మద్దతు ధరతోనే.. రైతు భద్రతకు రాజమార్గం!

author img

By

Published : Sep 16, 2021, 6:00 AM IST

రైతు
రైతు ()

వచ్చే అయిదేళ్లకు సరిపడేంత నిల్వలున్న కారణంగా ఇకమీదట బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం స్పష్టంచేస్తోంది. దీనితో రైతులు ప్రత్యామ్నాయాల వైపు మళ్లడం మంచిదని కేసీఆర్‌ సర్కారు చెబుతోంది. వరికి ప్రత్యామ్నాయంగా సెనగలు, వేరుశనగ, పెసలు, మినుములు, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయల వంటివి పండించడం లాభదాయకమని ప్రభుత్వం సూచిస్తున్నా- వరి సాగు మానుకోవాలనడంపై ఆందోళన వ్యక్తమవుతోంది

వచ్చే యాసంగి (రబీ) నుంచి తెలంగాణవ్యాప్తంగా వరి సాగు చేయవద్దన్న ప్రభుత్వ సూచన రైతుల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రబీ పంటకాలంలో వరిని ప్రధానంగా బంగాల్, తెలంగాణ, ఏపీ, అస్సాం రాష్ట్రాలే పండిస్తుంటాయి. యాసంగిలో ఉత్పత్తయ్యే ధాన్యాన్ని తెలంగాణలో ఉప్పుడు బియ్యంగా మార్చడం పరిపాటి. అయిదేళ్లకు సరిపడేంత నిల్వలున్న కారణంగా ఇకమీదట ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదన్న కేంద్రప్రభుత్వ స్పష్టీకరణ దరిమిలా- రైతులు ప్రత్యామ్నాయాల వైపు మళ్ళడం మంచిదని కేసీఆర్‌ సర్కారు చెబుతోంది. వరి బదులు సెనగలు, వేరుశనగ, పెసలు, మినుములు, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయల వంటివి పండించడం లాభదాయకమని ప్రభుత్వం సూచిస్తున్నా- వరి సాగు మానుకోవాలనడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం (ఖరీఫ్‌)లో వ్యవసాయ శాఖ నిర్దేశాలను విస్మరించి పత్తి, జొన్నలు, కందులు తదితరాల్ని తగ్గించి అంచనాలను మించి వరి సేద్యం చేపట్టిన రైతులు- ఇప్పుడు ఏ మేరకు తీరు మార్చుకుంటారన్నది ప్రశ్నార్థకమే.

సూచనలతో మార్పు..

ఎప్పుడు ఎక్కడ ఏ పైరు శ్రేయస్కరమన్న శాస్త్రీయ సూచనలు, దేశమంతటికీ అనువైన పంటల ప్రణాళిక కొరవడ్డ కారణంగా- అందరూ ఏం వేస్తే తానూ అటువైపే మొగ్గడం సగటు రైతుకు అలవాటుగా మారింది. వేలంవెర్రి సాగు విధానాలవల్ల దళారులు, వ్యాపారుల పంట పండుతుండగా- సాగుదారులు నిస్సహాయంగా నష్టాల పాలబడటం చూస్తున్నాం. అమెరికా తరవాత ఇండియాలోనే అత్యధికంగా సేద్యయోగ్యమైన భూములున్నాయి. వాటిని గరిష్ఠ ప్రాతిపదికన సద్వినియోగం చేసుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. అధిక దిగుబడులిచ్చే మేలిమి వంగడాల్ని వినియోగంలోకి తెచ్చి, స్థానిక అనుకూలాంశాలకు తగ్గట్లు జాతీయస్థాయి పంటల ప్రణాళికను వడివడిగా పట్టాలకు ఎక్కించాలి.

పేరుకిది వ్యవసాయ ప్రధాన దేశమైనా, ఇక్కడ సేద్యానిది ఆనవాయితీగా నష్టజాతకమే. గ్రామీణ భారతాన సుమారు 70 శాతం కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నా- అత్యధికులది చిరకాలంగా ఏటికి ఎదురీతే. ఇప్పటికీ సరైన పంటల బీమారక్షణ ఎండమావై అసంఖ్యాక అన్నదాతల బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతు కుటుంబాలెన్నో పోనుపోను అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఏపీలో 93.2 శాతం కర్షక కుటుంబాల సగటు రుణభారం దాదాపు రెండున్నర లక్షల రూపాయలు. తెలంగాణలో 91.7 శాతం రైతు కుటుంబాల సగటు అప్పు లక్షన్నర రూపాయలకు పైబడింది! సగటు రైతు కుటుంబ ఆదాయం నెలకు ఆరువేల రూపాయల లోపేనని అధ్యయనాలు చాటుతున్నాయి. భూమి విలువను, కౌలు వ్యయాలను కలిపి వాస్తవ ఖర్చుల్ని మదింపు వేసి అదనంగా యాభైశాతం లాభం జోడించి గిట్టుబాటు ధర ప్రకటించాలన్న స్వామినాథన్‌ మేలిమి సిఫార్సుకు మన్నన దక్కుతున్నదెక్కడ?

సమన్యాయం..

వినియోగదారులకు సరసమైన ధరల్లో సేద్య ఉత్పత్తులు అందించడం అభిలషణీయమేగాని- ఆ పేరు చెప్పి రైతుల్ని శ్రమదోపిడికి గురిచేయడం అమానవీయం. పంటరుణాలు, విత్తులు, ఎరువుల దశనుంచి మార్కెటింగ్‌ వరకు ప్రతి అంచెలోనూ నిస్పృహ చెందుతున్న అన్నదాతను ప్రకృతి విపత్తులూ చెండుకు తింటున్నాయి. సొంతకాళ్లపై రైతుల్ని నిలదొక్కుకునేలా, రేపటి తరాలవారూ సేద్యంవైపు ఆకర్షితులయ్యేలా- వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచే కృషిలో ప్రభుత్వాలు స్థిరంగా ముందడుగు వేయాలి. రైతుల్ని కేవలం ఓటుబ్యాంకులుగానే జమకట్టకుండా, దేశానికి తిండిపెట్టే శ్రమజీవులుగా గుర్తించి- వారి బతుకుల్లో పచ్చదనం విరబూయించాలి. దేశంలోని ఏ నేలలు ఏయే పంటలకు అనుకూలమో, ఎక్కడ ఎంత మేర సాగుచేస్తే దేశీయావసరాలు తీరి, విదేశీ విపణుల్ని ఒడిసిపట్టగల వీలుందో పకడ్బందీ ప్రణాళిక రూపొందించి చురుగ్గా అమలుపరచాలి. అన్నిరకాల పంటలకూ కనీస మద్దతును ప్రభుత్వమే సమకూర్చి, ఆ వ్యయాన్ని ఎగుమతుల పద్దుకింద రాబట్టుకునేలా సేద్యవ్యూహాలు పదును తేలినప్పుడే- మన రైతాంగానికి ఆత్మనిర్భరత ఒనగూడుతుంది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.