ETV Bharat / opinion

శ్రీలంకతో స్నేహబంధం కావాలి దృఢతరం

author img

By

Published : Aug 8, 2020, 7:49 AM IST

శ్రీలంకలో మహింద రాజపక్స భారీ విజయంతో మళ్లీ ప్రధాని కుర్చీని దక్కించుకున్నారు. అయితే ఇరుగుపొరుగుతో సంబంధాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్.. శ్రీలంకకు స్నేహహస్తాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఓ వైపు శ్రీలంకను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోన్న చైనా వ్యూహాల నడుమ భారత్​కిది సవాలుగా మారనుంది.

srilanka
శ్రీలంక

రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికలు వాయిదా పడటం వల్ల ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించే తీరాలన్న సంకల్పంతో ముందుకెళ్ళిన శ్రీలంక అనుకున్నది సాధించింది. మొత్తం 71 శాతం ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో మహింద రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పీపుల్స్‌ పార్టీ మూడింట రెండొంతుల అద్భుత మెజారిటీతో విజయదుందుభి మోగించడం విశ్లేషకులనూ ఆశ్చర్యపరచిన పరిణామం.

అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తున్న 19వ రాజ్యాంగ సవరణను ఎత్తివేయడమో లేదా దానికి మార్పులు తీసుకురావడమో చేస్తామన్న హామీతో ప్రధాని పదవి చేపట్టిన మహింద రాజపక్స ఇప్పుడు ఎలాంటి అడుగు వేయనున్నారన్నది ప్రశ్నగా మారింది. స్వయంగా తన సోదరుడు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితుల్లో- ప్రధానిగా తన అధికారాలకు, పార్లమెంటు విశేష అధికారాలకూ కోతపెట్టి అధ్యక్షుడికి అగ్రాసనం కట్టబెట్టేందుకు మహింద ఎంతమేరకు ముందుకు వస్తారన్నదే శ్రీలంకలో విస్తృత చర్చనీయాంశంగా మారింది.

భారత్‌ దక్షతకు పరీక్ష

మైత్రిపాల సిరిసేన, విక్రమసింఘేల నడుమ అంతర్గత పోరు ముదురు పాకానపడటం; ఈస్టర్‌ పర్వదినాన ఉగ్రదాడుల్లో 290కిపైగా అమాయకులు అసువులు బాసిన నేపథ్యంలో- 2019 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ రాజపక్స అప్రతిహత విజయం సాధించారు. విపక్షమైన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) ప్రస్తుత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లతో సోదిలో కూడా లేకుండా పోయింది.

స్వయంగా సోదరులిరువురూ అధ్యక్ష, ప్రధాని స్థానాలను అలంకరించడం; విపక్షాలు దాదాపుగా గల్లంతు కావడం, ప్రశ్నించే గళాలకు చోటులేకపోవడం వంటివి- ఇరువురు రాజపక్సల తీరుతెన్నులను ఎలా ప్రభావితం చేయనున్నాయన్నది ఆసక్తికరం. రాజకీయంగా ఎదురులేని ఈ వాతావరణం వారిని నియంతలుగా మారుస్తుందా అన్న భయానుమానాలూ లేకపోలేదు. మహింద రాజపక్స ఉత్థానం భారత్‌, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకాంశం.

మూడుసార్లు ప్రధానిగా (ప్రస్తుత గెలుపుతో నాలుగోసారి), రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా విశేష పాలనానుభవం గడించిన మహింద రాజపక్సతో తొమ్మిదో దశకంలో భారత్‌ సన్నిహిత సంబంధాలే నెరపింది. తరవాతి కాలంలో రాజపక్స చైనాతో రాసుకు పూసుకొని తిరగడం, శ్రీలంకలోని తమిళ మైనారిటీల రాజకీయ హక్కులను కాలరాయడంతో ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం కొంతమేర బలహీనపడింది.

చైనా వ్యూహాలు..

నిరుడు నవంబరులో గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికవడం, తాజాగా కళ్లు చెదిరే మెజారిటీతో మహింద రాజపక్స విజేతగా నిలిచిన దృష్ట్యా- ఇరుదేశాల అనుబంధ పునరుద్ధరణపై భారత్‌ తీక్షణంగా దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకను ప్రభావితం చేసి తన కనుసన్నల్లోకి తెచ్చుకునేందుకు కొన్నేళ్లుగా చైనా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే నేపాల్‌ను భారత్‌పైకి ఉసిగొల్పడంలో బీజింగ్‌ నాయకత్వం విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో చైనా ప్రభావానికి లోబడి మరో పొరుగు దేశం శ్రీలంక సైతం భారత్‌కు ప్రతికూలంగా మారకుండా జాగ్రత్తపడాల్సిన చారిత్రక అవసరం మోదీ సర్కారు ముందుంది. అధికారికంగా పూర్తి ఫలితాలు వెల్లడికాక మునుపే, ప్రపంచ దేశాల నాయకులందరికన్నా ముందే మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్‌ చేసి శుభకామనలు తెలపడం ఈ క్రమంలో ఓ ముందడుగనే చెప్పాలి.

విదేశీ జోక్యంతో..

కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి శ్రీలంకతో చేసుకున్న ఒప్పందాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది. మరీ ముఖ్యంగా కొలంబో ఓడరేవులోని తూర్పు కంటైనర్‌ టర్మినల్‌(ఈసీటీ) పేరిట తలపెట్టిన సరకుల రవాణా ప్రాజెక్టు పట్టాలకెక్కడం వ్యూహాత్మకంగా భారత్‌కు చాలా అవసరం. సుదీర్ఘ చర్చోపచర్చల తరవాత 2019 మేలో 70 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో జపాన్‌, ఇండియాలు సంయుక్తంగా ఈసీటీ అభివృద్ధికి శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

మైత్రిపాల, విక్రమసింఘేల మధ్య స్పర్ధలు ముదరడానికి ఇదీ ఒక కారణమే. తమ జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో విదేశీ శక్తుల జోక్యం సహించరానిదని నాడు అధ్యక్షుడిగా మైత్రిపాల వాదించారు. జపాన్‌ జోక్యంతో వారి మధ్య గొడవ సద్దుమణిగి సంయుక్త ఒప్పందం కుదిరింది. శ్రీలంకకు దక్షిణాన ఉన్న హంబన్‌టొట రేవును చైనాకు 99 ఏళ్ల కాలానికి లీజుకు కట్టబెట్టిన విషయంలో మాత్రం అక్కడి నాయకులకు జాతీయస్ఫూర్తి గుర్తుకు రాకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. విక్రమ్‌సింఘే జమానాలో కుదిరిన ఈసీటీ ఒప్పందంపై మహింద రాజపక్స ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

పొరుగు స్నేహం..

ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత కొరవడటం వల్ల భారత్‌ కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేపాల్‌, బంగ్లాదేశ్‌ల వంటివి ఎప్పుడెలా స్పందిస్తాయో తెలియని వాతావరణం ఏర్పడింది. పాకిస్థాన్‌ గురించి ఇక చెప్పనే అవసరం లేదు. ‘ఇరుగు పొరుగుకు తొలి ప్రాథమ్యం’ అన్న విధానాన్ని కేవలం నినాదంగానే మిగల్చకుండా మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు కదపాలి.

అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వంటివి ఇండియాతో చురుగ్గా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకు వస్తుండవచ్చు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా విస్తరణ కాంక్షలను అడ్డుకోవడంలో అవి క్రియాశీలంగానే వ్యవహరిస్తుండవచ్ఛు అవి ఎలాఉన్నా- పొరుగున చిన్న చిన్న దేశాలతో సఖ్యత అన్నది భారత్‌కు రక్షణపరంగా సముద్ర జలాలపై పట్టు కోల్పోకుండా ఉంచే అంశం. దానివల్ల సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకూ భరోసా దక్కుతుంది.

పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికగా...

ఇప్పటికే తీవ్రమైన రుణసంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న శ్రీలంకపై చైనా ప్రభావాన్ని తగ్గించడం అంత సులభమేమీ కాదు. చైనాకు 500 కోట్ల డాలర్లు, భారత్‌కు సుమారు వంద కోట్ల డాలర్ల మేర శ్రీలంక రుణపడి ఉంది. శ్రీలంక స్థూల దేశీయోత్పత్తిలో దాని రుణం వాటా 42.6శాతంగా ఉంది. చెల్లించాల్సిన రుణంపై ‘మారటోరియం’ విధించాలని చైనా, భారత్‌లకు శ్రీలంక కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తోంది.

మొదటి పర్యటన భారత్​లోనే..

ఈ ఏడాది ఫిబ్రవరిలో మహింద రాజపక్స భారత్‌ను సందర్శించినప్పుడు ముఖ్యంగా రుణ 'మారటోరియం'పైనే ప్రధాని మోదీని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల్లో విజయానంతరం మహింద రాజపక్స విదేశీ పర్యటన భారత్ ‌నుంచే మొదలయ్యేలా మన దేశం సన్నాహాలు చేస్తోంది. కొవిడ్‌ పరిస్థితుల్లో ఆ పర్యటన కుదరని పక్షంలో ఇరుదేశాధినేతల 'వర్చువల్‌ సదస్సు'ను సాధ్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు కదుపుతోంది.

ప్రతీకాత్మక చర్యలకే పరిమితం కాకుండా ఇరుపక్షాల నడుమ బలమైన అనుబంధం నెలకొల్పేందుకు మరిన్ని గట్టి ప్రయత్నాలు జరగాలి. నేపాల్‌, బంగ్లాదేశ్‌లతో అనుబంధం అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో రక్షణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై శ్రీలంకతో పటిష్ఠమైన సహకారం నెలకొల్పుకోవడం భారత్‌కు అవసరం.

మరోవంక ఇప్పటికే చైనా విసిరిన రుణఉచ్చులో చిక్కి అల్లాడుతున్న శ్రీలంక- ఆ ఊబిలో మరింతగా కూరుకుపోవడం ఎంత ప్రమాదకరమో గుర్తించాల్సి ఉంది. వ్యక్తులపట్ల ఉన్న పరస్పర అపనమ్మకాలను పక్కనపెట్టి స్థూల వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారత్‌, శ్రీలంకలు ముందడుగు వేయాల్సిన తరుణమిది.

(రచయిత- స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.