ETV Bharat / opinion

Climate Change: చిత్తశుద్ధితోనే.. భూతాప నియంత్రణ

author img

By

Published : Oct 31, 2021, 5:01 AM IST

Updated : Oct 31, 2021, 5:46 AM IST

వాతావరణ మార్పుల (environment pollution) నిరోధానికి ఏటా 10వేల కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఆర్థిక సహాయం అందించాలని ప్యారిస్‌ ఒప్పందం నిర్దేశించింది. వర్ధమాన దేశాలు హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టడానికి, వాతావరణ మార్పుల బారి నుంచి ప్రజల ప్రాణాలను, జీవనోపాధులను కాపాడటానికి ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో నేటి (అక్టోబర్​ 31) నుంచి నవంబరు 12 వరకు జరిగే కాప్‌-26 సదస్సులో (COP-26 Conference news) వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలు, పర్యావరణ  ఉద్యమకారులంతా పాల్గొంటారు.

COP-26 Conference programme
కాప్​ 26 సదస్సు

వాతావరణ మార్పుల (climate change latest news) నిరోధానికి 1992లో ఐరాస ఆధ్వర్యంలో ఒక ప్రాతిపదిక ఒప్పందం కుదిరింది. దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)గా వ్యవహరిస్తున్నారు. ఐరాస ఒప్పందం, దానికి అనుగుణంగా 2015లో కుదిరిన ప్యారిస్‌ ఒప్పందం అమలుకు ప్రధాన నిర్ణయాలు చేసే అధికారం కాప్‌నకే ఉంది. కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించి, ఉత్తరోత్తరా నికరంగా శూన్య ఉద్గారాల (నెట్‌ జీరో) స్థాయికి చేరుకోవడం ద్వారా భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలు దాటకుండా చూడాలని ప్యారిస్‌ ఒప్పందం తీర్మానించింది. ఇక్కడ నెట్‌ జీరో అంటే అన్ని దేశాలూ కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలని కాదు. కొన్ని దేశాలు భారీగా ఉద్గారాలను తగ్గించుకోవడం ద్వారా 1.5 డిగ్రీల లక్ష్యాన్ని ఆచరణ సాధ్యం చేయాలని అర్థం. వాతావరణ మార్పుల నిరోధానికి ఏటా 10వేల కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఆర్థిక సహాయం అందించాలని ప్యారిస్‌ ఒప్పందం నిర్దేశించింది. వర్ధమాన దేశాలు హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టడానికి, వాతావరణ మార్పుల బారి నుంచి ప్రజల ప్రాణాలను, జీవనోపాధులను కాపాడటానికి ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో నేటి నుంచి నవంబరు 12 వరకు జరిగే కాప్‌-26 సదస్సులో (COP-26 Conference programme) వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులంతా కలిపి దాదాపు 20,000 మంది పాల్గొంటారు.

ఉద్గారాలు పరిమితం..

భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలను మించితే పరిస్థితి చేజారిపోతుంది. వడగాడ్పులు, కుండపోత వర్షాలు, వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, పంట వైఫల్యాలు, పర్యావరణ సమతుల్యత కుప్పకూలడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయి. సగటు ఉష్ణోగ్రత పెరుగుదల రెండు సెల్సియస్‌ డిగ్రీలకు చేరితే 15.3 కోట్లమంది కేవలం వాయు కాలుష్యంతోనే చనిపోతారు. అందుకే ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ 2050కల్లా అన్ని దేశాలూ కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలని పిలుపిచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్యారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగినా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తమ దేశాన్ని తిరిగి ప్యారిస్‌ ఒప్పందంలో భాగస్వామిని చేశారు. ఒక గడువు లోపల సున్నా కర్బన ఉద్గారాల సాధనకు అన్ని దేశాలనూ ఒప్పించడానికి అమెరికా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. 2050కల్లా తమ కర్బన ఉద్గారాలను ఏ మేరకు తగ్గించేదీ భారత్‌, చైనాలు ఇంతవరకు స్పష్టం చేయలేదు. పాశ్చాత్య దేశాలు ఆర్థికాభివృద్ధి కోసం శతాబ్దానికిపైగా బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను మితిమీరి వినియోగించినందువల్లే ఇవాళ వాతావరణంలో కర్బన ఉద్గారాలు అలవికానంతగా పెరిగిపోయి భూతాపానికి కారణమవుతున్నాయని భారత్‌, చైనా గుర్తుచేస్తున్నాయి. అందుకు పరిహారంగా సంపన్న దేశాలు ఇంతవరకు ప్రకటించినదానికన్నా ఎక్కువ స్థాయిలో ఉద్గారాలను కట్టడి చేయాలని దిల్లీ, బీజింగ్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. మొదట పూర్వ కాప్‌ సమావేశాల్లో ఒప్పుకొన్న ప్రకారం ఉద్గారాలను పరిమితం చేయాలని కోరాయి. వాస్తవంలో కాప్‌ సభలు వాతావరణ మార్పుల నిరోధానికి గంభీరమైన ప్రకటనలైతే చేస్తున్నాయి కానీ, వాటి అమలు మాత్రం నిరాశాజనకంగా ఉంది. గతంలో చేసిన నష్టానికి ఇప్పుడు పరిహారం చెల్లించాలని సంపన్న దేశాల ప్రభుత్వాలను కోరడం బాగానే ఉన్నా, ఆ పని చేసి తమ ఓటర్ల ఆగ్రహానికి ఎర కావడానికి ఏ ప్రభుత్వమూ ముందుకురాదు. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను నెట్‌ జీరో స్థాయికి తగ్గించడమంటే ఆర్థిక వృద్ధికి నీళ్లు వదులుకోవడమేనని ఆందోళన చెందుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కాప్‌-26 సదస్సు వాస్తవిక నిర్ణయాలు తీసుకోవాలి.

దృఢసంకల్పంతో ముందడుగు

ప్రస్తుత సదస్సులో చర్చలు ప్రధానంగా- ఏ దేశానికి ఆ దేశం కర్బన ఉద్గారాల నియంత్రణకు నిర్దేశించుకున్న పరిమితులపైనే జరగనున్నాయి. ఈ పరిమితులను మరింత విస్తరించడం, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచడం, మీథేన్‌ నియంత్రణ, అడవుల క్షయాన్ని అరికట్టడం వంటివి చర్చకు వస్తాయి. ప్రపంచ కర్బన ఉద్గారాల్లో మూడో స్థానం ఆక్రమిస్తున్న భారతదేశం 2015లో తన నిర్దేశిత పరిమితుల్ని ప్రకటించింది. దాని ప్రకారం కర్బనేతర ఇంధనాల వినియోగాన్ని 40శాతానికి పెంచాలి. ఒక యూనిట్‌ జీడీపీ వృద్ధి వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను 2005 స్థాయికన్నా 33-35శాతం తగ్గించాలి. దాదాపు 300 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకోగల స్థాయిలో అడవులను విస్తరించాలి. భారతదేశ తలసరి కర్బన ఉద్గారాలు ఏడాదికి 1.96 టన్నులు. ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలవి 8.4 టన్నులు, అమెరికావి 18 టన్నులు. చైనా తలసరి ఉద్గారాలు ఇంతకన్నా తక్కువే అయినా, మొత్తం కర్బన ఉద్గారాల్లో నాలుగో వంతు ఆ దేశం నుంచే వెలువడుతున్నాయి. కాప్‌-26 సదస్సులో ఈ అంశం చర్చకు రానుంది. చైనా ఇక నుంచి ఇతర దేశాల్లో బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలను నిర్మించబోదని జిన్‌పింగ్‌ ఐరాసలో ఉద్ఘాటించినా, ఇప్పటికీ 70శాతం విద్యుత్‌ కేంద్రాలకు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం కింద చైనాయే నిధులు సమకూరుస్తోంది. 152 దేశాల్లో 26.8 గిగావాట్ల సామర్థ్యం కలిగిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి అయిదు వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేస్తోంది. స్వదేశంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు చైనా విధించుకున్న పరిమితి ఏ మూలకూ చాలదు. ఈ క్రమంలో అన్ని దేశాలూ చిత్తశుద్ధి, దృఢ సంకల్పాలతో ముందడుగు వేస్తేనే వాతావరణ మార్పులను నిరోధించగలం. ఈ కీలక సమయంలో కాప్‌-26 సదస్సు వట్టి మాటలకే పరిమితం కాకుండా గట్టి చేతలు చేపట్టాలి.
ఉద్యమ పంథా

పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కేవలం ప్రభుత్వాలకే విడిచిపెట్టకుండా ఉద్యమకారులు వ్యక్తిగతంగా, సంఘటితంగా ముందడుగేస్తున్నారు. స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్‌ 2018లో ప్రారంభించిన 'ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)' అంతర్జాతీయ యువజన ఉద్యమం ఇక్కడ ప్రస్తావనార్హం. వాతావరణ మార్పుల నిరోధానికి ఈ సంస్థ ఛత్రం కింద యువత ప్రపంచ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతోంది. 2019లో న్యూయార్క్‌లో ఐరాస వాతావరణ కార్యాచరణ సభ జరిగినప్పుడు ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ కార్యకర్తలు పెద్దయెత్తున ధర్నా చేపట్టారు. మరోవైపు, భూతాపం వల్ల సముద్ర మట్టాలు పెరిగి క్రమంగా మునిగిపోతున్న ద్వీప దేశాలు- ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేయనిదే తమ మనుగడ అసాధ్యమని చెబుతున్నాయి. సింగపూర్‌, క్యూబా సహా మొత్తం 39 దేశాలు- చిన్న ద్వీపదేశాల కూటమిగా సంఘటితమై భూతాప కట్టడికి అంతర్జాతీయ వేదికలపై పోరాడుతున్నాయి.

-డాక్టర్​ రాధా రఘురామపాత్రుని

ఇదీ చదవండి:Corona cases: కేరళలో భారీగా తగ్గిన మరణాలు- స్థిరంగా కేసులు

Last Updated :Oct 31, 2021, 5:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.