ETV Bharat / entertainment

'కాంతార' మూవీపై రాజమౌళి కామెంట్స్​.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందేనంటూ..

author img

By

Published : Dec 10, 2022, 6:48 PM IST

'కాంతార' ఫిల్మ్‌ మేకర్స్‌ అందరినీ ఒత్తిడిలోకి నెట్టేసిందని, ఇక నుంచి ప్రతి ఒక్కరూ ఎలా సినిమా తీస్తున్నారో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అగ్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆయన ఇంకెమన్నారంటే?

ss rajamouli about kantara movie
కాంతార సినిమా కలెక్షన్లు

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి 'కాంతార' చిత్రంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో సినిమా నిర్మాణ విషయంలో పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'కాంతార'. కన్నడ చిత్రంగా విడుదలై, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం రూ.16కోట్ల సినిమాను తీస్తే, ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణ విషయంపై రాజమౌళి మాట్లాడారు. చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లు రాబడతాయని 'కాంతార' నిరూపించిందన్నారు. "భారీ బడ్జెట్‌ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమే. సడెన్‌గా 'కాంతార' వచ్చి, కలెక్షన్ల మేజిక్‌ చేసింది. భారీ కలెక్షన్లు రాబట్టాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు. 'కాంతార'లాంటి సినిమాలు కూడా ఆ పని చేస్తున్నాయి. సినిమాలో భారీదనం ఉండాలనుకునే నాతో పాటు, నాలాంటి ఫిల్మ్‌ మేకర్స్‌ను ఈ మూవీ ఒత్తిడిలోకి నెట్టేసింది. చిత్ర నిర్మాణ ప్రక్రియను పునః సమీక్షించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్రేక్షకుల పరంగా చూస్తే నిజంగా ఇదొక ఉత్సాహమే. కానీ, సినిమాను తెరకెక్కించే వాళ్లు దృష్టి కోణం నుంచి చూస్తే, కచ్చితంగా మనం ఏం తీస్తున్నామో వెనక్కి వెళ్లి మరీ ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి" అని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్‌ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరోవైపు ఈ సినిమా ఆస్కార్‌ క్యాంపెయిన్‌లో రాజమౌళి బిజీగా ఉన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత మహేశ్‌బాబు కథానాయకుడిగా యాక్షన్‌ అడ్వెంచర్‌ కథా నేపథ్యంలో రాజమౌళి ఓ సినిమా తీయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.