ETV Bharat / opinion

మళ్లీ కోరలు సాచిన కాలుష్య భూతం

author img

By

Published : Nov 19, 2020, 11:25 AM IST

దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దీపావళి ముగిసిన తర్వాత కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు దీపావళి బాణసంచా కారణంగా కాలుష్యం మరింత అధికమైంది. దిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో కాలుష్యం.. వైరస్‌ వ్యాప్తికి మరింత దోహదకారిగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కఠినమైన ఆంక్షలతో ఆరోగ్యకర వాతావరణాన్ని సాధించగలమని ప్రభుత్వాలు గుర్తించి.. తదనుగుణంగా చర్యలు చేపట్టాలి.

POLLUTION WILL BE INCREASING AGAIN IN DELHI AND SURROUNDING AREAS
కోరలు చాచిన కాలుష్య భూతం

దేశరాజధాని దిల్లీ సహా, పరిసర ప్రాంతాలను మరోమారు వాయు కాలుష్యం కమ్ముకుంది. నిరుటితో పోలిస్తే ఈసారి దీపావళి ముగిశాక కాలుష్య స్థాయులు తీవ్రంగా పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించింది. గడచిన కొన్నేళ్లుగా దిల్లీని చుట్టుముట్టిన కాలుష్యభూతం చలికాలంలో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అగ్నికి వాయువు తోడైనట్లు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ ఏడాది నిషేధాజ్ఞలు ఉన్నా, లెక్క చేయకుండా పటాసుల విక్రయాలు విరివిగా జరిగాయి. దాంతో మళ్లీ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.

పండుగ మరుసటి రోజే..

దిల్లీలో దీపావళి సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించినవారిపై పోలీసులు 26 కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. పండగ మరుసటిరోజు ఉదయం దిల్లీలో గాలి నాణ్యత సూచీ 421గా నమోదైనట్లు భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సఫర్‌)' వెల్లడించింది. ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, గుర్గావ్‌లలోనూ దాదాపు అటూఇటుగా అదేస్థాయిలో కాలుష్యం నమోదైంది. గాలి నాణ్యత సూచీలో యూనిట్లు 51-100 మధ్య ఉంటే గాలిలో స్వచ్ఛత సంతృప్తికరంగా ఉన్నట్లు! 101-200 మధ్యస్తంగా, 201-300 మధ్య నాసిగా, 301-400 మధ్య దిగనాసిగా 401-500 మధ్య ప్రమాదకరంగా సఫర్‌ విభజించింది.

పెరిగిన సాంద్రత

దీపావళి అనంతరం దిల్లీలో గాలిలో 'పీఎం 2.5' (మైక్రాన్ల) సాంద్రతలో పెరుగుదల అధికంగా ఉన్నట్లు నమోదైంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశవ్యాధులు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఈ ముప్పు అందరికీ ఉన్నా చిన్న పిల్లలు, పసికందులు తక్షణం ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈసారి దీపావళి వల్ల కాలుష్యం తీవ్రతరమైనట్లు సీపీసీబీ జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. కాలుష్యం 'దిగనాసి (వెరీ పూర్‌)' నుంచి 'ప్రమాదకర (సివియర్‌)' స్థాయికి చేరినట్లు పేర్కొంది.

చర్యలు చేపట్టినా..

కేజ్రీవాల్‌ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకుంది. ట్రాఫిక్‌ సిగ్నళ్లవద్ద ఎర్రలైటు వెలగగానే ఆగే వాహనాలన్నీ తప్పనిసరిగా ఇంజిన్లను నిలిపివేయాలని సూచించింది. దీనిద్వారా 10 నుంచి 15 శాతం కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చన్నది నిపుణుల మాట. కాలుష్య నియంత్రణకు దిల్లీ నగరంలోని రహదారి కూడళ్ల వద్ద ప్రత్యేక ద్రావణాన్ని పిచికారీ చేశారంటే పరిస్థితి తీవ్రతను ఊహించవచ్చు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్‌ టెక్నాలజీ సంస్థ ‘ఐక్యు ఎయిర్‌’ అయితే ప్రపంచంలోనే దిల్లీ అత్యంత కాలుష్య నగరమని పేర్కొంది. ఆ సంస్థ జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని షెన్యాంగ్‌ తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఉజ్‌బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌ను అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా పేర్కొంది.

అందుకే సమస్య మరింత తీవ్రం..

ఆకాశంలో కమ్ముకునే కాలుష్య కారకాలు ఉష్ణ వాతావరణంలో చెల్లాచెదురవుతుంటాయి. చలివాతావరణంలో ఆ అవకాశం ఉండకపోవడంవల్లే వాయు కాలుష్యం విజృంభిస్తున్నట్లు 'అపెక్స్‌ పొల్యూషన్‌ వాచ్‌డాగ్‌' అనే సంస్థ వెల్లడించింది. బాణసంచా పేల్చడంవల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం తాత్కాలికమే అయినా- దిల్లీ కాలుష్యం కోరల నుంచి బయట పడేందుకు చాలా సమయమే పడుతుందని పేర్కొంది. నిరుడు చలి ముదరకముందే (అక్టోబరులో) దీపావళి పండుగ వచ్చింది. ఈసారి చలి వాతావరణంలో నవంబరు 14న పండగ రావడంతో సమస్య తీవ్రతరమైందని నిపుణులు అంటున్నారు. దక్షిణాదిలో రైతులు పంటపొలాల వ్యర్థాలను దుక్కి దున్ని ఎరువులా ఉపయోగించుకుంటారు. ఉత్తరాదిలో దీనికి భిన్నంగా కోతల అనంతరం పొలాల్లోనే పంట వ్యర్థాలను కాల్చేస్తారు. దీనివల్ల వారికి ఖర్చులు కలిసొస్తాయి.

పంట వ్యర్థాల వల్లే..

పాకిస్థాన్‌ సరిహద్దు గ్రామాల్లో, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో ఇలా పంట వ్యర్థాలను కాల్చడంద్వారా ఆకాశానికి ఎగసే సూక్ష్మ ధూళి కణాలు దిల్లీ పరిసర ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి. ఈ ధూళిమేఘాలు సృష్టిస్తున్న విధ్వంసం అంతాఇంతా కాదు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ- ఈ ధూమం రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలను మరింత భయపెడుతోంది. దిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో కాలుష్యం వైరస్‌ వ్యాప్తికి మరింత దోహదకారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కఠినమైన ఆంక్షలతోనే ఆరోగ్యకర వాతావరణాన్ని సాధించగలమని గుర్తించి, ప్రభుత్వాలు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

- నీలి వేణుగోపాల్ రావు, రచయిత

ఇదీ చదవండి: కొవాగ్జిన్​ తుది పరీక్షలకు తొలి వలంటీర్​గా ఆరోగ్య మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.