ETV Bharat / international

Cop26 Glasgow: వాతావరణ మార్పులపై 'కాప్'​ అస్త్రం ఫలిస్తుందా?

author img

By

Published : Oct 31, 2021, 8:29 AM IST

అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకూ 'కాప్‌26' (Cop26 Glasgow) పేరుతో గ్లాస్గోలో సదస్సు నిర్వహిస్తున్నాయి ప్రపంచదేశాలు. గ్లోబల్​ వార్మింగ్​పై చర్చించేందుకు వివిధ దేశాల నేతలు సిద్ధమయ్యారు. ఈ చర్చలు సఫలం అయితే భూతాపాన్ని అదుపులోకి తెచ్చే కార్యాచరణకు ప్రపంచ నేతలు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.

COP26, Glasgow
పుడమిని కాప్‌కాస్తారా?

వేడెక్కుతున్న పుడమిపై వాడివేడి చర్చలకు రంగం సిద్ధమైంది. భూమిపై జీవజాలం ఉనికికి ప్రమాదకారిగా మారిన వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు మరోసారి దృష్టి సారించాయి. ముంచుకొస్తున్న మహోత్పాతం నుంచి బయటపడే వ్యూహాలపై చర్చకు సమాయత్తమయ్యాయి. బ్రిటన్‌లోని గ్లాస్గోలో అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకూ 'కాప్‌26' (Cop26 Glasgow) సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు ఫలించి భూతాపాన్ని అదుపులోకి తెచ్చే కార్యాచరణకు ప్రపంచ నేతలు శ్రీకారం చుడతారని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాతావరణ లక్ష్యాల సాధన విషయంలో సమయం మించిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

COP26, Glasgow
కరుగుతున్న హిమానీ నదాలు

వీటిపైనా దృష్టి..

  • విద్యుత్‌ వాహనాలు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాల దిశగా వేగంగా అడుగులు.
  • బొగ్గు ఆధారిత విద్యుత్‌ కర్మాగారాలకు త్వరగా ముగింపు పలకడం.
  • చెట్ల నరికివేతను తగ్గించడం.
  • వాతావరణ మార్పుల ప్రభావం నుంచి ఎక్కువ మందిని రక్షించడం. తీర ప్రాంతంలో రక్షణ మౌలిక వసతులను మెరుగుపరచడానికి నిధులు అందించడం.
  • సదస్సు ముగింపు సమయంలో ఒక తీర్మానం వెలువడే అవకాశం ఉంది. అందులో.. హానికర ఉద్గారాల తగ్గింపు, భూతాపం కట్టడి వంటి అంశాలపై హామీలు ఉండొచ్చు.
    COP26, Glasgow
    కాప్​-26

ఏమిటీ కాప్‌26?

కాప్‌ అంటే 'కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌'. దీన్ని ఐక్య రాజ్యసమితి(ఐరాస) ఏర్పాటు చేసింది. 1995 నుంచి ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇందులో దాదాపుగా 200 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ వేదికలపై ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు, ప్రతినిధులు.. వాతావరణ మార్పులకు కళ్లెం వేయడం, హానికర ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ భేటీ జరగడం ఇది 26వసారి.

ఎందుకు?

పెట్రోలు, డీజిల్‌, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది. వాతావరణ మార్పులతో ముడిపడిన తీవ్ర వడగాల్పులు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తుల తీవ్రత పెరుగుతోంది. గడిచిన దశాబ్దం.. అత్యంత 'ఉష్ణమయం'గా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరమన్న అభిప్రాయానికి ప్రపంచ నేతలు వచ్చారు.

వేడి వేడి చర్చ వీటిపైనే..

ఆర్థిక సాయం, పర్యావరణ న్యాయం వంటి అంశాలపై కాప్‌26 సదస్సులో ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. వర్ధమాన దేశాల్లో తలసరి కాలుష్యం తక్కువ. గతంలో వెలువడిన కర్బన ఉద్గారాలకు చాలా వరకూ ఈ దేశాలు కారణం కాదు. అయినా ఆ దుష్ప్రభావాలను అవి ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వీయ ఉద్గారాలను తగ్గించుకోవడానికి, విపత్తులను తట్టుకునే మౌలిక వసతులను నిర్మించుకోవడానికి ఈ దేశాలకు డబ్బు అవసరం. ఈ నేపథ్యంలో 2020 నాటికి పేద దేశాలకు ఏటా 100 బిలియన్‌ డాలర్ల మేర పరిహారం ఇస్తామని 2009లో ధనిక దేశాలు హామీ ఇచ్చాయి. 2023 నాటికి గానీ ఆ లక్ష్యాన్ని అందుకునే అవకాశం కనిపించడంలేదు. దీనిపై ధనిక, వర్ధమాన దేశాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది.

భారత్‌ డిమాండ్లు

  • వర్ధమాన దేశాలకు ఏటా 100 కోట్ల డాలర్ల పరిహారం అందజేత సహా మునుపటి సదస్సుల్లో పొందిన హామీలపై భరోసా కల్పిస్తే ఏ ప్రతిపాదనైనా మాకు అంగీకారయోగ్యమే.
  • కార్బన్‌-క్రెడిట్‌ మార్కెట్లను పునరుజ్జీవింపచేయాలి.
  • మా పరిశ్రమలను సులువుగా ఉపయోగించుకోగలిగేలా శుద్ధ పరిజ్ఞానాలను అందుబాటులో ఉంచాలి.
  • 2025 తర్వాత చేయాల్సిన దీర్ఘకాల వాతావరణ ఆర్థిక సాయంపై దృష్టి పెట్టాలి.
  • అంతర్జాతీయ సౌర సంకీర్ణం వంటి వాతావరణ సంబంధ కూటములను బలోపేతం చేయాలి.

ఇవీ విధ్వంసపు ఆనవాళ్లు..

  • భూ వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు (సీఓ2) పాళ్లు ప్రమాదకరంగా పెరుగుతున్నందున ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు భూగోళం వేడెక్కిపోతోంది. ఆర్కిటిక్‌, అంటార్కిటికాల్లో, హిమాలయాల్లో, హిమానీనదాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. సముద్రాల్లో నీటి మట్టాలు పెరుగుతూ తీరప్రాంతాలను కోతకు గురిచేస్తున్నాయి.
  • అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలలో వానలు ముఖం చాటేయడంతో అడవుల్లో కార్చిచ్చు పుట్టుకొచ్చి వృక్ష, జంతు జాతుల్ని దహించివేశాయి. బెల్జియం, జర్మనీ, చైనాలను భారీ వరదలు ముంచెత్తాయి.
  • భారత్‌ (Cop26 India ) పైనా తీవ్ర ప్రభావం పడింది. సమీపంలోని థార్‌ నుంచే కాక దూరాన ఉన్న సౌదీ అరేబియా నుంచి కూడా ఎడారి దుమ్ముధూళి హిమాలయాలపైకి వచ్చిపడి వేగంగా మంచుకరిగిపోతోందని తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. దిల్లీ తదితర నగరాల నుంచి కూడా దుమ్ముకణాలు ఎగిరివస్తున్నాయి. ఆసియా ఖండ వాతావరణ సమతుల్యతకు హిమాలయాలే ఆయువుపట్టు. సరిగ్గా దాని మీదే భూతాపం దెబ్బకొడుతోంది.
  • ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది హిమానీ నదాలు కరిగి మెరుపు వరదలు వచ్చి రెండు ఆనకట్టలు కొట్టుకుపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లలో ఉన్నట్టుండి ఆకాశానికి చిల్లు పడినట్లు ఆకస్మిక కుంభవృష్టి, వరదలు సంభవించాయి.
  • ఎండాకాలంలో భానుడి భగభగలు ఏటేటా అధికమవుతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టుకొచ్చే తుపానులు, వాయుగుండాల సంఖ్య, అవి కలిగించే నష్టం నానాటికీ పెరిగిపోతుంది.
    COP26, Glasgow
    కాప్​ సదస్సు లెక్కలు

ఇదీ చూడండి: Climate Change: చిత్తశుద్ధితోనే.. భూతాప నియంత్రణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.