ETV Bharat / opinion

సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే- గాడిన పడేదెలా?

author img

By

Published : Nov 9, 2021, 8:36 AM IST

లాక్‌డౌన్ల వల్ల సరకులకు గిరాకీ పడిపోయినా, ఆంక్షల ఎత్తివేత అనంతరం కొద్దిగా పెరిగింది. అయినా ఆ కాస్త గిరాకీనీ తీర్చలేని పరిస్థితి ఏర్పడిందంటే కారణం- సరఫరా గొలుసులు అస్తవ్యస్తం కావడమే. కరోనా సంక్షోభం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేకపోతోంది. సంపన్న దేశాలు సైతం రాగల ఆరు నెలల్లో సరకుల కొరతను తీర్చడమెలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి.

economic effects of covid-19 in india on supply chain management
సరఫరా స్తంభిస్తే భారత్​కు ఇక్కట్లే

కొవిడ్‌ తెచ్చిపెట్టిన పెను నష్టాల్లో ఎవరూ ఊహించనిది 'సరఫరా గొలుసుల విచ్ఛిన్నం'. లాక్‌డౌన్ల వల్ల సరకులకు గిరాకీ పడిపోయినా, ఆంక్షల ఎత్తివేత అనంతరం కొద్దిగా పెరిగింది. అయినా ఆ కాస్త గిరాకీనీ తీర్చలేని పరిస్థితి ఏర్పడిందంటే కారణం- సరఫరా గొలుసులు అస్తవ్యస్తం కావడమే. ఈ సంక్షోభం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేకపోతోంది. సంపన్న దేశాలు సైతం రాగల ఆరు నెలల్ల్లో సరకుల కొరతను తీర్చడమెలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో ఇప్పటికే దుకాణాల అరలు సరకులు లేక వెలాతెలాపోతున్నాయి. సరకుల కొరతతో ధరలు పెరుగుతున్నాయి.

దిక్కుతోచని స్థితి

కొవిడ్‌ సంక్షోభంతో నౌకా రవాణా భారీగా దెబ్బతిన్నది. ఒక్క నౌకలనే కాదు- రైలు, రోడ్డు, విమాన రవాణా ఖర్చులూ చుక్కలనంటుతున్నాయి. కంటైనర్లలో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. 2019 అక్టోబరులో 20 అడుగుల కంటైనర్‌లో సరకులు రవాణా చేయడానికి 1,200 డాలర్లు ఖర్చయితే, నేడది 10,000 డాలర్లకు పెరిగింది. అది చాలదన్నట్లు కంటైనర్ల నుంచి సరకులను దించే నాథుడు లేక రేవుల్లో నౌకలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ధరలు పెరిగిపోతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో సరకులు ఎత్తడం, దించడం చేసే అధునాతన రేవుల్లో సైతం ఆ ప్రక్రియకు పట్టే సమయం 30శాతం మేర పెరిగింది. ఈ ఆలస్యం ధరవరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అక్టోబరులో ఒక్క రోజులో ఐరోపాలో సహజవాయువు ధర 40శాతం పెరిగింది. గడచిన రెండు నెలల్ల్లో బొగ్గు ధర 60శాతం పెరిగితే, ఎరువుల ధర 2012 తరవాత ఎన్నడూ లేనంత స్థాయికి ఎగబాకింది. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఆహార ధరల సూచీ ఏడాది క్రితంకన్నా 38శాతం పెరిగింది. కంటైనర్ల కొరతతో ఉత్పత్తిదారులు ముడి సరకులు దిగుమతి చేసుకోవడానికి, సరకు దించుకోవడానికి ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంటే, వినియోగదారులు ప్రతి వస్తువుకు అధిక ధర కక్కక తప్పడం లేదు. మరోవైపు వాతావరణ మార్పులను నిరోధించడానికి చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగంలో ప్రభుత్వాలు కోత విధించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. సరఫరా గొలుసుల విచ్ఛిన్నంతో ఏర్పడిన పరిస్థితిని ఎలా నిభాయించాలో ప్రభుత్వాలకు, కేంద్ర బ్యాంకులకు పాలుపోవడం లేదు. ఈ సమస్య 2023 వరకు కొనసాగుతుందని బ్రిటన్‌లో ప్రముఖ కంపెనీలు హెచ్చరిస్తుంటే- తమ దేశంలో గడ్డు స్థితి 2022 మధ్య వరకు ఉంటుందని అమెరికా కేంద్ర బ్యాంకు- 'ఫెడరల్‌ రిజర్వ్‌' హెచ్చరించింది. భారతదేశమూ దీనికి మినహాయింపేమీ కాదు. సరఫరా గొలుసుల విచ్ఛిన్నం వల్ల సరకుల ధరలు పెరిగిపోతున్నాయి. 2011-13లో చోటుచేసుకున్న ద్రవ్యోల్బణంకన్నా తీవ్రమైనది ఇప్పుడు మన ముంగిట పొంచిఉంది. అప్పట్లో గిరాకీకి తగ్గ సరఫరా లేక ధరలు పెరిగితే, ఇప్పుడు పెద్దగా గిరాకీ పెరగకున్నా సరఫరాకు గండి పడి ద్రవ్యోల్బణం జోరందుకుంటోంది.

తీవ్ర అంతరాయం

గడచిన మూడు, నాలుగు దశాబ్దాల్లో దేశాలు, కంపెనీలు అన్ని సరకులనూ ఒక్క చోటనే ఉత్పత్తి చేయకుండా, సింహభాగాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాయి. సరకు రవాణా రంగంలోనూ పొరుగు సేవలు పెరిగాయి. దీనివల్ల కంపెనీల లాభాలు హెచ్చాయి. కొన్ని దేశాలు కొన్ని రకాల ప్రత్యేక సేవల్లో, ఉత్పత్తుల్లో నైపుణ్యాలు సాధించాయి. దేశాలు పరస్పరం ఆధారపడటం ఎక్కువైంది. 1997 నుంచి చైనా, ఆగ్నేయాసియా దేశాలు ప్రపంచ విపణి కోసం సరకులు ఉత్పత్తి చేసి అందించసాగాయి. ఇతర దేశాల కంపెనీలు అదేపనిగా సరకులు నిల్వచేసుకోకుండా, అవసరమైనప్పుడు మాత్రమే వాటిని దిగుమతి చేసుకునే విధానానికి మళ్లడంద్వారా నిల్వ ఖర్చులు భారీగా తగ్గించుకున్నాయి. పోనుపోను ఆధునిక సాంకేతికత నిల్వల నిర్వహణ, కొత్త ఆర్డరు పెట్టే ప్రక్రియను ఎంతో మెరుగుపరచింది. గడచిన 30 ఏళ్లలో ప్రపంచీకరణ పెరగడంతో అంతర్జాతీయ వాణిజ్యానికి దేశాలవారీ అడ్డంకులు తొలగి వ్యాపారం విజృంభించింది. 2000-17 మధ్య అంతర్జాతీయ వాణిజ్యం పెంపొందడం వల్ల ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల జీడీపీ రెట్టింపై, 3.6 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇంతలో కొవిడ్‌ వచ్చిపడి దేశాలు లాక్‌డౌన్లు విధించడంతో సరకుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అన్ని దేశాల్లో ఉత్పత్తి, సరఫరా ప్రక్రియలు స్తంభించిపోయాయి.

పరిష్కారం ఏమిటి?

సరఫరా గొలుసుల విచ్ఛిన్నం సమస్య ఇప్పుడప్పుడే తొలగిపోయేది కాదు. సరకుల సరఫరా తగ్గినప్పుడు ధరలు పెరగడం అనివార్యం. ఇప్పటికే ద్రవ్యోల్బణం పైచూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు ఆహారంతోపాటు వివిధ సరకుల ఉత్పత్తి, సరఫరాలను దెబ్బతీస్తున్నాయి. పరిస్థితి రాగల మూడు, నాలుగు నెలల్ల్లో మెరుగుపడకపోతే ప్రస్తుతం కనిపిస్తున్న కాస్తో కూస్తో ఆర్థికాభివృద్ధీ పడకేస్తుంది. ధరలు, గిరాకీ పెరిగినప్పుడు ఉత్పత్తి పెంచడానికి కంపెనీలు ఎడాపెడా రుణాలు తీసుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాయి. ఇప్పుడు అదనంగా ఉత్పత్తి పెంచితే కంపెనీలకు నష్టాలు మిగులుతాయి. వాటికి మూలధన రుణాలిచ్చిన బ్యాంకులు చిక్కుల్లో పడతాయి. ప్రస్తుతం వినియోగ వస్తు తయారీ సంస్థలు మాత్రమే 65-70శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోగలుగుతున్నాయి. ఫార్మా, ఆటొమొబైల్‌, సిమెంటు కంపెనీలైతే 60శాతం ఉత్పత్తీ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి పెట్టుబడి రుణాలివ్వడం సబబా కాదా అనేది విధానకర్తలు, రిజర్వు బ్యాంకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. 2011-13లో ధరలు కట్టలు తెంచుకున్నందువల్లే యూపీఏ-2 ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గుర్తుంచుకొని ఇంధన ధరలు తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేయాలి. పెట్రో ధరలు హెచ్చితే రవాణా ఖర్చులూ ఎగబాకి ఆహారంతోపాటు అన్ని సరకుల ధరలు పెరిగిపోతాయి. అది వినియోగదారుల జేబుకు చిల్లిపెట్టి సర్కారుపై ప్రజల ఆగ్రహానికి దారితీస్తుంది. అప్పుడు పాలకులు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

కనుమరుగైన చిన్న సంస్థలు

కొవిడ్‌ భూతం 2020 తొలినాళ్లలో కొన్ని దేశాలకే పరిమితమైంది. అనేక దేశాల్లో దాని జాడలు కనిపించలేదు కాబట్టి సరఫరా గొలుసులకు అంతగా విఘాతం కలగలేదు. అంతకంతకు కొవిడ్‌ ప్రపంచాన్ని చుట్టేయడంతో లాక్‌డౌన్లు విస్తరించి, అన్ని దేశాలూ ఆర్థికంగా సంక్షోభంలోకి జారిపోయాయి. వైరస్‌ వ్యాప్తి దశలవారీగా ఉద్ధృతమవుతున్న కొద్దీ సరఫరా గొలుసులూ దెబ్బతింటున్నాయి. ప్రధానంగా ముడి సరకులను, పాక్షికంగా ఉత్పత్తి అయిన వస్తువులను ఎగుమతి చేసే భారత్‌, లాటిన్‌ అమెరికా దేశాల్లో చిన్న కంపెనీలు క్రమంగా కనుమరుగై పెద్ద కంపెనీలు పెరిగిపోయాయి. కొవిడ్‌ సంక్షోభంతో అవి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయి మార్కెట్‌కు సరకులను అందించలేకపోవడంతో ధరలు పెరిగిపోయి వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు.

-డా. ఎన్​ అనంత్​, ఆర్థిక రంగ నిపుణులు

ఇదీ చూడండి: మహమ్మారిని మించిన కాలుష్య భూతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.