ETV Bharat / opinion

భారత్​కు కొరకరాని కొయ్యగా జిన్​పింగ్!

author img

By

Published : Nov 17, 2021, 8:01 AM IST

చైనాలో ఎదురులేని ఏకైక నేతగా ఉన్న షీ జిన్‌పింగ్‌- వరసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టడం, జీవితకాల అధినాయకుడిగా అవతరించడం తథ్యమనే కథనాలు వెలుగుచూస్తున్నాయి. స్వదేశంలో తన పీఠాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారా శక్తిమంతమైన నాయకుడిగా అవతరించిన ఆయన- రాబోయే రోజుల్లో ఇండియాకూ కొరకరాని కొయ్యగా పరిణమించవచ్చు. 'సమస్యలు సృష్టించడం మాకు ఇష్టం లేని పని' అంటూనే అందుకు భిన్నంగా ప్రవర్తించడం జిన్‌పింగ్‌ నాయకత్వ శైలి! దేశ ప్రయోజనాలే పరమావధిగా, మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ ఇండియా చురుగ్గా వ్యవహరించాల్సిన సమయం ఇది.

china jinping news
విస్తరణ వాదానికి మారుపేరు.. 'షీ జిన్​పింగ్​'

ప్రపంచంపై పెత్తనం కోసం ఊవిళ్లూరుతున్న డ్రాగన్‌- కొన్నాళ్లుగా తన ప్రతి అడుగునూ ఆ లక్ష్య సాధన దిశగానే వేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) తాజా ప్లీనరీలోనూ అందుకు అనుగుణంగానే కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ఎదురులేని ఏకైక నేతగా ఉన్న షీ జిన్‌పింగ్‌- వరసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టడం, జీవితకాల అధినాయకుడిగా అవతరించడం తథ్యమనే కథనాలు వెలుగుచూస్తున్నాయి. పార్టీలో తనకు ప్రత్యామ్నాయ నాయకులంటూ ఎవరూ లేరనే రీతిలో చైనీయుల మనసుల్లో నిశ్చితాభిప్రాయాన్ని నిర్మించిన జిన్‌పింగ్‌- మావో జెడాంగ్‌ తరవాత అంతటి ప్రభావశీల నేతగా తనను తాను నిలబెట్టుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా, దేశాధ్యక్షుడిగా మూడు అధికార కేంద్రాలనూ ఒంటిచేత్తో ఒడిసిపట్టారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో శాంతి సందేశాలను ప్రవచించిన ఆయన అంతరంగమంతా విస్తరణ వాదమయం! తమ ఊహకందని వాయువేగంతో డ్రాగన్‌ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుంటోందని స్పష్టీకరించిన అమెరికా రక్షణ శాఖ నివేదికే అందుకు సాక్ష్యం! అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించి ఇటీవల అగ్రరాజ్యాన్ని కంగుతినిపించిన డ్రాగన్‌- నౌకాశక్తినీ ద్విగుణీకృతం చేసుకుంది. తైవాన్‌కు అండగా నిలబడటమంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లేనంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో తాజా వర్చువల్‌ భేటీలో జిన్‌పింగ్‌ హెచ్చరికలు జారీచేశారు. స్వదేశంలో తన పీఠాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారా శక్తిమంతమైన నాయకుడిగా అవతరించిన ఆయన- రాబోయే రోజుల్లో ఇండియాకూ కొరకరాని కొయ్యగా పరిణమించవచ్చు!

పద్దెనిమిది ఇరుగుపొరుగు దేశాలతో వివాదాలు పెట్టుకున్న కయ్యాలమారి.. చైనా! స్నేహహస్తం చాస్తూనే, వెనక నుంచి గోతులు తవ్వడంలో తనకు తిరుగులేదు. ఇండియాతో చర్చల ప్రక్రియను సాగదీస్తూ, నిర్మాణాత్మక సూచనలను తిరస్కరిస్తూ, ఉద్రిక్త పరిస్థితులకు ఎప్పటికప్పుడు ఆజ్యంపోసే డ్రాగన్‌ తొండి వైఖరి ఈనాటిది కాదు! 1962లో యుద్ధానికి తెగబడటమే కాదు, 'హద్దులు' దాటుతూ డ్రాగన్‌ ఇప్పటికీ ఇండియాపై కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్‌లలో నౌకా స్థావరాలతో భారత్‌ను పద్మవ్యూహంలో ఇరికించడానికి కుయుక్తులు పన్నుతోంది. తాను గుప్పిట పట్టిన టిబెట్‌ అరచేయి అయితే- దానికి భూటాన్‌, లద్దాఖ్‌, నేపాల్‌, సిక్కిం, అరుణాల్‌ప్రదేశ్‌ అయిదు వేళ్లు అన్నది ఆ దేశ దురహంకారం! అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఇటీవలి పర్యటనపైనా డ్రాగన్‌ విషంకక్కింది. ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందిస్తూ, అక్కడ రావణకాష్ఠాన్ని ఎగదోయడంలోనూ చైనా పాత్ర బహుముఖమనే కథనాలు అనేకం! వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో జనజీవన కార్యకలాపాలకు అనుమతిస్తూ బీజింగ్‌ తెచ్చిన కొత్త చట్టమూ భారత ప్రయోజనాలపై పెనుప్రభావం చూపించేదే! బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్టులు కట్టబోమంటూ ఇచ్చిన మాటను అటకెక్కించి మరీ తలపెట్టిన అతిభారీ జలవిద్యుత్‌ కేంద్రం- ఇండియాపై ఎక్కుపెట్టిన బాణమే! తాలిబన్లను ముద్దుచేస్తూ, పాకిస్థాన్‌ను నెత్తినమోస్తూ దక్షిణాసియాలో ప్రాబల్యం పెంచుకోవడానికి డ్రాగన్‌ శతథా ప్రయత్నిస్తోంది. దాని దూకుడును నిలువరించడానికి ఇండో-పసిఫిక్‌, పశ్చిమాసియా క్వాడ్‌ల్లో భారత్‌ క్రియాశీల భాగస్వామ్యం కీలకం. సరిహద్దుల్లో నిఘాను బలోపేతం చేసుకోవడంతో పాటు ఇటీవల పెచ్చరిల్లుతున్న చైనీస్‌ సైబర్‌ దాడులనూ సమర్థంగా తిప్పికొట్టాలి. 'సమస్యలు సృష్టించడం మాకు ఇష్టం లేని పని' అంటూనే అందుకు భిన్నంగా ప్రవర్తించడం జిన్‌పింగ్‌ నాయకత్వ శైలి! దేశ ప్రయోజనాలే పరమావధిగా, మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ ఇండియా చురుగ్గా వ్యవహరించాల్సిన తరుణమిది!

ఇదీ చూడండి:- అఫ్గాన్​పై అగ్రదేశాల మొసలి కన్నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.