ETV Bharat / international

ఉక్రెయిన్‌ తల్లుల హృదయ ఘోష.. బంకర్లలో దాచిన బిడ్డలను రష్యా అపహరణ!

author img

By

Published : Oct 14, 2022, 6:40 AM IST

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో పసి పిల్లలు సమిధలవుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్న వారు కొందరైతే.. క్షిపణులు, రాకెట్లు, శతఘ్నులు, బాంబుల దాడుల్లో అవయవాలను కోల్పోయిన వారెందరో! అన్ని వైపుల నుంచీ ప్రమాదం విరుచుకుపడుతుండడం వల్ల బిడ్డలను కాపాడుకునేందుకు బంకర్లలో దాచిపెడుతున్న తల్లుల కష్టాలు ఇంకోలా ఉంటున్నాయి.

ukraine russia
ukraine russia

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో ముక్కుపచ్చలారని పసి పిల్లలు సమిధలవుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్న వారు కొందరైతే.. క్షిపణులు, రాకెట్లు, శతఘ్నులు, బాంబుల దాడుల్లో అవయవాలను కోల్పోయి.. జీవన్మృతులుగా మారుతున్న వారెందరో! అన్ని వైపుల నుంచీ ప్రమాదం విరుచుకుపడుతుండడంతో బిడ్డలను కాపాడుకునేందుకు బంకర్లలో దాచిపెడుతున్న తల్లుల కష్టాలు మరోలా ఉంటున్నాయి. శత్రు సైనికులు చుట్టుముట్టి పసివాళ్లను అపహరిస్తుండడంతో వారి జాడ ఎంతకీ తెలియటం లేదని ఎందరో మాతృమూర్తులు విలపిస్తున్నారు. తమ చిన్నారుల ఆచూకీ తెలపాలని అంతర్జాతీయ సహాయక సంస్థలను ఆశ్రయిస్తున్నారు. తమ పరిశోధనలో దీనికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ తాజాగా వెల్లడించింది. యుద్ధంలో ధ్వంసమైన మేరియుపోల్‌ వంటి నగరాలకు చెందిన వేల మంది చిన్నారులు రష్యా మద్దతున్న వేర్పాటువాదుల ప్రాబల్య డాన్‌బాస్‌ ప్రాంతంలోని శిబిరాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ బాధితుల్లో కొందరు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన వారున్నారని తెలిపింది.

.

రష్యా వీరిని చిల్డ్రెన్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా పేర్కొంటోంది. అమ్మానాన్నలు కానీ సంరక్షకులు కానీ ఎవరూ వీరికి లేరని చెబుతోంది. అయితే, రష్యా అధికారులు వీరందరినీ బలవంతంగా, మాయమాటలు చెప్పి తమ దేశానికి లేదా తమ దేశ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు పంపిస్తున్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ పేర్కొంది. అక్కడ పిల్లలను పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్న రష్యా కుటుంబాలకు దత్తత ఇస్తోంది. తద్వారా అనాథలైన వారికి కుటుంబ జీవనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. ఆ తర్వాత వారిని రష్యా పౌరులుగా ప్రకటిస్తోంది. పాస్‌పోర్టులనూ జారీ చేస్తోంది. అవయవాలు కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకున్న వారికి కొంత నగదును అందజేస్తోంది.
విదేశాలకు చెందిన చిన్నారులను దత్తత తీసుకోవడాన్ని రష్యా చట్టం నిషేధిస్తుంది. అయితే, మే నెలలో పుతిన్‌ ప్రత్యేక ఆదేశాల ద్వారా దత్తత నిబంధనలను సరళీకరించారు. ఉక్రెయిన్‌ నుంచి తీసుకొచ్చిన చిన్నారులను రష్యా కుటుంబాలతో అనుసంధానించడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదంతా తమ ఉదార స్వభావంగా రష్యా ప్రచారం చేసుకుంటోంది. దాదాపు 8వేల మంది వరకూ ఉక్రెయిన్‌ చిన్నారులను రష్యాకు తీసుకువచ్చి ఉంటారని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.