ETV Bharat / international

ఏవీ గత క్రిస్మస్‌ కాంతులు..! రష్యా దండయాత్రతో వేడుకలకు దూరంగా ఉక్రెయిన్​

author img

By

Published : Dec 25, 2022, 9:05 AM IST

వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా.. యుద్ధ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా సైనికులు అరాచకాలు సృష్టిస్తున్నారు. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్న ఉక్రెయిన్.. ఇప్పుడు యుద్ధంతో విలవిలలాడుతుంది.

ukraine russia war
ఉక్రెయిన్‌

ఎటు చూసినా రంగురంగుల విద్యుత్‌ కాంతులు.. క్రిస్మస్‌ ట్రీల అలంకరణలు.. ఇంటింటా పండగ సంతోషం.. వీధుల్లో సంబరాలు.. ఇదంతా ఉక్రెయిన్‌ ప్రజల గత ఏడాది వైభవం! పది నెలలుగా రష్యా దాడులతో ఛిద్రమైన ఉక్రెయిన్‌లో ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన దుస్థితి. అంతటా విద్యుత్‌ కోతలు.. అంధకారం. పండగ చేసుకుందామనే ఆలోచన కూడా రాకుండా బితుకు బితుకు మంటూ జీవనం. ఏ క్షణాన ఎటువైపు నుంచి క్షిపణులు, బాంబులు, ఫిరంగి గుళ్లు దూసుకువచ్చి విధ్వంసం సృష్టిస్తాయో తెలియని పరిస్థితి.

కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయిన చాలా మంది ప్రజలు ఈ ఏడాది క్రిస్మస్‌ ఉత్సవాలను జరుపుకునేందుకు సుముఖంగా లేరు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ క్రిస్మస్‌ను జరుపుకుని శత్రువుకు సవాల్‌ విసరాలనే కొందరి పట్టుదలతో రాజధాని కీవ్‌ నగరంలో అక్కడక్కడా చిన్నపాటి సందడి కనిపిస్తోంది. రష్యా సైన్యం ధ్వంసం చేసిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను ఉక్రెయిన్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోవడం వల్ల జనరేటర్లపై నగర ప్రజలు ఆధారపడాల్సి వస్తోంది. పండగ సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కొందరు నామమాత్రపు అలంకరణలకు పరిమితమయ్యారు.

ప్రతిసారి ఎంతో సందడిగా కనిపించే రాజధాని కీవ్‌ నగరంలోని సోఫిలా స్క్వేర్‌ ఈ సారి దాదాపు మూగబోయింది. అక్కడ జనరేటర్‌ సాయంతో క్రిస్మస్‌ ట్రీని అలంకరించారు. ఉక్రెయిన్‌ను ధ్వంసం చేయలేరని చాటేందుకు ఈ ఏడాది క్రిస్మస్‌ ట్రీకి ‘అజేయ వృక్ష’మని పేరుపెట్టినట్లు కీవ్‌ నగర మేయర్‌ విటాలీ క్లిత్సెకొ ప్రకటించారు. ‘క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలను మా పిల్లల నుంచి రష్యా తస్కరించకుండా అడ్డుకోవాలని నిర్ణయించామ’ని తెలిపారు.

ఖేర్సన్‌లో మళ్లీ పేలుళ్లు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమై డిసెంబరు 24వ తేదీతో పది నెలలు పూర్తయ్యింది. దేశంలోని రెండో పెద్ద నగరమైన ఖేర్సన్‌పై శనివారం రష్యా సేనలు మళ్లీ ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో పది మంది మృతి చెందగా 55 మంది గాయపడ్డారు.

ఇవీ చదవండి:

పుతిన్ సేనల అరాచకాలు.. అనాథ పిల్లల కిడ్నాప్.. రష్యాకు తీసుకెళ్లి...

దక్షిణాఫ్రికాలో పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌.. తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.