ETV Bharat / international

అవినీతి కేసులో నోబెల్‌ విజేతకు ఆరేళ్ల జైలు శిక్ష

author img

By

Published : Aug 15, 2022, 9:02 PM IST

మయన్మార్ కీలక నేత, నోబెల్​ విజేత ఆంగ్​సాన్​ సూకీకి ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ కోర్టు ఆమెకు శిక్షను ఖరారు చేసినట్లు అనధికార వర్గాలు తెలిపాయి.

Suu Kyi
ఆంగ్​సాన్​సూకీ

Aung San Suu Kyi news: మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ బహుమతి విజేత ఆంగ్​సాన్​ సూకీ(77)కి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించేందుకు ఆమె స్థాపించిన 'డా ఖిన్ క్యీ' ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేశారంటూ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని రాయితీ ధరకు లీజుకు తీసుకున్నట్లు తేల్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరవాత సూకీని గతేడాది ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతో పాటు పలువురు నేతలను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సూకీని నిర్బంధంలోనే ఉంచి ఆమెపై పలు కేసులు మోపుతున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు జైలు శిక్షలు కూడా విధించారు.

1989-2010 మధ్యలో ఆంగ్‌సాన్‌ సూకీని దాదాపు పదిహేనేళ్లపాటు సైన్యం గృహ నిర్బంధంలోనే ఉంచింది. ఇప్పుడు మరిన్నిఅభియోగాల్లో దోషిగా తేల్చింది. వాకీటాకీలను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని.. 6 లక్షల డాలర్ల నగదును, బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్నారని ఇప్పటికే వరుసగా 4, 5సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించింది. మిగిలిన వాటిలోనూ దోషిగా తేలితే.. వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే 77 ఏళ్ల సూకీ.. మిగిలిన జీవితమంతా బందీగానే గడపాల్సి వస్తుంది.

ఇవీ చదవండి: స్వతంత్ర భారత్​ విజయాలు భళా అంటూ బైడెన్, పుతిన్​ సందేశాలు

ఉక్రెయిన్‌లో సమాధులను తవ్వుతున్న ప్రజలు, అసలేమైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.