ETV Bharat / politics

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - సర్వం సిద్ధం చేసిన అధికారులు - TS GRADUATE MLC BY ELECTION POLLING

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 10:16 PM IST

Updated : May 27, 2024, 6:39 AM IST

Telangana Graduate MLC By Election Polling : వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పొలింగ్‌ జరగనుంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే ఓటింగ్‌ కోసం 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.

All Arrangements set for MLC Elections
MLC Elections Polling (ETV Bharat)

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - సర్వం సిద్ధం చేసిన అధికారులు (ETV Bharat)

Telangana Graduate MLC By Election Polling Today 2024 : వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎత్తులు-పైఎత్తులు, వ్యూహ-ప్రతివ్యూహాలని ప్రదర్శించాయి.

ఈనెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్, 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్​ఎస్​ అభ్యర్థి రాకేశ్​ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ సహా 52 మంది పోటీలో ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2 లక్షల 88 వేల 189 మంది పురుషులు కాగా లక్షా 75 వేల 645 మంది మహిళలున్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు : అధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్ధిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1448 మంది పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులని నియమించారు. సోమవారం మద్యం దుకాణాలు బంద్‌ సహా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వయొలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్‌ చేయాలి. మైసూరులోని మైసూర్ పెయింట్స్ నుంచి పెన్నులని ఎన్నికల కమిషన్ సమకూర్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు. ప్రజాప్రాతినిధ్యం చట్టంలో ఎమ్మెల్సీ ఎన్నికకు గరిష్ఠ వ్యయ పరిమితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు.

ఎండ తీవ్రత ఉంటే షామియానా, కుర్చీలు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పొలింగ్‌ అధికారులను ఈసీ ఆదేశించింది. వర్షం పడితే పోలింగ్‌తోపాటు బ్యాలెట్ పత్రాల రవాణాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని సీఈవో ఆదేశించారు. ప్రైవేట్ కార్యాలయాల సిబ్బంది ఓటు వేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని, షిఫ్టుల సర్దుబాటు, ఆలస్యం వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లోక్‌సభ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు అంటే జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ దాసరి హరిచందన - RO Dasari Harichandana Interview

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారో తెలుసా? - ఫస్ట్​ టైమ్​ ఓటర్లు ఈ వీడియో చూసేయండి - How to Vote for MLC Election

Last Updated : May 27, 2024, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.