ETV Bharat / international

అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా- 45 మంది మృతి

author img

By

Published : Jul 13, 2021, 4:49 PM IST

Updated : Jul 13, 2021, 9:06 PM IST

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు జైలు శిక్ష విధింపుతో మొదలైన దొమ్మీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై దాడి చేస్తున్న స్థానికులు.. అందినకాడికి దోచుకుపోతున్నారు. మరోవైపు హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 45 మంది మరణించారు.

SA, protests
దక్షిణాఫ్రికా, అల్లర్లు

అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా

నల్ల సూరీడు నెల్సన్‌ మండేలా నడయాడిన నేల.. అల్లర్లు, లూటీలతో అట్టుడుకుతోంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు జైలు శిక్ష విధింపుతో మొదలైన దొమ్మీలు ఉద్రిక్తతకు దారి తీశాయి. భద్రతా బలగాలు-స్థానికుల మధ్య ఘర్షణలతో.. వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై దాడి చేస్తున్న స్థానికులు.. అందినకాడికి దోచుకుపోతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 45 మంది మరణించారు. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు రామాఫోసా అనుమానం వ్యక్తం చేశారు.

తారస్థాయికి..

కోర్టు ధిక్కరణ కేసులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో ప్రారంభమైన అల్లర్లు తారస్థాయికి చేరాయి. మూడో రోజులుగా జరుగుతున్న అల్లర్లతో దక్షిణాఫ్రికా అట్టుడుకుతోంది. అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లో మొదలైన అలర్లు.. అత్యధిక జనాభా కలిగిన గౌటెంగ్‌కు వ్యాపించాయి.

జోహన్నెస్‌బర్గ్‌లో పేద ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య సముదాయాలు, దుకాణాలపై వేలాది స్థానికులు దోపిడీకి తెగబడ్డారు. అందినకాడికి దోచుకున్నారు. పోలీసుల బెదిరింపులను బేఖాతరు చేస్తూ.. స్థానికులు దొమ్మికి దిగుతున్నారు. ఆంక్షలను ధిక్కరిస్తూ క్వాజుల్‌, నాటాల్, గౌటెంగ్ ప్రావిన్సులలో పదుల సంఖ్యలో దుకాణాల్లో దోపిడీకి దిగారు. ఈ దోపిడీల నేఫథ్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని సంపన్న ప్రాంతాల్లో ఉన్న మాల్స్‌, రిటైల్ కేంద్రాలను మూసివేశారు. వేలాది మంది దుకాణాలపై దాడికి పాల్పడుతుండడం వల్ల వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు.

protest, south africa
ధ్వంసమైన దుకాణాలు
south africa protest
మిషన్​ ధ్వంసం

సైన్యం సాయంతో..

దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా నష్ట నివారణ చర్యలకు దిగారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన మూడు రోజులుగా ప్రధాన నగరాల్లో ప్రబలుతున్న హింస, దోపిడిని అరికట్టే ప్రణాళికను ప్రకటించారు. దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు రామాఫోసా సైన్యం సాయాన్ని అర్థించారు.

south africa protest
వస్తువులు దోచుకెళ్తున్న స్థానికులు

అందుబాటులో ఉన్న వనరులు, సామర్థ్యాలను వినియోగించుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, భద్రతా సిబ్బంది సెలవులను రద్దు చేశారు. శాంతి, భద్రతల రక్షణకు సైన్యానికి సర్వాధికారాలు అప్పగించినట్లు రామాఫోసా వెల్లడించారు. ఈ అల్లర్లు ప్రజాస్వామ్య చరిత్రలో అరుదుగా కనిపించే హింసగా ఆయన అభివర్ణించారు. హింస, బెదిరింపు, దొంగతనం, దోపిడీ నుంచి దేశంలోని ప్రతి ఒక్కరిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న రామాఫోసా.. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు.

zuma arrest
దుకాణంలో చొరబడ్డ స్థానికులు

దక్షిణాఫ్రికాలో హింసను, దోపిడీని ప్రతిపక్ష పార్టీలు, పౌర సంస్థలు.. ముక్త కంఠంతో ఖండించాయి. అనవసర భయాందోళనలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశాయి.

SA, zuma arrest
భద్రతా బలగాలు- స్థానికుల మధ్య ఘర్షణ

ఇదీ చదవండి:జుమా అరెస్టుతో చెలరేగిన అల్లర్లు- ఆరుగురు మృతి

Last Updated :Jul 13, 2021, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.