ETV Bharat / international

సొంత పౌరులపై దాడి.. యుద్ధ విమానాలతో బాంబులు.. 100 మంది మృతి!

author img

By

Published : Apr 11, 2023, 11:01 PM IST

పౌరులపై యుద్ధ విమానాలతో దాడి చేసింది మయన్మార్ మిలిటరీ సర్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశమైన వారిపై బాంబులు వేసింది. ఈ ఘటనలో వంద మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

MYANMAR AIRSTRIKES
MYANMAR AIRSTRIKES

మయన్మార్ సైన్యం సొంత ప్రజలపై దాడులు జరిపింది. మయన్మార్ వాయుసేన చేసిన ఈ దాడుల్లో వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నట్లు స్వతంత్ర మీడియా వెల్లడించింది. దేశంలోని సైనిక పాలనను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంపై సైన్యం ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. కాన్​బలు పట్టణానికి సమీపంలో ఉన్న పాజిగ్యీ గ్రామ శివారులో ఈ సమావేశం జరిగిందని ప్రజాస్వామ్య అనుకూల వర్గానికి చెందిన ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఉదయం 8 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. సైనిక పాలనను వ్యతిరేకించే బృందాలు కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవానికి వీరంతా వచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఓ యుద్ధ విమానం.. జనంపై బాంబులు జారవిడిచిందని తెలిపారు. అరగంట తర్వాత ఓ హెలికాప్టర్ వచ్చి ఇదే ప్రాంతంలో కాల్పులు జరిపిందని వివరించారు. తొలుత 50 మంది మరణించినట్లు వార్తలు రాగా.. మృతుల సంఖ్య కొద్దిసేపట్లోనే 100కు చేరుకుందని స్వతంత్ర మీడియా వెల్లడించింది. అయితే, వీరి వీవరాలు పూర్తిగా బయటకు రాలేదు.

"సమావేశానికి వచ్చిన జనానికి కొద్దిదూరంలో నేను నిల్చున్నా. నా స్నేహితుడు ఒకరు ఫోన్ చేసి ఫైటర్ జెట్ వస్తోందని చెప్పాడు. వేగంగా వచ్చిన జెట్ విమానం.. జనంపై బాంబులు జారవిడిచింది. వెంటనే నేను పక్కన ఉన్న ఓ లోయలోకి దూకేశా. కొద్ది క్షణాల తర్వాత లేచి చూస్తే.. చాలా మంది మృతదేహాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోవడం కనిపించింది. ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్మేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయం పూర్తిగా నాశనమైంది. గాయపడ్డ 30 మందిని ఆస్పత్రికి తరలించాం. కొద్దిసేపటి తర్వాత వచ్చిన హెలికాప్టర్ చాలా మందిపై కాల్పులు జరిపింది. మృతదేహాలకు వెంటనే అంత్యక్రియలు చేస్తున్నాం."
-ప్రత్యక్ష సాక్షి

చిన్నారులు సైతం..
ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. మరణించినవారిలో మహిళలతో పాటు 20 నుంచి 30 మంది చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమి నాయకుడు సైతం ఈ ఘటనలో చనిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనను నేషనల్ యూనిటీ గవర్నమెంట్(ఎన్​యూజీ) తీవ్రంగా ఖండించింది. దేశంలో అసలైన ప్రభుత్వం తమదేనని వాదిస్తున్న ఎన్​యూజీ.. ఈ ఘటనను అమాయక ప్రజలకు వ్యతిరేకంగా తీవ్రవాద మిలిటరీ చేసిన దాడి అని అభివర్ణించింది. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఆ కార్యక్రమంపై దాడి జరిగిందని మయన్మార్ ప్రభుత్వ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ పేర్కొన్నారు. నేషనల్ యూనిటీ గవర్నమెంట్​కు చెందిన సాయుధ దళం.. స్థానిక ప్రజలను భయపెట్టి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. బౌద్ధ గురువులతో పాటు టీచర్లు, సాధారణ పౌరులను చంపేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే శాంతి స్థాపన కోసం మిలిటరీ ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.