ETV Bharat / opinion

భారతీయ రైతులపై రాయితీల ఆంక్షలు!

author img

By

Published : Oct 27, 2021, 6:31 AM IST

తన ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి తోడ్పడే విధంగా మద్దతు ధరను (Minimum Support Price in India) నిర్ణయించుకోవడానికి తనకు స్వేచ్ఛ ఉండాలని భారత్​ భావిస్తోంది. వ్యవసాయ ధరల్లో వచ్చే హెచ్చు తగ్గుల నుంచి సన్నకారు, చిన్నకారు రైతులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో అసలు సబ్సిడీలను లెక్కించడానికి డబ్ల్యూటీఓ అనుసరిస్తున్న విధివిధానాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది.

minimum support price in india
మద్దతు ధర

పంటలకు కనీస మద్దతు ధర చెల్లింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యాలు నిల్వ చేయడం వల్ల అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో అసమతుల్యత ఏర్పడుతోందంటూ (WTO and Indian Agriculture) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), సంపన్న దేశాలు పదేపదే వివాదం రేపుతుంటాయి. ఆహార సబ్సిడీలు మొత్తం పంట విలువలో పది శాతానికి మించకూడదని పరిమితులూ విధిస్తాయి. ఈ క్రమంలో భారత్‌, చైనాలతోపాటు వర్ధమాన దేశాల బృందమైన గ్రూప్‌ ఆఫ్‌ 33, ఆఫ్రికా దేశాలు- సబ్సిడీలపై పట్టువిడుపులు ప్రదర్శించాలంటూ డబ్ల్యూటీఓపై ఒత్తిడి తెస్తున్నాయి. కనీస మద్దతు ధరను మరింత పెంచాలని కోరుతున్నాయి. దీనిపై పరస్పర ప్రయోజనం దక్కేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించాయి. నవంబరు 30న జెనీవాలో జరిగే డబ్ల్యూటీఓ సమావేశంలో అదేపనిగా వరసపెట్టి నోటిఫికేషన్లు జారీ చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వర్ధమాన దేశాల ప్రజల కోసం ఆహార ధాన్యాలను, ఇతర పంటలను మొత్తం ఎంతమేర నిల్వ చేయాలో అంచనా వేయడానికి మరింత సమాచారం కావాలంటూ బ్రిటన్‌, కెనడా వంటి దేశాలు ఇటీవల డబ్ల్యూటీఓ వ్యవసాయ సంఘం సమావేశంలో అభిప్రాయపడ్డాయి. కరోనా మహమ్మారి వల్ల బడుగు దేశాల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారని రుజువు చేసేందుకు ఎలాంటి సమాచారం, సాక్ష్యాధారాలు అక్కర్లేదని భారత్‌ స్పష్టంచేసింది. ఆహార సబ్సిడీల (WTO and Agricultural Subsidies in India) వల్ల అంతర్జాతీయ ఎగుమతి విపణిపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, సబ్సిడీలు లేదా కనీస మద్దతు ధర చెల్లించి సేకరించే ధాన్యాన్ని, ఇతర ఉత్పత్తులను స్వదేశంలోనే వినియోగిస్తాం తప్ప, ఎగుమతి చేయబోమని భారత్‌, చైనా, జీ-33 దేశాలు భరోసా ఇస్తున్నాయి. ఈ విషయమై భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ అక్టోబరు 20న దిల్లీ వచ్చిన డబ్ల్యూటీఓ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్గోజీ ఒకాంజో ఐవీలాతో చర్చలు జరిపారు.

మద్దతు ధరపై స్వేచ్ఛ

కరోనా వల్ల దెబ్బతిన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పట్టాలెక్కించడానికి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో పంట ఉత్పత్తి వ్యయంకన్నా 150 శాతం ఎక్కువ ధరను కనీస మద్దతు ధరగా (Minimum Support Price in India) ప్రకటించారు. ఇది డబ్ల్యూటీఓ విధించిన పది శాతం పరిమితిని మించిపోతుంది. నవంబరులో జరిగే సమావేశంలో అమెరికా, బ్రిటన్‌, ఐరోపా దేశాలు దీనికి తీవ్రంగా అభ్యంతరపెట్టనున్నాయి. భారత్‌ ప్రకటించే కనీస మద్దతు ధర వరి, గోధుమ సాగు విలువలో 60 నుంచి 70శాతం వరకు ఉండి, డబ్ల్యూటీఓ విధించిన పది శాతం పరిమితిని అతిక్రమిస్తోందని అమెరికా వాదిస్తోంది. అసలు కనీస మద్దతు ధరపై పరిమితి విధించడం వెనక తర్కం ఏమిటని భారత్‌ నిలదీయాలి. తన ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి తోడ్పడే విధంగా మద్దతు ధరను నిర్ణయించుకోవడానికి తనకు స్వేచ్ఛ ఉండాలని మనదేశం భావిస్తోంది. వ్యవసాయ ధరల్లో వచ్చే హెచ్చు తగ్గుల నుంచి సన్నకారు, చిన్నకారు రైతులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో అసలు సబ్సిడీలను లెక్కించడానికి డబ్ల్యూటీఓ అనుసరిస్తున్న విధివిధానాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుత సబ్సిడీలను నిర్ణయించడానికి డబ్ల్యూటీఓ 1986-88 నాటి అంతర్జాతీయ ధరల సగటును ప్రాతిపదికగా తీసుకోవడం అభ్యంతరకరం. ఈ సగటుకన్నా ఎక్కువ చెల్లించే వర్ధమాన దేశాలు అంతర్జాతీయ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ, ఆ దేశాలపై జరిమానా విధించే అధికారం డబ్ల్యూటీఓకు ఉంది. సంపన్న దేశాలు తమ ఆహార ధాన్యాలను పేద దేశాల్లో కారుచౌక ధరలకు గుమ్మరించి, స్థానిక వ్యవసాయాన్ని దెబ్బతీసి, తామే అక్కడ పాగా వేయడానికి డబ్ల్యూటీఓ విధానం ఉపకరిస్తుంది.

మోకాలడ్డుతున్న సంపన్న దేశాలు

ఏటా 17,000 కోట్ల డాలర్ల వ్యవసాయ సబ్సిడీలను ఇస్తున్న అమెరికా, ఐరోపాలు- పేద దేశాలకు మాత్రం మోకాలడ్డుతున్నాయి. వ్యవసాయం ద్వారా సంపన్న దేశాలకు చేకూరుతున్న జీడీపీలో 50శాతాన్ని తిరిగి సబ్సిడీల కింద చెల్లిస్తున్నాయి. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ బిల్లు, అక్కడి వ్యవసాయ కార్పొరేషన్లకు జాక్‌పాట్‌లా మారింది. బిల్లు పుణ్యమా అని అమెరికన్‌ బహుళజాతి వ్యవసాయ కంపెనీలు నేడు ప్రపంచవ్యాప్తంగా సోయా, మొక్కజొన్న, పత్తి, కోడి మాంసం ధరలను శాసిస్తున్నాయి. కానీ, భారత జీడీపీలో వ్యవసాయ సబ్సిడీల వాటా పది శాతంకన్నా తక్కువే. అయినా సబ్సిడీలను తగ్గించాలని సంపన్న దేశాలు ఒత్తిడి తీసుకురావడం విస్మయకరం.

కార్పొరేట్‌ సంస్థల పైరవీ

అమెరికాలో వ్యవసాయ సబ్సిడీలను నేరుగా నగదు రూపంలో చెల్లిస్తారు. భారత్‌లో రైతులకు గిట్టుబాటు ధరల రూపంలో, ఎరువుల వంటి ఉత్పత్తి సాధనాల రూపంలో సబ్సిడీలను చెల్లిస్తున్నారు. ఇది మార్కెట్‌ ధరలను ప్రభావితం చేస్తుందని డబ్ల్యూటీఓ వాదన. అమెరికా జనాభాలో కేవలం 1.1 శాతం, అంటే నాలుగు లక్షల కుటుంబాలు పంటల సాగుపై ఆధారపడి జీవిస్తుంటే, భారత్‌లో 12 కోట్ల కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. అమెరికా ప్రభుత్వం నుంచి సగటున ప్రతి రైతుకు 50,000 డాలర్లు సబ్సిడీ రూపంలో ముడుతుంటే, భారతీయ రైతుకు దక్కేది కేవలం 200 డాలర్లు. సంపన్న దేశాలు నగదు రూపంలో ఇస్తున్న సబ్సిడీలే అంతర్జాతీయ ఆహార వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని భారత్‌, చైనాలు 2017లో డబ్ల్యూటీఓను డిమాండ్‌ చేశాయి. దీనికి 100కుపైగా దేశాలు మద్దతు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు కూడా డబ్ల్యూటీఓ సంపన్న దేశాల ఒత్తిడికి తలొగ్గరాదని కోరుతున్నాయి. నేడు ప్రపంచ వ్యవసాయ రంగాన్ని కాగల్‌, ఏడీఎం, బంజ్‌, డ్రేఫస్‌ వంటి భారీ కార్పొరేట్‌ సంస్థలు శాసిస్తున్నాయి. 75శాతం ప్రపంచ ఆహార వాణిజ్యం ఈ బడా కంపెనీల చేతుల్లోనే ఉంది. స్థానిక పంటల బదులు సోయా, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలను చేపట్టేలా అవి రైతులను ప్రలోభపెడతాయి. డబ్ల్యూటీఓ విధానాలను తమకు అనువుగా మార్చేట్లు సంపన్న దేశాల ప్రభుత్వాల వద్ద పైరవీలు చేస్తుంటాయి. అందుకే 2008 నుంచి అంతర్జాతీయ వ్యవసాయ సబ్సిడీలలో సంస్కరణలకు సంపన్న దేశాలు అడ్డుపడుతున్నాయి. పేద రైతులను ఆదుకునే విధానాలను అడుగడుగునా ప్రతిఘటిస్తున్నాయి. 1995-2014 మధ్య అమెరికా దాదాపు 30 ఉత్పత్తులకు పది శాతంకన్నా ఎక్కువ సబ్సిడీలను ఇవ్వగా, ఐరోపా 50శాతం సబ్సిడీలను ఇచ్చింది. ఈ విధంగా అంతర్జాతీయ పోటీ నుంచి తమ రైతులను రక్షించుకుంటూ పేద దేశాల కర్షకులకు మాత్రం రక్షణ దక్కకుండా నిరోధిస్తున్నాయి. ఈ విధమైన దుర్విచక్షణపై భారత్‌, చైనా, వర్ధమాన దేశాలు కలిసికట్టుగా పోరాడాలి.

-పరిటాల పురుషోత్తం

(రచయిత- సామాజిక ఆర్థిక విశ్లేషకులు)

ఇదీ చూడండి: మద్దతు ధరతోనే.. రైతు భద్రతకు రాజమార్గం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.