ETV Bharat / international

ఇళ్లు, ఆసుపత్రులు, బడులే లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం

author img

By

Published : Mar 19, 2022, 7:51 AM IST

Russia Ukraine Conflict: ఉక్రెయిన్​పై భీకర దాడులు చేస్తున్న రష్యా.. ఆస్పత్రులు, బడులు, ఇళ్లే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ధ బాధితులు తలదాచుకుంటున్న శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఐరాస అంచనాల ప్రకారం యుద్ధారంభం నుంచి 30 లక్షల మందికిపైగా ఉక్రెయిన్‌ వాసులు దేశాన్ని విడిచివెళ్లినట్టు తెలుస్తోంది.

Russia ukraine war
రష్యా ఇక్రెయిన్ యుద్ధం

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై దాడుల్ని రష్యా మరింత ఉద్ధృతం చేసింది. శుక్రవారం కీవ్‌, లివీవ్‌ సహా మరికొన్ని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు, షెల్లింగ్‌లతో విరుచుకుపడింది. పుతిన్‌ సేనలు నివాసాలు, ఆసుపత్రులు, బడులతో పాటు...యుద్ధ బాధితులు తలదాచుకుంటున్న శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపిస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలోని లివీవ్‌ విమానాశ్రయం సమీపంలో మాస్కో సేనలు క్షిపణులతో దాడులు చేశాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్మేశాయి. విమానాశ్రయానికి ఎలాంటి నష్టం జరగలేదని, లివీవ్‌లో ఉదయం 6 గంటలకే మూడు భారీ పేలుళ్లు సంభవించాయని ఓ సైనికుడు తెలిపాడు. గత కొద్దిరోజుల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి సుమారు 2 లక్షల మంది తలదాచుకోవడానికి తరలివచ్చారు. ఐరాస అంచనాల ప్రకారం- యుద్ధారంభం నుంచి 30 లక్షల మందికిపైగా ఉక్రెయిన్‌ వాసులు దేశాన్ని విడిచివెళ్లినట్టు తెలుస్తోంది. వేల మంది చనిపోయినా, కచ్చితంగా ఎంత సంఖ్య అన్నది మాత్రం తెలియడంలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరించవద్దని చైనాను కోరారు. దొనెట్స్క్‌ వేర్పాటువాద బలగాలతో కలిసి రష్యా బలగాలు మేరియుపోల్‌ నడిబొడ్డున శుక్రవారం భీకర పోరాటానికి దిగాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.

Russia Ukraine Crisis

వెంటనే దాడులను ఆపండి: జీ-7 దేశాలు

"పుతిన్‌ ప్రేరేపిత, అవమానకర యుద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి రష్యా వెంటనే ఉక్రెయిన్‌పై దాడులను ఆపాలి. అక్కడి నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవాలి" అని జీ-7దేశాల ఆర్థిక మంత్రులు ఓ ఉమ్మడి ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

  • బ్రిటన్‌ ప్రసార నియంత్రణ సంస్థ 'ఆఫ్‌ కామ్‌'... రష్యా ప్రభుత్వ నిధులతో నడిచే టెలివిజన్‌ ఛానెల్‌ రష్యా టుడే లైసెన్సును రద్దు చేసింది.
  • రష్యాను నిలువరించేందుకు ఆస్ట్రేలియా, జపాన్‌లు తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి. రష్యన్‌ బిలియనీర్లు ఒలేగ్‌ డెరిపాస్కా, విక్టర్‌ వెక్సెల్‌బర్గ్‌ సహా 11 బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలను ఆస్ట్రేలియా తన ఆంక్షల జాబితాలో చేర్చింది. జపాన్‌... మరో 15 మంది రష్యన్‌ కుబేరులతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ ఎగుమతిదారు రోసోబోరోన్‌ ఎక్స్‌పోర్ట్‌ తదితర 9 సంస్థలపై నియంత్ర ఆంక్షలు ప్రకటించింది.

Russia Ukraine Conflict

దాడులకు ఎలా సన్నద్ధమవుతున్నామో రష్యాకు తెలియదు: జెలెన్‌స్కీ

అదనపు సైనిక సాయం అందించినందుకుగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘క్రిమియా మాదిరే ఉక్రెయిన్‌ కూడా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా తమ సొంతమవుతుందని రష్యా భావించింది. కానీ, మా వద్ద శక్తిమంతమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. దాడులను ఎదుర్కోవడానికి మేం ఏ విధంగా సన్నద్ధమవుతున్నామో రష్యాకు తెలియదు’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు- ఉక్రెయిన్‌-రష్యా చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. చర్చల సారాంశాన్ని బయటపెట్టబోననీ... ఫేస్‌బుక్‌, రేడియో, టీవీల్లో చర్చించడం కంటే మరింత ఎక్కువగా పనిచేయడమే సరైన విధానమని నమ్ముతున్నట్టు జెలెన్‌స్కీ చెప్పారు. మరో పక్క ఉక్రెయిన్‌లో అమెరికా జీవాయుధ కార్యకలాపాలు చేపడుతోందని రష్యా చేసిన ఆరోపణలపై ఐరాస భద్రతా మండలిలో వేడిగా వాడిగా చర్చ జరిగింది. దీన్ని అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ తీవ్రంగా ఖండించారు.

చెర్నిహైవ్‌లో మృతదేహాల గుట్టలు...

కీవ్‌లోని ఓ భవనంపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ ధాటికి అక్కడ ఓ వ్యక్తి మరణించడంతో, 98 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. క్రామటోర్స్క్‌లోని ఓ నివాస సముదాయంతో పాటు పాలనా భవనంపైనా పుతిన్‌ సేనలు బాంబులు కురిపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర ప్రాంతంలోని చెర్నిహైవ్‌లో మృతదేహాలు డజన్లకొద్దీ పడి ఉన్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలోనే యుద్ధ గాయాల కారణంగా అక్కడ 53 మంది మృతిచెందారు.

ఇదీ చదవండి: పీకల్లోతు కష్టాల్లో పాక్​ ప్రధాని​.. పదవి పోవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.