ETV Bharat / opinion

నవభారత నిర్మాణం కోసం 'గతిశక్తి'

author img

By

Published : Oct 15, 2021, 5:36 AM IST

Updated : Oct 15, 2021, 7:29 AM IST

వచ్చే పాతికేళ్ల అభివృద్ధికి పునాది వేస్తున్నామంటూ ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన 'పీఎం గతిశక్తి' బృహత్‌ ప్రణాళికలో సంస్కరణలకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. 100 లక్షల కోట్ల రూపాయల భూరి వ్యయంతో పట్టాలకు ఎక్కిస్తామంటున్న మహా ప్రణాళిక కార్యాచరణ తీరుతెన్నుల్ని మూడంచెల్లో పర్యవేక్షించనున్నారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా కార్యక్రమం యథాతథంగా అమలుకు నోచుకోవాలే గాని- భారత్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దగలిగేటంత విశిష్ట ప్రణాళిక ఇది!

pm gati shakti
నవభారత నిర్మాణం కోసం 'గతిశక్తి'

అయిదేళ్ల క్రితం ఎర్రకోట ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రభుత్వంలో పని సంస్కృతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాతికేళ్లుగా రాజ్య వ్యవస్థలో ప్రస్ఫుటమవుతున్న కీలక లోపాల్ని సరిదిద్దుతామన్న ప్రధాని- 'ప్రణాళికలో కేటాయింపులు చెబితే జనం నమ్మరు.. కళ్ల ఎదుట పనులు కనిపించాలి.. పనుల్లో వేగం ఉండాలి' అంటూ జనాకాంక్షలకు నాడు అద్దం పట్టారు. వచ్చే పాతికేళ్ల అభివృద్ధికి పునాది వేస్తున్నామంటూ తాజాగా ఆయన ఆవిష్కరించిన 'పీఎం గతిశక్తి' బృహత్‌ ప్రణాళికలో ఆ సంస్కరణాభిలాషే ఉట్టిపడుతోంది! న్యాయపాలికనే ఉక్కిరిబిక్కిరి చేసేటంతగా పెండింగ్‌ కేసుల కొండలు, అవినీతికి మారుపేరుగా దిగజారిన బ్యురాక్రసీ- మోదీ జమానాకు వారసత్వంగా సంక్రమించాయి. పర్యవసానంగా, ఏళ్లతరబడి కాలహరణం పుణ్యమా అని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంచనా వ్యయాలు ఇంతలంతలై వాటిని ఒక కొలిక్కి తేవడం గడ్డు సవాలుగా పరిణమించింది.

ప్రజాధనాన్ని వృథా చేయరాదన్న భావన మునుపటి ప్రభుత్వాల్లో కొరవడ్డ కారణంగా, సర్కారీ పనికి- నాణ్యతా లోపాలు, విపరీత జాప్యం, ఎక్కడా ఎవరికీ జవాబుదారీ కాకపోవడం సమానార్థకాలుగా స్థిరపడ్డాయి. ఒక విభాగం రోడ్డు వేసిన కొన్నాళ్లకే మరో విభాగ సిబ్బంది వచ్చి పైప్‌లైన్‌ కోసం తవ్వేసే బాగోతాలు దిగ్భ్రాంతకర అవ్యవస్థను చాటుతున్నాయి. ఇప్పుడు 16 మంత్రిత్వ శాఖల మధ్య; భారత్‌ మాల, సాగర్‌ మాల, భారత్‌ నెట్‌, ఉడాన్‌, రోడ్డు రైలు జల మార్గాల విస్తరణకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక పథకాల అమలులో గతిశక్తి ద్వారా అర్థవంతమైన సమన్వయ సాధనను లక్షిస్తున్నారు. ఎకాయెకి 100 లక్షల కోట్ల రూపాయల భూరి వ్యయంతో పట్టాలకు ఎక్కిస్తామంటున్న మహా ప్రణాళిక కార్యాచరణ తీరుతెన్నుల్ని మూడంచెల్లో పర్యవేక్షించే ఏర్పాట్లూ చేపట్టామంటున్నారు. యథాతథంగా అమలుకు నోచుకోవాలే గాని- భారత్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దగలిగేటంత విశిష్ట ప్రణాళిక ఇది!

సుమారు ఆరు దశాబ్దాల క్రితం పాల్‌ ఆపిల్‌ బై విశ్లేషించినట్లు- సాధించ తలపెట్టిన లక్ష్యాలను చేరే వీల్లేకుండా ముందరి కాళ్లకు బందాలు వేసుకునేలా ఇండియాలో నెలకొన్న అవ్యవస్థ ప్రపంచంలో వేరెక్కడా ఉండదు. ఆయన వ్యాఖ్యల్ని అక్షరసత్యాలుగా నిరూపించడంలో మునుపటి ప్రభుత్వాలెన్నో పోటీపడ్డాయి. 2008 సంవత్సరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు చెందిన ఎనిమిది అంతస్తుల కార్యాలయ భవన నిర్మాణాన్ని సంకల్పించారు. పనులు పూర్తయ్యేలోగా కేంద్రంలో రెండు ప్రభుత్వాలు మారాయి. ఆ సంస్థకు ఎనిమిది మంది ఛైర్మన్లు మారారు!

ఇటువంటి ఉదంతాలు ఒకటా, రెండా? రైల్వేలు, జాతీయ రహదారులు, పట్టణాభివృద్ధి, పెట్రోలియం, అణు ఇంధనం, టెలికాం, నౌకాశ్రయాలు తదితరాలకు చెందిన ప్రాజెక్టుల పరిపూర్తిలో వల్లమాలిన జాప్యం మూలాన అంచనా వ్యయాలకు రెక్కలు మొలుచుకొచ్చిన బాగోతాలు లెక్కకు మిక్కిలి! భిన్న రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం, భారత్‌లో వాణిజ్య అనుకూల వాతావరణ పరికల్పనకు విశేషంగా దోహదపడగలుగుతుంది. వెలుపలినుంచి పెట్టుబడుల ప్రవాహం ఇతోధికమైతే ఉపాధి కల్పనకు చురుకు పుడుతుంది. తద్వారా గిరాకీ జోరందుకుని దేశార్థిక వృద్ధి సరైన గాడిన పడుతుంది. ఈ కలను సాకారం చేయడానికి కేంద్రం మౌలిక రంగ ప్రగతిని కదం తొక్కిస్తామంటోంది. 2014కు ముందు 27 ఏళ్లలో 15వేల కిలోమీటర్ల నిడివి పైప్‌లైన్ల నిర్మాణం సాధ్యపడింది. 2009-14 మధ్య 1900 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల డబ్లింగ్‌ పనులు నమోదయ్యాయి. గత ఏడేళ్లలో 9000 కి.మీ. డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయంటున్న ప్రధాని- వచ్చే అయిదారేళ్లలోనే దేశవ్యాప్తంగా 16వేల కి.మీ. పొడవున గ్యాస్‌ పైప్‌లైన్లు వేసి తీరతామంటున్నారు. నిర్ణీత కాలావధి కన్నా ముందే ఇలా ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భిన్న శాఖల సమన్వయీకరణతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ ఏకీభావం అత్యావశ్యకం. కొరగాని నిబంధనల్ని తుడిచిపెట్టి, కలిసిరాని అధికారుల్ని వదిలించుకుని అవి ఏకోన్ముఖంగా పురోగమిస్తే- సురాజ్య అవతరణ సుసాధ్యమే!

ఇదీ చూడండి : రాబోయే 25 ఏళ్ల కోసం పునాది... 'గతిశక్తి': మోదీ

Last Updated :Oct 15, 2021, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.