈ ఏడాది తొలి 100 రోజుల్లోనే కల్పించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పాల్గొంటున్న కార్మికుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ అయిదో స్థానం ఆక్రమిస్తోంది. తమిళనాడు ఈ విషయంలో ఆంధ్రకన్నా వెనకే ఉంది. కేవలం నాలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కార్మికులు కోటిమంది ఉన్నారు.

ముందున్న మార్గం

గ్రామాల పరిస్థితి మెరుగ్గా ఉన్నంతమాత్రాన దేశార్థికం పూర్తిగా కోలుకున్నదని భావించడం తొందరపాటు అవుతుంది. ఇది శుభారంభం మాత్రమేనని గ్రహించాలి. కరోనా వ్యాక్సిన్‌ ఎంత త్వరగా వస్తే దేశవిదేశాల ఆర్థిక వ్యవస్థలు అంత వేగంగా గాడినపడతాయి. ఆలోగా మన ఇల్లు చక్కదిద్దుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేయాలి. నిరర్థక ఆస్తులు పెరిగిపోయినందువల్ల బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడానికి జంకుతున్నాయి. పాత రుణాలను ఖాతాదారులు పూర్తిగా చెల్లించేసినట్లు, మళ్ళీ వారికే కొత్త రుణాలిచ్చినట్లు ఖాతా పుస్తకాల్లో చూపుతున్నాయే తప్ప- కొత్తగా ఎవరికీ రుణాలివ్వడం లేదు. ఖాతా పుస్తకాల్లో కనిపించేది మిథ్య. ఆస్తుల పూచీకత్తు మీద మాత్రమే ఆర్థిక సంస్థలు కొత్త రుణాలను మంజూరుచేస్తున్నాయి. అందుకే ఇటీవల బంగారంపై రుణాలు విరివిగా పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవలసిన దుస్థితిలోకి జారిపోయారు. ప్రస్తుతం వ్యవసాయంలో కనిపిస్తున్న ఆశారేఖలు కాంతిపుంజంలా మారాలంటే యోగ్యమైన అవసరార్థులకు సంస్థాగత రుణాలివ్వాలి. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వల్ల గిరాకీ పెరిగే మాట నిజమే కానీ, అది తాత్కాలిక ఉపశమనమేనని గుర్తించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల లభించే ఆదాయం స్వల్పమే. దీర్ఘకాలిక ఉపాధి దొరికేవరకు గండం గట్టెక్కడానికి తోడ్పడుతుంది. మన దేశంలో యువజనాభా అధికం కాబట్టి యుద్ధప్రాతిపదికపై దీర్ఘకాల ఉపాధి అవకాశాలను సృష్టించకపోతే సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాలకు వేరే ఆదాయ వనరులు లేకపోవడంతో ప్రజలు వినియోగించే వస్తువులపై ఎడాపెడా పన్నులు బాదుతున్నాయి. దీనివల్ల జనం చేతిలో డబ్బు మిగలడం లేదు. ఫలితంగా గిరాకీ, ఉత్పత్తులూ పెరగడం లేదు. అన్ని వస్తువులపై జీఎస్టీని, పెట్రో పన్నులనూ తగ్గిస్తే తప్ప గిరాకీ పెరగదు. గ్రామాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో కొత్త పెట్టుబడులపై కేంద్రం పదేళ్లపాటు పన్ను విరామం ఇవ్వాలి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

-డాక్టర్​ ఎస్.అనంత్ (ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.