ETV Bharat / international

చైనాలో లాక్​డౌన్ భయాలు.. జిన్​పింగ్​కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు

author img

By

Published : Oct 13, 2022, 10:59 PM IST

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా రాజధాని బీజింగ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి చెప్పాలంటూ చైనీయులు నిరసనలు తెలుపుతున్నారు. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలను ప్రదర్శించారు. మరోవైపు నిరసన కారుల్ని అడ్డుకునేందుకు డ్రాగన్‌ ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది.

china lockdown
చైనా కొవిడ్ న్యూస్

చైనా నగరం షాంఘైను లాక్‌డౌన్‌ భయాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే అక్కడ 47 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జీరో కొవిడ్‌ విధానంతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న చైనా వాసులు మూడు నెలల గరిష్ఠస్థాయి కేసులను చూసేసరికి ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలల క్రితమే లాక్‌డౌన్‌తో షాంఘై ఉక్కిరిబిక్కిరి అయింది.

రెస్టారెంట్లు, బార్లు, పార్కులు, దుకాణాలు అన్నీ మూతపడగా కొద్ది రోజులుగా పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా షాంఘైలో 47 కేసులు, బీజింగ్‌లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. జులై 12 తర్వాత ఇదే అత్యధికం. ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు మొదలవుతున్న వేళ లాక్‌డౌన్‌ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు.. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి.

ఆందోళనలపై ఉక్కుపాదం...
కరోనా కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్‌ విధానం అత్యంత కఠినంగా వ్యవహరించే చైనా ప్రభుత్వంపై ఆందోళనలు వేళ్లూనుకుంటున్నాయి. కమ్యూనిస్టు పార్టీ 20వ సర్వసభ్య సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజధాని బీజింగ్‌లోని రద్దీ కూడలిలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఉద్యమకారులు ఆవిష్కరించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం వాటిని తొలగించింది. భారీ బలగాలతో కూడిన బందోబస్తును అక్కడ ఏర్పాటు చేసింది.

2019లో వుహాన్‌లో కొవిడ్‌ వెలుగు చూసినప్పటి నుంచి చైనా పాలకులు వైరస్‌ను కట్టడి చేసేందుకు అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచమంతా ఆంక్షలు తొలగించి సాధారణ జీవనానికి అనుమతిచ్చినా చైనా మాత్రం జీరో కొవిడ్‌ విధానానికి పెద్దపీట వేస్తోంది. ఒకటి.. రెండు కేసులు వెలుగు చూసిన కఠిన ఆంక్షలు విధిస్తోంది. వైరస్‌ కట్టడికి నిర్ధిష్టమైన సమయం కేటాయించకుండా ఆంక్షలు విధించే ఈ ప్రక్రియ పట్ల చైనీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలని, ఆంక్షలతో తమ ఆదాయ మార్గాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్‌ కట్టడికి అవలంభిస్తున్న విధానాలను అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సహా పాలకులు సమర్థించుకుంటున్నారు. కొవిడ్‌ మునుపటిలా విజృంభిస్తే దేశం ఆర్థికంగా దిగజారుతుందని, సామాజిక భద్రత ప్రశ్నార్థకం అవుతుందని వారు వివరిస్తున్నారు. షాంఘై, బీజింగ్‌లలో ఒక్కరోజే 57 కేసులు నమోదు కావడం చైనీయులను మరింత భయపెడుతున్నాయి. జీరో కొవిడ్‌ ఆంక్షలతో నిరుద్యోగం 19శాతానికి ఎగబాకింది.

ఇవీ చదవండి: అణు ప్రయోగాలకు సిద్ధమైన నాటో.. రష్యాకు వెయ్యి కి.మీ దూరంలోనే!

వరద నుంచి బయటపడినా వీడని మృత్యువు.. బస్సులో 18 మంది సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.