ETV Bharat / politics

రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ - ఓటింగ్​ శాతం ఎంతంటే? - TS LOk sabha Polls 2024 Ended

author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 6:06 PM IST

Updated : May 13, 2024, 7:35 PM IST

Telangana Lok Sabha Elections Polling 2024 Ended : రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా లోక్​సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, వాటిని సరిచేసినట్లు ఎన్నికల సంఘం వివరించింది.

Telangana Lok Sabha Elections Polling 2024 Ended
Telangana Lok Sabha Elections Polling 2024 Ended (ETV Bharat)

Telangana Lok Sabha Elections Polling 2024 Ended : రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు ఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్‌ కొనసాగగా, ఆ తర్వాత కాస్త పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్​ నమోదైంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొలువాయిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలో 100 శాతం ఓటు వేసి అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 110 ఓట్లు ఉండగా, ఎవరూ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ నమోదుపై జగిత్యాల కలెక్టర్ షేక్‌ యాస్మిన్ బాషా చిన్న కొలువాయి ఓటర్లను అభినందించారు.

First Time Voters Cast Their Vote : తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లకు ఎన్నికల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్‌ మడల్ పోలింగ్‌ కేంద్రంలో స్వీప్ కమిటి ఆధ్వర్యంలో తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువతకు పుష్పగుచ్చాలందించి డప్పులతో స్వాగతం పలికారు. మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్లలో పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. పూలతోరణాలు, బెలూన్లు కట్టి అలంకరించారు. ఆదర్శపొలింగ్‌ కేంద్రంకావడంతో సరికొత్తగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు. నల్గొండలో పర్యావరణహితంగా కొబ్బరి, అరటి ఆకులు, చిలుకలు, మామిడి తోరణాలతో పర్యావరణ హితంగా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.

ఆ ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్ : మావోయిస్టుల ప్రాబల్యమున్న 5 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది స్వతంత్రులు. అధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్‌ నుంచి 45 మంది పోటీలో ఉండగా తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలోనిలిచారు. పోలింగ్‌ ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు. అనంతరం ఓటింగ్‌ ప్రశాంతంగా సాగింది.

ఓటెత్తిన అధికారులు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే? - OFFICERS CASTED VOTE IN TELANGANA

ఇంటివద్దే ఓటు వేసిన 21,690 మంది ఓటర్లు : కొమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో ఈసారి అదనంగా 453 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అతికొద్ది మంది ఓటర్లు ఉన్నా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష5 వేల 19 ఈవీఎం యూనిట్లను ఎన్నికల సంఘం వినియోగించింది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 21,690 మంది ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర యూనిఫాం సిబ్బంది సుమారు 65వేల మందితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 వేలమందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. కేంద్రం నుంచి వచ్చిన 165 కంపెనీల సాయుధ బలగాలని మోహరించారు.

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - TOLLYWOOD CELEBRATIES VOTES IN TSకొడంగల్​లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote

Last Updated : May 13, 2024, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.