ETV Bharat / international

'కాప్26'​ సదస్సుతో భూతాపానికి పరిష్కారం దొరికేనా?

author img

By

Published : Oct 31, 2021, 7:23 PM IST

Cop26 Glasgow

మితిమీరిన శిలాజ ఇంధనాల వాడకం కారణంగా భూమి వేడెక్కుతోంది. ఫలితంగా కరవులు, కార్చిచ్చులు, అధిక వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, హిమానీ నదాలు కరగడం.. వంటి ఉత్పాతాలు ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సవాళ్లకు పరిష్కారం కనుగొనే దిశగా గ్లాస్గో వేదికగా 'కాప్​26' సదస్సు(Cop26 Glasgow) ప్రారంభమైంది. మరి ఈ భేటీలో ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నాయి?

పెరుగుతున్న భుతాపాన్ని(Global Warming) కట్టడి చేయాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్​లోని గ్లాస్గో వేదికగా.. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 'కాప్​26' సదస్సు ప్రారంభమైంది. ఈ భేటీలో 200 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. మరి అసలు ఈ 'కాప్'​ సదస్సు(Cop26 Glasgow) అంటే ఏమిటి? ఈ భేటీ ద్వారా వాతావరణ మార్పుల(Climate Change) కట్టడికి ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టనున్నాయి? అనే అంశాలను ఇప్పుడు చూద్దాం...

కాప్ అంటే..?

వాతావరణ మార్పుల నిరోధానికి 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ప్రాతిపదిక ఒప్పందం కుదిరింది. దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని 'కాన్ఫరెన్స్ ఆఫ్​ పార్టీస్​(కాప్​)'గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశం 1995లో తొలిసారి జరిగింది. ఆరేళ్ల క్రితం 2015 పారిస్​లో జరిగిన సమావేశంలో ఓ కీలక ఒప్పందానికి ఆయా దేశాలు అంగీకరించాయి. పారిశ్రామిక పూర్వకాలంతో పోలిస్తే.. ఈ శతాబ్దం చివరినాటికి భూ ఉష్ణోగ్రతను(Global Warming) 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా చూడాలని తీర్మానించాయి.

Cop26 Glasgow
గ్లాస్గోలో కాప్​26 శిఖరాగ్ర సదస్సు

చివరి ఉత్తమ ఆశ..

ఈ భేటీ జరగడం ఇది 26వ సారి. ఆదివారం నుంచి నవంబరు​ 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో(Cop26 Glasgow) పాల్గొనేందుకు ఇప్పటికే... 25,000 మందికి పైగా ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ భేటీకి బ్రిటిష్ ప్రభుత్వ అధికారి అలోక్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. భూ ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇది 'చిట్టచివరి ఉత్తమమైన ఆశ' అని ఈ సమావేశాల్ని ప్రారంభిస్తూ.. ఆయన ఆదివారం పేర్కొన్నారు.

ఇదే కీలక ఘట్టం..!

సోమవారం, మంగళవారం కాప్​26 ప్రపంచ నేతల సదస్సు జరగనుంది. ఇందులో 100 మందికి పైగా ప్రపంచ దేశాల నేతలు పాల్గొననున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​, జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ తదితరులు ఈ భేటీలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్, రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్​ పుతిన్​, బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బోల్సొనారో... వర్చువల్​గా హాజరుకానున్నారు.

Cop26 Glasgow
భూగోళాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్న చిన్నారులు
Cop26 Glasgow
శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని నిరసనలు

ఎన్​డీసీలు..

భూ ఉష్ణోగ్రతను పరిమితం చేసేందుకు పారిస్ ఒప్పందం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా... ఆయా దేశాలు తాము తీసుకుంటున్న చర్యలను(ఎన్​డీసీలు) తరచూ సమీక్షించాల్సి ఉంది. అవసరమైతే... పారిస్​ ఒప్పందానికి అనుగుణంగా తమ లక్ష్యాలను సవరించాల్సి కూడా ఉంటుంది. పారిస్​ ఒప్పందం జరిగిన ఐదేళ్ల తర్వాత తమ ఎన్​డీసీలను సమర్పించాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావంతో ఇది ఒక ఏడాది ఆలస్యంగా ఇప్పుడు జరగనుంది.

పారిస్​ నియమావళి..

పారిస్​ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు.. కొన్నేళ్ల తర్వాత ఒక నిర్దిష్ట నియమావళి(Paris Rules book) ఏర్పాటు కావాలని ఆశించాయి. కానీ, ఈ ఒప్పందంలోని కొన్ని అంశాలు ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. ఆయా దేశాలు తమ గ్రీన్​హౌస్ వాయు ఉద్గారాలను పారదర్శకంగా ఎలా సేకరిస్తాయి? ఎలా నివేదిస్తాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్బన ఉద్గారాల విపణిని ఎలా నియంత్రించాలి? అనే దానిపై స్పష్టత లేదు.

Cop26 Glasgow
గ్లాస్గోలో కాప్​26 శిఖరాగ్ర సదస్సు

పేద దేశాల పరిస్థితి ఏంటి?

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధనాలను వినియోగించడంలో పేద దేశాలు ఆర్థిక భారాన్ని ఎలా భరించగలవు అనేది కాప్​26 సదస్సులో అతి ముఖ్యమైన అంశం. గ్రీన్​హౌస్ ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న సంపన్న దేశాలు... పేద దేశాలకు పరిహారం చెల్లించాలనే ఒప్పందం ఉంది. అయితే.. ఎంతమేరకు చెల్లించాలనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఈ సదస్సులో ప్రపంచ దేశాలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Cop26 Glasgow
గ్లాస్గోలో కాప్​26 శిఖరాగ్ర సదస్సు

వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు..

వివిధ దేశాల్లో శిలాజ ఇంధన పరిశ్రమల్లో లక్షలాది మందికి ఉపాధి దొరకుతోంది. ఇప్పుడు వారికి ప్రత్యామ్నాయ రంగాల్లో ఉపాధి కల్పించడం ఎలా అనే అంశంపై కాప్​ సదస్సులో ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు అమెరికా వంటి సంపన్న దేశాల్లోనూ ఈ తరహా సమస్య నెలకొని ఉంది. ఆయా దేశాల్లో బొగ్గు గనులు, చమురు క్షేత్రాల్లో చాలా మంది ఉపాధి పొందుతుండటమే ఇందుకు కారణం.

సహజవనరులతో సాధ్యమేనా..?

వాతావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్​ను తొలగించడంలో చెట్లు, చిత్తడి నేలలు, సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో వివిధ దేశాలు సహజ వనరుల సాయంతో పర్యవరణ సమతుల్యాన్ని సాధించగలవని నమ్ముతున్నాయి. అయితే.. శాస్తవేత్తలు, పర్యావరణ వేత్తలు ఈ ఆలోచనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాప్ సదస్సులో చర్చ జరగనుంది.

సమావేశంలో థన్​బర్గ్​...

తాను 'కాప్'​ సమావేశంలో కీలకంగా వ్యవహరించాలని అనుకోవటం లేదని స్వీడన్​కు చెందిన పర్యావరణ వేత్త గ్రెటా థన్​బర్గ్ పేర్కొన్నారు. 'ఫ్రైడేస్ ఫర్ యాత్​' ర్యాలీలతో ప్రసిద్ధి చెందిన ఆమె.... గ్లాస్గోకు శనివారం చేరుకున్నారు. ఆ సమయంలో చాలా మంది అభిమానులు, పాత్రికేయులు ఆమె చుట్టూ గుమిగుడారు.

గ్లాస్గోకు మోదీ...

కాప్​26 వాతావారణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.... ఆదివారం గ్లాస్గోకు చేరుకోనున్నారు. అక్కడ ఆయన బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్​ఏ)లో తమ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే దిశగా గ్లాస్గో సదస్సు సందర్భంగా భారత్​, బ్రిటన్​ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ... కొత్త గ్రీన్ గ్రిడ్స్​ను ప్రారంభించనున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.