ETV Bharat / international

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నోబెల్‌?

author img

By

Published : Mar 19, 2022, 8:00 PM IST

Nobel Peace Prize: ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీకి నోబెల్​ శాంతి పురస్కారానికి నామినేట్​ చేయాలని ఐరోపా నేతలు ప్రతిపాదిస్తున్నారు. రష్యన్​ సేనలపై పోరాడుతూనే ఉక్రెయిన్​లో శాంతిభద్రతల కోసం కొనసాగిస్తున్న ప్రయత్నాలు దేశాధినేతలను కదిలిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్​ దరఖాస్తు ప్రక్రియను పొడగించాలని నోబెల్​ కమిటీకి విజ్ఢప్తి చేశారు.

Nobel for Zelensky
జెలెన్​స్కీ

Nobel Peace Prize: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆయుధ సంపత్తి కలిగిన రష్యా చేస్తున్న సైనిక చర్యను ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రష్యా వ్యూహాలకు అందని విధంగా ఉక్రెయిన్‌ సైన్యం చేస్తున్న పోరాటం తీరు యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భీకర దాడులతో రష్యా సేనలు వణికిస్తున్నప్పటికీ తమ పౌరుల వెంటే ఉన్నానంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఆ దేశ పౌరులకు మద్దతుగా నిలుస్తుండడం ఆయనను నిజమైన హీరోగా నిలబెడుతోంది. ఓవైపు ప్రపంచ దేశాల సాయం కోరుతూనే.. మరోవైపు యుద్ధానికి ముగింపు పలకాలని శత్రుదేశంతో చర్చలు కొనసాగిస్తున్న ప్రయత్నాలు దేశాధినేతలను కదిలిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. అయితే, ఈ ఏడాది పురస్కారాల కోసం దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోవడం వల్ల జెలెన్‌స్కీ కోసం దాన్ని పొడగించాలని కోరుతూ యూరోపియన్‌ నేతల నుంచి విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి.

'నోబెల్‌ శాంతి బహుమతికి జెలెన్‌స్కీ నామినేషన్‌ అనుమతించేందుకు గానూ నామినేషన్‌ విధానం, దరఖాస్తు ప్రక్రియను పునఃపరిశీలించండి. ఇందుకోసం దరఖాస్తు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించండి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, ఆ దేశ ప్రజల కోసం నోబెల్‌కు దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి' అని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ యూరోపియన్‌ నేతలు లేఖ రాశారు. అయితే, 2022 నోబెల్‌ బహుమతి కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో దాన్ని తిరిగి తెరవాలని యూరప్‌ నేతలు కోరుతున్నారు. ఇక ఈ ఏడాది నోబెల్‌ బహుమతుల ప్రదానోత్సవం అక్టోబర్‌ 3నుంచి 10 తేదీల్లో జరుగనుండగా.. ఒక్క నోబెల్‌ శాంతి బహుమతి కోసమే ప్రపంచ వ్యాప్తంగా 251 మంది వ్యక్తిగతంగా, 92 సంస్థలూ దరఖాస్తు చేసుకున్నాయి.

ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా చేస్తున్న భీకర దాడులను ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో దాదాపు 14వేల మంది రష్యా సేనలను అంతం చేసినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూస్తోంది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.