ETV Bharat / state

రాష్ట్రంలో ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక - జూన్ 5న ఓట్ల లెక్కింపు - TS GRADUATE MLC BY ELECTION POLLING

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 9:14 AM IST

Updated : May 28, 2024, 10:18 PM IST

Graduate MLC By Election Polling in Telangana 2024 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సి ఉన్నందున బ్యాలెట్‌ పద్ధతిలో ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ గడువు ముగియగా, అప్పటి వరకు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. మొత్తంగా 72.44 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి గొడవలకు అవకాశం లేకుండా పోలింగ్‌ ప్రక్రియ పూర్తైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు.

Telangana Graduate MLC By Election
Graduate MLC By Election Polling 2024 (ETV Bharat)

వరంగల్-నల్గొండ- ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ (ETV Bharat)

Telangana Graduate MLC By Election Polling : వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి నియోజకవర్గ పట్టభద్రుల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్‌ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.

వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో, 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక జరిగింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతితక్కువగా సిద్దిపేటలో 5 కేంద్రాల్లో పోలింగ్‌ సాగింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసిన అనంతరం 72.44 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. నియోజకవర్గవ్యాప్తంగా 4,63,839 ఓట్లకు గాను 3,36,013 ఓట్లు పోలయ్యాయని ఆర్వో హరిచందన తెలిపారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్‌ నమోదవ్వగా, ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది.

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు : ప్రాధాన్యతా ఓటు పద్ధతి అయినందున బ్యాలెట్‌ విధానంలో ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించారు. గతంలో చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ముందుగానే వివరించి, అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండలో‍ ఓటేయగా, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.‍

వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండలో కలెక్టర్‌ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, వరంగల్‌ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్‌ ఓటేశారు.

Clashes in Telangana Polling Stations : ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలోని 28వ పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ముద్రణ సరిగ్గా లేదంటూ 45 మంది ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, అధికారులు సమస్య పరిష్కరించారు. వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించటంపై బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ తరహా మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి, కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగకుండా భారీ బందోబస్తు, నిఘానేత్రాల పర్యవేక్షణతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. బ్యాలెట్‌ బాక్స్‌లను భారీభద్రత మధ్య స్ట్రాంగ్‌రూంలకు అధికారులకు తరలించారు. జూన్ 5న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

MLC Candidate Ashok Allegations on Congress Party : మరోవైపు ఎన్నికల్లో డబ్బుల పంపిణీ గురించి ప్రశ్నించిన తనపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడిచేశారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ ఆరోపించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో హస్తం పార్టీ శ్రేణులు చేస్తున్న నగదు పంపిణీని తాను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా, వారు దానిని ధ్వంసం చేసి తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. ఈ మేరకు ఆయన నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం నిరసన వ్యక్తం చేశారు పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని అశోక్ ఆరోపణలు చేశారు.

"నార్కట్‌పల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లాను. అక్కడ ఓ ఫంక్షన్‌ హాల్లో కాంగ్రెస్ నేతలు నగదు పంచుతున్నారనే సమాచారం మాకు అందింది. అడ్డుకునేందుకు వెళ్లిన నన్ను కొట్టారు. నేను వీడియో తీస్తుండగా నా ఫోన్‌ను పగులగొట్టారు. గెలవడానికి కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు." - అశోక్, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి

రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ - ఓటింగ్​ శాతం ఎంతంటే? - TS LOk sabha Polls 2024 Ended

నీ ఓటు నాయకులనే కాదు - దేశ భవిష్యత్తునూ మారుస్తుంది - ఒక్క ఓటే కదా అనే నిర్లక్ష్యం వద్దు! - Importance of vote in ELECTIONS

Last Updated : May 28, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.